CM KCR ఈ విషయాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నా.. పదే పదే ఎందుకిలా జరుగుతోంది.. పోలీసుల కన్నా ముందే..!

ABN , First Publish Date - 2022-06-02T19:17:08+05:30 IST

CM KCR ఈ విషయాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నా.. పదే పదే ఎందుకిలా జరుగుతోంది.. పోలీసుల కన్నా ముందే..!

CM KCR ఈ విషయాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నా.. పదే పదే ఎందుకిలా జరుగుతోంది.. పోలీసుల కన్నా ముందే..!

  • Target హైదరాబాద్..
  • డ్రగ్స్‌ విక్రయాలకు కేంద్రంగా నగరం
  • సగటున మూడు రోజులకో కేసు
  • ఈ ఏడాది భారీగా మాదకద్రవ్యాల సరఫరా..
  • విదేశాలకూ ఇక్కడి నుంచే..

హైదరాబాద్‌ సిటీ : నగరంలో డ్రగ్‌ సరఫరా, వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దశాబ్ద కాలం క్రితం అక్కడక్కడ ఏడాదికి రెండు మూడు కేసులు నమోదు కాగా, ప్రస్తుతం రెట్టింపునకు మించి నమోదవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభానికి ముందే సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు హుకుం జారీ చేశారు. 1000 మంది సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు హెచ్‌-న్యూ పేరుతో కొత్త విభాగం ఏర్పాటైంది. కానీ, రోజురోజుకూ పట్టుబడుతున్న డ్రగ్స్‌ చూస్తే పోలీసుల ముందు పెద్ద సవాలే ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నగరంలో స్థావరాలు ఏర్పాటు చేసి విదేశాలకు సైతం పంపిణీ చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.


పోలీసుల కన్నా ముందు..

డ్రగ్స్‌ విక్రయాలను, వినియోగదారులను అరికట్టడానికి పోలీసులు పలు విధాలుగా ప్లాన్‌ చేస్తున్నారు. కానీ, డ్రగ్స్‌ సరఫరాదారులు వారి కంటే మరో రెండు అడుగులు ముందు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వారాల క్రితం పోలీస్‌ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న దోమల్‌గూడలో డ్రగ్స్‌ హబ్‌ను ఏర్పాటు చేసినా పోలీసులు గుర్తించలేకపోయారు. నగరం నుంచి ఏకంగా అమెరికా వరకూ ఇంటర్నెట్‌ ఫార్మసీ అనే కంపెనీ ద్వారా మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఎన్‌సీబీ అధికారులు గుర్తించారంటే డ్రగ్స్‌ సప్లయర్లు ఎలా వేళ్లూనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.


డ్రగ్స్‌ ప్రధాన సరఫరాదారుడు టోనీ అరెస్టుకు ముందు పోలీసులు జరిపిన అరెస్టుల్లోనూ నగరంలోని ప్రధాన వ్యాపారులే ఉండటం కూడా ఆందోళన కలిగించే అంశం. ఇటీవల నారాయణగూడ పోలీసులు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు రోజు మంగళ్‌హాట్‌ పోలీసులు కొకైన్‌ సరఫరా చేస్తున్న గ్యాంగును అరెస్టు చేసి వారి నుంచి 56 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. రెండు వారాల క్రితం 225 గ్రాముల బ్రౌన్‌షుగర్‌, 28 కేజీల గంజాయిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా మే నెలలోనే సగటున ప్రతి మూడు రోజులకు ఓ కేసు వెలుగుచూసింది.


పట్టుబడుతుంది కొంతే..

దేశంలో ఎక్కడా లేని విధంగా వందల కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్‌ నగరానికి తరలుతున్నాయి. ఇక్కడి నుంచి దేశ విదేశాలకూ సరఫరా అవుతున్నాయి. నగరంలో పోలీసులు, ఎన్‌సీబీ అధికారులకు చిక్కినవి మాత్రమే కాకుండా ఎయిర్‌ పోర్టులోనూ విదేశీ ప్యాసింజర్ల వద్ద భారీ మోతాదులో మాదకద్రవ్యాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎన్‌సీబీ, ఎయిర్‌పోర్టుతో పాటు డ్రగ్స్‌ను అరికట్టేందుకు పని చేస్తున్న సంస్థల అధికారులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల నగర సీపీ సీవీఆనంద్‌ ప్రకటించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. పోలీసులు నిఘా పెంచినా, నిందితులను అరెస్ట్‌ చేస్తున్నా సరఫరాదారులు హైదరాబాద్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. మద్యం షాప్‌లు, మసాజ్‌ సెంటర్లు, పబ్‌లు, బార్‌లలో డ్రగ్స్‌ విక్రయాలు సాగుతున్నాయనే ఆరోపణలకు ఇటీవల వెలుగు చూసిన ఘటనలు అద్దం పడుతున్నాయి. పోలీసులు, నార్కో, డ్రగ్స్‌ విభాగాలతో పాటు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు సైతం వీరిని అడ్డుకోలేక పోతున్నారంటే వీరి నెట్‌వర్క్‌ ఎంత వరకు పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. హెచ్‌-న్యూ అధికారులు కూడా ఆశించిన స్థాయిలో డ్రగ్స్‌ కేసులు ఛేదించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.



Updated Date - 2022-06-02T19:17:08+05:30 IST