బంగారు నగల వ్యాపారి ఇంట్లో దొంగతనం.. దొంగల ముఠా మాస్టర్ మైండ్ ఎవరో తెలిసి పోలీసులకు షాక్!

ABN , First Publish Date - 2022-03-02T05:47:24+05:30 IST

ఒక బంగారు నగల వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగలు ఒక పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేశారు. ఇంట్లో ఓనర్ లేని సమయంలో పని మనుషులను కొట్టి.. కట్టిపడేసి.. ఆ తరువాత ఆభరణాలు తీసుకొని ఒక ఆంబులెన్స్‌లో పరిపోయారు...

బంగారు నగల వ్యాపారి ఇంట్లో దొంగతనం.. దొంగల ముఠా మాస్టర్ మైండ్ ఎవరో తెలిసి పోలీసులకు షాక్!

ఒక బంగారు నగల వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగలు ఒక పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేశారు. ఇంట్లో ఓనర్ లేని సమయంలో పని మనుషులను కొట్టి.. కట్టిపడేసి.. ఆ తరువాత ఆభరణాలు తీసుకొని ఒక ఆంబులెన్స్‌లో పరిపోయారు. పోలీసులు చాలా కష్టపడి ఆ ఆంబులెన్స్‌ని పట్టుకన్నారు. ఆ సమయంలో అందులో ఉన్న వ్యక్తులలో ఒకరిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ దొంగతనం మాస్టర్ మైండ్ ఎవరంటే..


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్ నగరంలో అవినాశ్ చంద్ర అనే నగల వ్యాపారి ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగింది. అవినాశ్ చంద్రకు నగరంలోని బాజార్ గంజ్ అనే ప్రాంతంలో ఒక పెద్ద ఆభరణాల షాపు ఉంది. ఆయన జనవరి 20న అమెరికాలో ఉన్న తన కొడుకు వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లారు. 


అవినాశ్ చంద్ర ఇంట్లో ముగ్గురు పనిమనుషులు.. నరేశ్ బాబు, ఆశోక్ యాదవ్, షీలా దేవి ఉన్నారు. ఒకరోజు రాత్రి ఆ ఇంటికి ముగ్గురు యువకులు వచ్చారు. అవినాశ్ చంద్ర తమకు బాగా తెలుసునని.. ఆయనను ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చామని చెప్పారు. తమతోపాటు ఒక స్వీట్ బాక్సు కూడా తెచ్చారు. అవి చూసి ఇంట్లో పనిచేసే నరేశ్ బాబు.. వారిని లోపలికి రానిచ్చాడు. ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆ దొంగలు ఆ ముగ్గురు పనిమనుషులను కట్టిపడేసి.. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, వెండితో చేసిన దేవతా విగ్రహాలు దోచుకొని పారిపోయారు.


మరుసటి రోజు నరేశ్ బాబు, ఆశోక్ యాదవ్ పోలీసులకు దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవి వీడియాలను పరిశీలించగా.. ఆ ముగ్గురు దొంగలు ఇంటికి కొంత దూరంలో ఒక మెటర్నిటి ఆస్పత్రి వద్ద నిలబడి ఉన్న ఆంబులెన్స్‌లో కూర్చొని పారిపోయినట్లు కనిపించింది. పోలీసులు ఆ ఆంబులెన్స్ కోసం గాలించారు. ఆ ఆంబులెన్స్ ఆచూకీ తెలియగానే దానిపై నిఘా ఉంచారు. ఆ ఆంబులెన్స్‌లో ఒకరోజు ఆ ముగ్గురు దొంగలతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఒక్కసారిగా ఆంబులెన్స్‌పై దాడి చేసి అందులో ఉన్న అయిదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు గౌతమ్ యాదవ్ అని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు.


గౌతమ్ యాదవ్ మరెవరో కాదు. నగల వ్యాపారి అవినాశ్ చంద్ర ఇంట్లో పనిచేసే అశోక్ యాదవ్ కొడుకు. గౌతమ్ యాదవ్‌కు అప్పులభారం పెరిగిపోవడంతో అతడు దొంగతనం చేయాలని ప్లాన్ వేశాడు. అవినాశ్ చంద్ర అమెరికా వెళ్లారని.. ఇంట్లో కేవలం ముగ్గురు ముసలి పనివాళ్లే ఉన్నారని అతని తండ్రి అశోక్ యాదవ్ ద్వారా తెలుసుకున్నాడు. ఆ తరువాత తన నలుగురు మిత్రులతో కలిసి దొంగతనం చేశాడు.


అయిదుగురిలో ముగ్గురు ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేయగా.. గౌతమ్ యాదవ్ మరొక స్నేహితుడితో ఆంబులెన్స్ తీసుకొని ఇంటికి కొంత దూరంలో ఎదురుచూశాడు. దొంగతనం జరిగిన వెంటనే అందరూ ఆ ఆంబులెన్స్‌లో అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఆ ఆంబులెన్స్‌లోనే కూర్చొని మరో చోరీ చేద్దామని ప్లాన్ వేస్తుండగా.. పోలీసులు వారిని పట్టుకున్నారు.


Updated Date - 2022-03-02T05:47:24+05:30 IST