పైసలిస్తేనే పదోన్నతులు.. GHMCలో ఇదో దందా.. రేటు కట్టి మరీ వసూళ్లు..!

ABN , First Publish Date - 2022-02-03T12:11:46+05:30 IST

సీనియారిటీ, నిబంధనల ప్రకారం జరగాల్సిన బదిలీలు, పదోన్నతులు

పైసలిస్తేనే పదోన్నతులు.. GHMCలో ఇదో దందా.. రేటు కట్టి మరీ వసూళ్లు..!

  • పాలనా విభాగంలో వసూల్‌ రాజాలు
  • నిబంధనల పేరిట మెలిక

హైదరాబాద్‌ సిటీ : సీనియారిటీ, నిబంధనల ప్రకారం జరగాల్సిన బదిలీలు, పదోన్నతులు జీహెచ్‌ఎంసీలో ఆదాయ వనరులుగా మారాయి. కేడర్‌, బదిలీ కోరుకుంటున్న ప్రాంతం ఆధారంగా రేటు కట్టి మరీ కొందరు అధికారులు వసూళ్లకు తెగబడుతున్నారు. ఈ విషయంలో నాలుగో తరగతి ఉద్యోగులనూ వదలకపోవడం గమనార్హం. ఏళ్లుగా పాలనా విభాగంలో పాతుకుపోయిన కొందరు ఉద్యోగులు, అధికారులు అలవాటైన అవినీతిని అదే పనిగా కొనసాగిస్తున్నట్టు చెబుతున్నారు. రెండు వారాల క్రితం జరిగిన పదోన్నతులు, బదిలీల సమయంలో రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆఫీస్‌ సబార్డినేట్‌(అటెండర్‌) నుంచి రికార్డ్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల జాబితాపై కసరత్తు జరుగుతుండగా.. ఆటంకాలు లేకుండా ఆమోదం పొందాలంటే అంటూ బేరసారాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియారిటీ, అర్హత లేని వారితోపాటు పదోన్నతి పొంది ఏడాది పూర్తవని వారి పేర్లూ జాబితాలో చేరుతున్నాయని సమాచారం. ఇదంతా పాలనా విభాగంలోని వసూళ్ల అధికారుల తీరు వల్లే అని నాలుగో తరగతి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.


నచ్చిన.. అడిగినంత.. ఇచ్చిన వారికి..!

జీహెచ్‌ఎంసీలో 15 రోజుల క్రితం జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతులిచ్చారు. ఈ క్రమంలో కొందరిని బదిలీ చేశారు. వాస్తవంగా సీనియారిటీ, అర్హత ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలి. సంస్థలోని పాలనా విభాగంలో మాత్రం పూర్తి భిన్న పరిస్థితులున్నాయి. నిబంధనలకు నీళ్లొదులుతూ నచ్చిన, అడిగినంత ఇచ్చిన వారి పేర్లు పదోన్నతుల జాబితాలో చేరుతున్నాయన్న ఆరోపణలున్నాయి. రెండు పదోన్నతుల జాబితాల పేరిట కొందరు అధికారులు రూ.10 లక్షలకుపైగా వసూలు చేశారని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం పాలనా విభాగం పరిశీలనలో ఉన్న ఆఫీస్‌ సబార్డినేట్‌ల పదోన్నతుల విషయంలోనూ ఇదే జరుగుతున్నట్టు తెలుస్తోంది. 


లేని నిబంధనలు చూపుతూ పరోక్షంగా బేరం కుదుర్చుకోవాలనే సంకేతాలిస్తున్నారని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. ప్రసాదరావు కమిటీ ప్రకారం బల్దియాలో 200 రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెబుతున్నారు. 100కుపైగా రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి పురపాలక శాఖ అనుమతి ఇచ్చిందని ఓ ఉద్యోగి చెప్పారు. ఎంసీహెచ్‌ యాక్ట్‌ ప్రకారం కేవలం 85 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, ఆ మేరకు పదోన్నతులిస్తామని పాలనా విభాగంలోని అధికారులు మెలిక పెడుతున్నట్టు సమాచారం. సూపరింటెండెంట్‌, ఏఎంసీ, డీఎంసీ, జేసీ స్థాయి పదోన్నతులు ప్రసాదరావు కమిటీ సిఫారసు ప్రకారం చేస్తోన్న అధికారులు తమ విషయంలో ఆ నిబంధనలు ఎందుకు అమ లు చేయరని నాలుగో తరగతి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.


ఫైల్‌ ఆమోదం.. పార్టీ..

సర్కిల్‌ కార్యాలయంతో పాటు, కేంద్ర కార్యాలయం పాలనా విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఓ అధికారి అన్నీ తానై తతంగం నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో సర్కిల్‌కు బదిలీ చేశారు. ఓ ఉన్నతాధికారి ప్రత్యేక శ్రద్ధతో ఆయనను తిరిగి కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చి కీలక పోస్టులో ఇన్‌చార్జిగా కూర్చోబెట్టినట్టు తెలిసింది. ఆ అధికారి నుంచి ఫైల్‌ ముందుకు కదలాలంటే.. పనిని బట్టి ముట్టచెప్పుకోవాల్సి ఉంటుంది. పాలనా విభాగంలోని మరో ఇద్దరు, ముగ్గురు అధికారులదీ అదే తీరు. జాబితాలో ఉన్న పేర్ల సంఖ్య, పదోన్నతులు, బదిలీ స్థానాలను బట్టి వారంతా భారీ మొత్తాన్ని వసూలు చేస్తారని సమాచారం. 


వసూలు చేసిన మొత్తంలో కొందరు ఉన్నతాధికారులకు కూడా వాటాలు వెళ్తాయని ప్రచారం. పదోన్నతులు, బదిలీల బాధ్యతను కమిషనర్‌ డీఎస్‌ లోకే‌ష్ కుమార్‌ ఓ ఉన్నతాధికారికి అప్పగించినట్టు తెలిసింది. ఆయన కూడా అవినీతిని అంతగా పట్టించుకోకుండా.. కిందిస్థాయి అధికారులకు వత్తాసు పలికారని ఆరోపణలు ఉన్నాయి. రెండు వారాల క్రితం పదోన్నతులు, బదిలీ ఫైల్‌ ఆమోదం పొందగా.. వసూల్‌ రాజాలు  కేంద్ర కార్యాలయంలోని కొందరు ఉన్నతాధికారులకు విందు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2022-02-03T12:11:46+05:30 IST