ఆ దాడిలో తాలిబన్ సీనియర్ కమాండర్ మృతి

Published: Wed, 03 Nov 2021 11:44:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆ దాడిలో తాలిబన్ సీనియర్ కమాండర్ మృతి

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని నగరం కాబూల్‌లోని సైనిక ఆసుప్రతిపై మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో తాలిబన్ సీనియర్ కమాండర్ హమ్‌దుల్లా మొఖ్లిస్ మరణించినట్లు తాలిబన్ అధికారులు బుధవారం తెలిపారు. ఈ ఉగ్రవాద దాడిలో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి బాధ్యత తమదేనని ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. 


మొఖ్లిస్ ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్ సభ్యుడు, ప్రత్యేక దళాల అధికారి కూడా. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత మరణించిన ఆ సంస్థ ఉగ్రవాదుల్లో మొఖ్లిస్ సీనియర్. 


తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్‌లో హింసాకాండ తీవ్రంగా ఉంది. ఉగ్రవాద దాడులు ఆ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం జరిగిన దాడి గురించి ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్ ఉగ్రవాద సంస్థ తన టెలిగ్రామ్ చానల్‌లో వివరించింది. ఐదుగురు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఫైటర్లు ఏకకాలంలో సమన్వయంతో దాడులు చేశారని తెలిపింది. 


తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, ఈ దాడిని 15 నిమిషాల్లోనే తిప్పికొట్టినట్లు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఆసుపత్రిలోని రోగులు, వైద్యులు, సామాన్యులపై దాడి చేయాలనుకున్నారన్నారు. అమెరికా మద్దతుతో ఏర్పడిన గత ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్న హెలికాప్టర్లలో ఒకదాని ద్వారా తాలిబన్ స్పెషల్ ఫోర్సెస్‌ను ఈ ఆసుపత్రి పై కప్పుపైకి దించినట్లు తెలిపారు. 


ఈ దాడి గురించి ఆఫ్ఘనిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఆత్మాహుతి బాంబర్ ఆసుపత్రి ప్రవేశ మార్గంలో తనను తాను పేల్చుకున్నాడని, ఆ తర్వాత అతనితోపాటు వచ్చిన గన్‌మెన్ ఆసుపత్రిలోకి చొరబడి కాల్పులు జరిపారని చెప్పారు. ఈ దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 50 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.