పడిగాపులు!

ABN , First Publish Date - 2021-07-23T04:59:54+05:30 IST

పడిగాపులు!

పడిగాపులు!
రాజాంలో డిపో వద్ద నిరీక్షిస్తున్న వినియోగదారులు

- రేషన్‌ డిపోల్లో సర్వర్‌ సమస్య

- ఉచిత బియ్యం కోసం ఇబ్బందులు

- ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు 

(రాజాం)

ప్రభుత్వం ఎన్ని విధానాలు అమలు చేస్తున్నా.. రేషన్‌ సరుకుల కోసం లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా ఉచిత బియ్యం పంపిణీ చేసింది. ఈ నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్ని వాహనాల ద్వారా వలంటీర్లు  సరఫరా చేశారు. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని మాత్రం డిపోల్లో తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డీలర్లు డిపోల్లో బియ్యం నిల్వ చేశారు. కానీ, సర్వర్‌ సమస్య కారణంగా బియ్యం పంపిణీ సక్రమంగా సాగడం లేదు. మూడు రోజులుగా లబ్ధిదారులు డిపోల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో ఉసురూమంటూ వెనుదిరుగుతున్నారు. జిల్లాలో 8.14 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. డిపోల వద్ద రెవన్యూ అధికారుల పర్యవేక్షణలో మంగళవారం నుంచి సరుకుల పంపిణీ ప్రారంభించారు. వీఆర్వోలు అథెంటికేషన్‌ చేసిన తర్వాత సరుకులు పంపిణీ చేస్తున్నారు.  సాంకేతిక సమస్య కారణంగా లబ్ధిదారులు బయోమెట్రిక్‌ వేసినప్పుడు సర్వర్‌ తరచూ మొరాయిస్తోంది. దీంతో అటు అధికారులు, డీలర్లు, ఇటు లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. రేషన్‌ సరుకుల కోసం రోజూ కాళ్లరిగేలా డిపోలకు తిరుగుతున్నామని, గంటల తరబడి నిరీక్షిస్తున్నామని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్‌ సమస్యను పరిష్కరించి.. సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై డీఎస్‌వో డి.వెంకటరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. సాంకేతిక సమస్య కారణంగా బియ్యం పంపిణీ జాప్యమవుతోందన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఈ నెలాఖరు వరకు సరుకులు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. 

 

Updated Date - 2021-07-23T04:59:54+05:30 IST