అవుట్‌డోర్‌ లైబ్రరీ

ABN , First Publish Date - 2022-06-26T17:31:13+05:30 IST

కరోనా వల్ల రెండేళ్లు ఇళ్లల్లో గడిచిపోయాయి. ఇప్పుడైనా ప్రజలు బయటికి రావాలి. లేదు లేదు రప్పించాలి. ఏదో సినిమాకో

అవుట్‌డోర్‌ లైబ్రరీ

కరోనా వల్ల రెండేళ్లు ఇళ్లల్లో గడిచిపోయాయి. ఇప్పుడైనా ప్రజలు బయటికి రావాలి. లేదు లేదు రప్పించాలి. ఏదో సినిమాకో షికారుకో అని కాదు. ఆరుబయట గంటలు గంటలు కూర్చుని పుస్తకాలు చదవడానికి. ఈ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే మనం సియోల్‌కి వెళ్లాలి. 

దక్షిణకొరియా రాజధాని సియోల్‌. అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యంలా ఉంటుంది ఆ నగరం. కరోనా కోరల్లో కొరియా కూడా విలవిల్లాడి ఇప్పుడిప్పుడే కుదుటపడింది. సామాజిక దూరం ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేసింది. రెండేళ్లుగా ఇంటికే పరిమితమైన ప్రజల జీవనంలో మార్పులు తీసుకువచ్చేందుకు ‘అవుట్‌డోర్‌ లైబ్రరీ’ పథకాన్ని తీసుకువచ్చింది. అన్ని ప్రాంతాలలో ఉండే మాదిరిగానే ఈ లైబ్రరీ ఉంటుందని అనుకుంటే పొరపాటే. 

మూడు వేల పుస్తకాలు

సియోల్‌ మహానగరం మధ్యలో ఉన్న సియోల్‌ ప్లాజాలో ప్రతి శుక్ర, శని వారాల్లో ఓపెన్‌ లైబ్రరీని ఏర్పాటుచేస్తారు. వాస్తవానికి 1300 చదరపు మీటర్ల గోళాకార ప్లాజా ఓ పార్కు. పచ్చని గడ్డితో తివాచీ పరచినట్టుగా ఉంటుంది. అవుట్‌డోర్‌ లైబ్రరీ రోజుల్లో ఇక్కడ టేబుళ్ల లో మూడు వేల పుస్తకాలు పెడతారు. అలాగే వచ్చిన వాళ్లు కూర్చునేలా బీన్‌ బ్యాగ్‌లు, చాపలు ఉంటాయి. సమయం మాత్రం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే. ఎవరైనా ఈ సమయంలో ఇక్కడికి వచ్చి నచ్చిన పుస్తకాన్ని చదువుతూ పచ్చిక మీద ఎంత సేపైనా కూర్చోవచ్చు. వయోనిబంధన కూడా లేదు. ఏదో ఓ పుస్తకం అనుకోవడానికి కూడా లేదు. ‘సంతోషం’, ‘భవిష్యత్తు’, ‘కలిసి ఉండడం’, ‘సానుభూతి’ తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి.. పక్కనే సియోల్‌ మెట్రోపాలిటన్‌ లైబ్రరీ ఉంది. అక్కడి నుంచి కూడా పుస్తకాలు అద్దెకు తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా పుస్తక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు. నెలలో ఓ ప్రసిద్ధ రచయితతో ప్రసంగం కూడా ఏర్పాటుచేస్తారు. అయితే వర్షాలు పడిన రోజున దీన్ని మూసేస్తారు. అన్ని ఏర్పాట్లనూ ప్రభుత్వమే నిర్వహిస్తోంది.

ఏప్రిల్‌లో ప్రారంభమైన అవుట్‌డోర్‌ లైబ్రరీకి విశేష స్పందన లభించింది. ఇంటిల్లిపాదీ పుస్తకాలు చదువుతూ ఆరుబయట ఆటవిడుపుగా గడుపు తున్నారు. అక్టోబరు వరకూ ఈ లైబ్రరీని నిర్వహిస్తారు. ఏదో అలా పార్కుకి వచ్చారు అని కాకుండా పుస్తకాల పట్ల ఆసక్తిని కలిగించడం, ఆరుబయట గడపడం ఆరోగ్యానికీ మంచిదనే పెద్ద ఉద్దేశమే ఉంది ఈ ఆలోచనలో.

Updated Date - 2022-06-26T17:31:13+05:30 IST