Hyderabad లో పట్టపగలే భారీ చోరీ.. రెండు రోజుల్లోనే.. ఆ గ్యాంగ్ పనేనా..!?

ABN , First Publish Date - 2021-08-04T15:20:11+05:30 IST

పట్టపగలు గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లో చొరబడి భారీ

Hyderabad లో పట్టపగలే భారీ చోరీ.. రెండు రోజుల్లోనే.. ఆ గ్యాంగ్ పనేనా..!?

  • బడంగ్‌పేట్‌లో సంఘటన
  • 18లక్షల నగదు, 36 తులాల నగలు అపహరణ
  • రెండు రోజుల్లో రెండు దొంగతనాలు..

హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : పట్టపగలు గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లో చొరబడి భారీ మొత్తంలో నగదుతోపాటు బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. రెండ్రోజుల క్రితం గుర్రంగూడలోని శ్రీశ్రీ ఎవెన్యూలో జరిగిన దొంగతనం ఘటన మరువక ముందే తాజాగా బడంగ్‌పేట్‌లో చోటుచేసుకున్న ఈ చోరీ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ 30వ డివిజన్‌ పరిధిలోని శ్రీకృష్ణా ఎన్‌క్లేవ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. స్థానిక నివాసి డాక్టర్‌ విద్యానంద్‌ ఆర్య ఉస్మానియా యూనివర్శిటీలో ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 


రంగంలోకి డాగ్ స్క్వాడ్‌!

సోమవారం మధ్యా హ్నం రెండు గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి 9గంటలకు తిరిగి వచ్చే సరికి తాళం పగులగొట్టి కనిపించింది. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో దాచిన 36 తులాల బంగారు ఆభరణాలతోపాటు 18లక్షల నగదు చోరీకి గురయినట్టు గుర్తించి ఆయన వెంటనే మీర్‌పేట్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఎల్‌బీనగర్‌ డీసీసీ సన్‌ప్రీత్‌సింగ్‌, క్రైమ్‌ డీసీపీ యాదగిరి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాల కోసం ప్రయత్నించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మీర్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి చెప్పారు.


ఒకే గ్యాంగ్‌ అయి ఉంటుందా..?

రెండు రోజుల క్రితం గుర్రంగూడలోని శ్రీశ్రీ ఎవెన్యూ కాలనీలోనూ దుండగులు చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనలో దాదాపు 30 తులాల బంగారు, వెండి ఆభరణాలతో పాటు లక్షన్నర నగదు అపహరణకు గురయ్యాయి. మరుసటి రోజే బడంగ్‌పేట్‌లో మరో భారీ చోరీ జరగడంతో రెండు చోట్లా దోచుకుపోయింది ఒకే గ్యాంగ్‌ అయి ఉంటుందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బడంగ్‌పేట్‌లో పట్టపగలే చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. శ్రీకృష్ణా ఎన్‌క్లేవ్‌ కాలనీ డిఫెన్స్‌ సంస్థ ఆర్‌సీఐ ప్రహరీని ఆనుకుని గుట్టల పక్కన ఉంటుంది. అక్కడ కేవలం మూడు నివాస గృహాలు మాత్రమే ఉండడంతో దుండగులు పక్కా ప్రణాళికతో పట్టపగలే చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-08-04T15:20:11+05:30 IST