దేశంలో సంచలనం ఖాయం!

ABN , First Publish Date - 2022-05-22T08:41:20+05:30 IST

దేశంలో సంచలనం జరగబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

దేశంలో సంచలనం ఖాయం!

  • తప్పక జరుగుతుంది.. వేచి చూడండి
  • ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు
  • కేజ్రీవాల్‌, అఖిలేశ్‌యాదవ్‌తో కేసీఆర్‌ భేటీ
  • రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టడంపై చర్చలు 
  • జాతీయ విద్యావిధానంతో అన్నీ సమస్యలే
  • కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలు తగవు
  • ఢిల్లీలో పాఠశాలలు అద్భుతం: కేసీఆర్‌
  • కేజ్రీవాల్‌తో కలిసి పాఠశాల సందర్శన


న్యూఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): దేశంలో సంచలనం జరగబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కచ్చితంగా జరుగుతుందని, వేచి చూడండని వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌లతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికకు ప్రాంతీయ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై వారితో చర్చలు జరిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా అందరికీ ఆమోదయోగ్యమైన నేతను నిలబెట్టడం ప్రస్తుతం చారిత్రక అవసరమని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడినట్లు తెలిసింది. అదే సమయంలో ఒక జాతీయ అజెండాను, దేశానికి ప్రత్యేక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కలిసికట్టుగా రూపొందించాలనే కేసీఆర్‌ అభిప్రాయంతో అఖిలేశ్‌ యాదవ్‌ ఏకీభవించినట్లు సమాచారం. కేసీఆర్‌ను కలిసేందుకు అఖిలేశ్‌యాదవ్‌ లఖ్‌నవ్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఆయనను కేసీఆర్‌ స్వయంగా తన తుగ్లక్‌రోడ్‌ నివాసం వెలుపలికి వచ్చి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. 


అనంతరం అఖిలేశ్‌తో కలిసి భోజనం చేశారు. గంటకు పైగా దేశ రాజకీయాల గురించి చర్చించారు. రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం గురించి ఇరువురు నేతలు చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దేశంలో బీజేపీని ఎదుర్కొనగలిగే శక్తిని కాంగ్రెస్‌ కోల్పోయిందని, ఈ దశలో ప్రాంతీయ పార్టీలు సంఘటితం కావడం తప్పనిసరి అనే అభిప్రాయానికి కేసీఆర్‌, అఖిలేశ్‌ వచ్చినట్లు తెలిసింది. దేశ పాలనలోనే మార్పు తీసుకురావాలని, విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని వారు చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌, తెలంగాణలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. అఖిలేశ్‌తో సమావేశంపై కేసీఆర్‌ను మీడియా ప్రశ్నించగా, ‘‘ఇద్దరు వ్యాపారులు కలిస్తే వ్యాపారం గురించి మాట్లాడుకుంటారు. రాజకీయ నాయకులు కలుసుకుంటే రాజకీయాలు తప్ప ఏమి మాట్లాడుకుంటారు? దేశంలో సంచలనం జరుగుతుంది.. వేచి చూడండి’’ అని అన్నారు. కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సంతోష్‌కుమార్‌, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికాబోర్డు ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఉన్నారు. 


మనది సమాఖ్య వ్యవస్థ అని మరవద్దు..

ఎవరినీ సంప్రదించకుండా రూపొందించిన జాతీయ విద్యావిధానంతో సమస్యలు ఎదురవుతాయి తప్ప.. విజయవంతం కాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఏ విధానాన్నయినా రూపొందించవచ్చు. కానీ, ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా రూపొందించకూడదు. మనది ప్రజాస్వామ్య దేశం. సమాఖ్య వ్యవస్థ అని రాజ్యాంగంలోని మొదటి పేజీలోనే పేర్కొని ఉంది. ఆ విషయాన్ని కేంద్రం మరిచిపోకూడదు’’ అని అన్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలోని దక్షిణ మోతీభాగ్‌ ప్రాంతంలో ప్రభుత్వ సర్వోదయ పాఠశాలను  కేసీఆర్‌ సందర్శించారు. పాఠశాల ప్రాంగణంలో వారికి ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా స్వాగతం పలికారు. విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్‌ను సీఎం కేసీఆర్‌ తిలకించారు. పాఠశాలో కలియదిరుగుతూ తరగతి గదులను పరిశీలించారు.


అనంతరం ఇద్దరు సీఎంలు కలిసి మీడియాతో మాట్లాడారు. విద్య విషయంలో ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ప్రశంసనీయమని, పాఠశాలలు అద్భుతమని కేసీఆర్‌ అన్నారు. అయితే ఢిల్లీ మోడల్‌ను తెలంగాణలో అవలంబించబోమని, కానీ.. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలను, ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపించి శిక్షణ ఇప్పిస్తామన్నారు. కాగా, ఢిల్లీలో చేస్తున్న మంచి పనులను కేసీఆర్‌ నేర్చుకుంటున్నారని, తెలంగాణలో జరిగే మంచి పనులను తాము కూడా నేర్చుకుంటామని కేజ్రీవాల్‌ అన్నారు. మహ్మద్‌పూర్‌లోని మొహల్లా క్లినిక్‌ను కూడా కేసీఆర్‌ సందర్శించారు. అనంతరం ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్‌రాయ్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. 

Updated Date - 2022-05-22T08:41:20+05:30 IST