పడమట తగ్గిన పట్టుసాగు

ABN , First Publish Date - 2022-01-24T06:14:33+05:30 IST

పట్టుచీరల ఉత్పత్తికి పేరుగాంచిన మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలో ఉత్పత్తి సగానికి పడిపోయింది.

పడమట తగ్గిన పట్టుసాగు
పట్టుగూడు నుంచి దారం తీస్తున్న మహిళలు

భారీగా పెరిగిన రేషం ధరలు

సగానికి పడిపోయిన పట్టుచీరల ఉత్పత్తి


మదనపల్లె, జనవరి 23: పట్టుచీరల ఉత్పత్తికి పేరుగాంచిన మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలో  ఉత్పత్తి సగానికి పడిపోయింది. చీరలకు మంచి డిమాండ్‌ ఉన్నా... ధరలు అంతంత మాత్రమే ఉండడం ఇందుకు కారణం.నష్టాలొస్తున్నా... ఏళ్ల తరబడి నమ్ముకున్న సంప్రదాయ వృత్తిని వదులుకోలేని కొందరు కార్మికులు, మాస్టర్‌ వీవర్స్‌ పట్టుచీరల ఉత్పత్తిని కొనసాగిస్తుండగా, మరికొందరు మూడునెలలుగా పక్కన పెట్టేశారు. ఎడతెరపి లేని వర్షాలు, పొలాలను ముంచెత్తిన వరదలతో అరకొరగా సాగవుతున్న మల్బరీ సాగు నిలిచిపోయింది. ఫలితంగా మార్కెట్‌కు వచ్చే పట్టుగూళ్లు ఆగిపోయాయి. గూళ్ల ధరలు కూడా ఎన్నడూ లేని విధంగా కిలో రూ.800 పలుకుతుండడంతో మార్కెట్‌లో రేషమ్‌ ధరలు భారీగా పెరిగాయి. పట్టుచీరలు నేయడానికి వాడే ముడి రేషమ్‌ ధర కిలో రూ.4,000 నుంచి రూ.4,200 నుంచి రూ.5,800 నుంచి రూ.6,200 దాకా పెరిగింది.ఈ ధరలకు అనుగుణంగా పట్టుచీరల ఽధరలు పెరగకపోవడంతో సొంతంగా ఒకటి, రెండు మగ్గాలపై చీరలను నేసే కార్మికులు, నాలుగైదు మగ్గాలు నడుపుతున్న మాస్టర్‌ వీవర్స్‌లో చాలామంది తాత్కాలికంగా నేతకు స్వస్తిచెప్పారు. చేతిమగ్గం నుంచి ఒక చీరను ఉత్పత్తి చేస్తే, దాని విలువ ఆధారంగా లాభం పోనూ, రూ.700 నుంచి రూ.1000 నష్టం వస్తున్నట్లు నేతన్నలు, వ్యాపారులు చెబుతున్నారు. అయితే నమ్ముకున్న వృత్తిని ఆపలేక, ఉన్న కార్మికులను కాదనలేక,  ఇదివరకే ఇచ్చిన అడ్వాన్సులను వదులుకోలేక కొంతలోకొంత ఉత్పత్తి చేస్తున్నారు.నీరుగట్టువారిపల్లె పట్టుచీరలకు ప్రత్యేక గుర్తింపు వుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే చీరలే..బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కంచి, ఆరణి తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో కంచి బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తున్నారు. ఒకప్పుడు పదివేల మగ్గాలున్న నీరుగట్టువారిపల్లెలో ప్రస్తుతం నాలుగువేలు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పట్టుచీరలకు  ఆదరణ ఉన్నా...  నైపుణ్యమున్న కార్మికులు లేకపోవడం, ఉన్నవారంతా ఇతర రంగాలకు వెళ్లిపోవడం, నానాటికీ పెరుగుతున్న ముడిసరుకు ధరలతో ఈ రంగం రానురాను ప్రాభవం కోల్పోతోంది. మరోవైపు మార్కెట్‌ను ముంచెత్తుతున్న మరమగ్గాలు కూడా మరో ప్రధాన కారణం. ఈ క్రమంలో ఒకప్పుడు బెంగళూరుకే పరిమితమైన మరమగ్గాలు... ప్రస్తుతం నీరుగట్టువారిపల్లెనూ తాకాయి. ప్రస్తుతం మూతపడిన చేతిమగ్గాల స్థానంలో మరమగ్గాలు వెలుస్తున్నాయి. రెండేళ్ల వ్యవధిలో ఇక్కడ 1500 మరమగ్గాలు ఏర్పాటయ్యాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రేషమ్‌ ధరలు పెరిగినా కొందరు కార్మికులు, మాస్టర్‌ వీవర్స్‌ కొనసాగిస్తున్నారంటే, పట్టు సాగు పెరగకపోతుందా? సిల్కు ధరలు తగ్గకపోతాయా? అనే ఆశాభావంతోనే. మార్చి నాటికి అటు సెరికల్చర్‌కు, ఇటు పట్టుచీరల ఉత్పత్తికి పూర్వవైభవం వస్తుందను కుంటున్నారు. నష్టాలు వచ్చినా మరోమూడు నెలలు భరించక తప్పదనే..తప్పని పరిస్థితిలో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఒకటి, రెండుమగ్గాలు సొంతంగా నడుపుకుంటున్న చిన్నాచితకా కార్మికులు సైతం ప్రస్తుతానికి పట్టుచీరల ఉత్పత్తికి స్వస్తి చెబుతుండగా, మాస్టర్‌ వీవర్స్‌ నుంచి ముడిసరుకు తీసుకుని, కూలీకి సొంతమగ్గంపై చీర నేసే వారుమాత్రమే కొనసాగిస్తున్నారు. వీరికి నష్టంతో పనిలేకుండా, కూలి దక్కుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పట్టుచీరలను కొందరు కమీషన్‌ వ్యాపారులు బయట మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. స్పాట్‌ క్యాష్‌ ఇస్తే ఒక ధర, నెలరోజులు అప్పుపెడితే మరో రేటు వసూలు చేస్తున్నారు. అయితే ఇక్కడ పెద్దస్థాయిలో పట్టుచీరలను ఉత్పత్తి చేసే మాస్టర్‌ వీవర్స్‌ తక్కువే. అంతా వందలోపే ఉంటున్నారు. ఇందులో పాతికభాగం మాత్రమే, కమీషన్‌ వ్యాపారులతో సంబంధం లేకుండా నేరుగా మార్కెట్‌కు సరఫరా చేస్తున్నారు. మిగిలిన వారంతా నెల పొడుగునా పని చేసినా 50చీరలకు మించి నేయలేరు. ఈ పరిస్థితిలో కమీషన్‌ వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయిస్తున్నారు. పైగా మరమగ్గాలు ముంచెత్తడం, అందులో తయారయ్యే చీరలూ పట్టును పోలివుండడం, సగం ధరకే వస్తుండడం, పెరిగిన సాంకేతికత, నైపుణ్యతను చేనేత మగ్గంలో చూపకపోవడం, తదితర కారణాలు కూడా ధరలో పోటీపడలేక పోవడడానికి కారణాలుగా చెప్పవచ్చు.



Updated Date - 2022-01-24T06:14:33+05:30 IST