2-3 నెలల్లో సంచలన వార్త

ABN , First Publish Date - 2022-05-27T08:36:15+05:30 IST

‘‘కిందటిసారి కర్ణాటక ఎన్నికలకు ముందు... కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వస్తానని నేను చెప్పాను.

2-3 నెలల్లో సంచలన వార్త

  • జాతీయ స్థాయిలో మార్పు తథ్యం.. దాన్నెవరూ అడ్డుకోలేరు
  • రైతులు, దళితులు, ఆదివాసీలు ఎవరూ సంతోషంగా లేరు
  • ప్రసంగాలు తప్ప ఒరిగిందేమీ లేదు.. దేశానికి ‘ప్రత్యామ్నాయ’ శక్తి అవసరం
  • మాజీ ప్రధాని దేవెగౌడతో సమగ్రంగా చర్చించా.. బెంగళూరులో సీఎం కేసీఆర్‌
  • హైదరాబాద్‌కు తిరిగి రాక.. నేటి రాలేగావ్‌ సిద్ది పర్యటన రద్దు?
  • విజయదశమి సమయంలో సంచలన ప్రకటన: జేడీఎస్‌ నేత కుమారస్వామి


బెంగళూరు, జగదేవ్‌పూర్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘కిందటిసారి కర్ణాటక ఎన్నికలకు ముందు... కుమారస్వామి  ప్రమాణ స్వీకారానికి వస్తానని నేను చెప్పాను. నా మాటలు నిజమయ్యాయి. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి మీకు హామీ ఇస్తున్నా. జాతీయస్థాయిలో మార్పు రాబోతోంది. దాన్ని ఎవరూ ఆపలేరు. 2-3 నెలల తర్వాత మీకు సంచలన వార్త అందుతుంది’’ ..అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బెంగళూరులో విలేకరుల సమావేశంలో అన్నారు!  గురువారం ఆయన బెంగళూరులో జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీ జాతీయ నేత మాజీ ప్రధాని దేవెగౌడను, ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిసి మాట్లాడారు. సుమారు రెండున్నర గంటలపాటు వారి చర్చలు జరిగాయి. అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం కనుకనే వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నానని వెల్లడించారు. ‘‘ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేస్తారు? ఎవరు చేయరనేది ప్రశ్న కాదు. 


దేశంలో ఇప్పటికే అనేక ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఎందరో ప్రధానులయ్యారు. కానీ.. దేశం పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. మనకన్నా వెనకబడి ఉన్న చైనా, మనకన్నా తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇప్పుడు 16 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారింది. అదే సమయంలో మన దేశం 5 ట్రిలియన్‌ డాలర్ల దిశగా కలలు కంటోంది. ఇది మనదేశానికి అవమానం. మనసు పెట్టి కృషి చేస్తే మన దేశం అమెరికా కన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలదు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువ మానవ వనరులు మనదేశంలో ఉన్నాయి. యువశక్తి ఇక్కడే ఎక్కువ ఉంది. ఉష్ణమండల వాతావరణం ఉంది. నదుల్లో వందల టీఎంసీల నీళ్లున్నాయి. సౌరశక్తి అందుబాటులో ఉంది. ఇవన్నీ ఉన్నా.. 75 ఏళ్ల స్వాతంత్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న వేళ.. మనం విద్యుత్తు కోసం, తాగు, సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం కాంగ్రె్‌సతో ఏర్పాటవుతుందా? కాంగ్రెస్‌ లేకుండా ఏర్పడుతుందా? బీజేపీ సర్కారు ఏర్పాటవుతుందా? ఇవి కాదు.. ఉజ్వల హిందుస్థాన్‌ కావడానికి అన్నివిధాల కృషి చేయాలి. మనతోపాటు స్వాతంత్య్రం పొందిన దేశాలన్నీ ఎంతో ముందుకెళ్లిపోయాయి.  రైతులు, దళితులు, ఆదివాసీలు.. ఎవరూ సంతోషంగా లేరు. మరెవరు సంతోషంగా ఉన్నారు? పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రసంగాలు చాలా చెబుతున్నారు. 


వాగ్దానాలు చాలా చేస్తున్నారు. కానీ, వాస్తవంలో ఏం జరుగుతోంది? పరిశ్రమలు మూతబడుతున్నాయి. జీడీపీ పడిపోతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమవుతోంది’’ అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ మారాలని.. రాజకీయాలకు, రాజకీయ నాయకులకు, ఇజాలకు అతీతంగా ఎదగాలని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా మారుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. మారడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని.. ఇందుకు బుద్ధిజీవులు, పాత్రికేయులు, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జాతి నిర్మాణంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. పరిస్థితులు అసలే దిగజారుతున్నందున.. పాత్రికేయులంతా సంచలనాలను, వివాదాస్పద వార్తలను పక్కన పెట్టి, దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లే చర్చలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. బెంగళూరులో సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లావాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీఆర్‌ఎస్‌ నాయకుడు కుంబాల ప్రవీణ్‌ రెడ్డి నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు. స్థానిక పారిశ్రామికవేత్తలతో ముచ్చటించారు. అనంతరం ప్రవీణ్‌రెడ్డి కుటుంబసభ్యులు సీఎం కేసీఆర్‌ను ఘనంగా సన్మానించారు.


విజయదశమి సమయంలో..

కేసీఆర్‌ తిరుగు ప్రయాణమయ్యాక, జేడీఎ్‌స నేత, మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా విజయదశమి జరుపుకొనే రోజుల్లోనే విజయవంతమయ్యే సంచలన ప్రకటన రానుందని అన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ విబేధాలను పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల రీత్యా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ చర్యలు భారత భవిష్యత్తుకు పునాదులు వేస్తాయని పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-27T08:36:15+05:30 IST