సేవలు దూరం

ABN , First Publish Date - 2022-09-28T06:11:42+05:30 IST

పాలనను ప్రజానీకానికి చేరువ చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థ నామమాత్రంగానే సేవలందిస్తోంది.

సేవలు దూరం

జనాదరణ పొందని సచివాలయాలు

పేరుకే 544 సేవలు

ప్రజల నుంచి స్పందన కరువు

దరఖాస్తులకు ప్రైవేటు కేంద్రాలవైపే మొగ్గు

తాజాగా లక్ష్యాలు నిర్దేశించిన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

అయినా వెనుకబాటే

పెచ్చరిల్లిన అవినీతి, అక్రమాలు 

నామమాత్రపు విధులకే సిబ్బంది పరిమితం 

పాలనను ప్రజానీకానికి చేరువ చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థ నామమాత్రంగానే సేవలందిస్తోంది. ఏర్పాటు జరిగి మూడేళ్లు గడుస్తున్నా జనాదరణ పొందడంలో వైఫల్యమే కనిపిస్తోంది.  సచివాలయాల ద్వారా దాదాపు 544 రకాల సేవలను    అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా అత్యధిక దరఖాస్తులను ప్రజలు  ప్రైవేటు కేంద్రాల ద్వారానే పంపుతున్నారు. పెద్దసంఖ్యలో సచివాలయాల్లో సిబ్బంది, వారికి వెసులుబాటుగా వలంటీర్లు ఉన్నా వారి నుంచి పొందుతున్న సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. జిల్లాలో సచివాలయాల ద్వారా వివిధ పనుల కోసం  అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజానీకం పంపే దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

ఒంగోలు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ లక్ష్య దూరంగా పనిచేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టిసారించి సమీక్ష చేస్తున్నా 50 నుంచి 60శాతం మించి లక్ష్యాన్ని జిల్లాలో చేరుకోవడం లేదు. ఫలితంగా అనేక సచివాలయాల్లోని సిబ్బంది నామమాత్రపు విధులకే పరిమితమవుతున్నారని స్పష్టమవుతోంది. ఈ సేవల ద్వారా ప్రభుత్వానికి భారీగానే రాబడి వచ్చే అకాశం ఉంది. అందుకోస మైనా సచివాలయాల ద్వారా ప్రజలు దరఖాస్తులు చేసుకునేలా సిబ్బంది చొరవ చూపాలి. కానీ అటువంటి దృక్పథంతో వారు పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. గతంలో ఏ పని అవసరం అయినా మండల స్థాయి కార్యాలయాలను సంప్రదించాల్సి వచ్చేది. తహసీల్దార్‌, మండల పరిషత్‌ కార్యాల యాలు అందులో కీలకం కాగా ఇతర సేవలకు సంబంధించిన దరఖాస్తులను మీసేవా కేంద్రాల ద్వారా సంబంధిత కార్యాలయాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను తెచ్చింది. అధికారి కంగా 2019 అక్టోబరు 2 నుంచి ఈ వ్యవస్థ ప్రారం భం కాగా ప్రస్తుతం జిల్లాలో మొత్తం 719 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిలో దాదాపు ఏడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.


మూడేళ్లు దాటినా గాడిన పడలేదు

సచివాలయ వ్యవస్థ ఏర్పడి మూడేళ్లు గడు స్తున్నా దరఖాస్తుల కోసం ప్రజలు సచివాలయాల కన్నా ప్రైవేటు మీసేవా  కేంద్రాలకే ఎక్కువగా వెళ్తున్నారు. జిల్లాలోని సచివాలయాల్లో చాలాచోట్ల రోజుకు కనీసం పట్టుమని పది దరఖాస్తులు కూడా రానివి చాలానే ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఇటీవల వాటిపై ప్రత్యేక దృష్టిసారించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాల ద్వారా రోజుకు సగటున 20, అలాగే పట్టణాల్లో వార్డు సచివాలయాల ద్వారా 25కు తగ్గకుండా దరఖాస్తులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదే శించారు. దీనిపై వారంవారం సంబంధిత మండల, పట్టణ పర్యవేక్ష ణాధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఆయినా ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. జిల్లాలో ఉన్న మొత్తం 38 మండలాలు, ఐదు అర్బన్‌ ప్రాంతాల్లోని 719 సచివాలయాల ద్వారా కలెక్టర్‌ నిర్దేశించిన లక్ష్యం ప్రకారం వారానికి 90,150 దరఖాస్తులు రావాలి. అయితే ఈ నెల 7నుంచి 14 వరకు ఉన్న వారం రోజుల్లో 48,913 వచ్చాయి. అలాగే 14నుంచి 21 వరకు వారం రోజుల్లో 54,814 వచ్చాయి. ఆ ప్రకారం 7 నుంచి 14 వరకు వచ్చిన వాటి కన్నా 14నుంచి 21 వరకు కొంతమేర పెరిగినా చాలా మండలాలు, పట్టణాల్లోని సచివాలయాల్లో తగ్గుదల కనిపిస్తోంది. అధికార పార్టీ నేతల మాటకే సిబ్బంది విలువ ఇస్తున్నారు. 


సహాయకులుగా వలంటీర్లు ఉన్నా..

వివిధ రకాల పౌరసేవలను, ప్రభుత్వ పథకాల లబ్ధిని సత్వరం ప్రజలకు అందించే ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాల యాలను ఏర్పాటు చేశారు. అక్కడ పనిచేసే సిబ్బందికి సహాయకు లుగా వలంటీర్లు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. మొత్తం 544 రకాల సేవలను వాటి ద్వారా అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో ఎవరికి ఏ పని అవసరమైనా దరఖాస్తులను అక్కడి నుంచి పంపించుకునే సదుపాయం కల్పించింది. ప్రధానంగా ప్రజలకు అవసరమైన వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు, భూసంబంధ అర్జీలు, డ్రైవింగ్‌ లైసెన్సుల నుంచి రేషన్‌ కార్డులు, పింఛన్‌ ఇతరత్రా పథకాలతోపాటు పౌర సేవల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే ఈ దరఖాస్తులను చేసుకునే వారు. డిజిటల్‌ ప్రక్రియ వచ్చాక మీసేవా కేంద్రాల ద్వారా ఎక్కు వగా చేసుకుంటున్నారు. అందుకు నిర్దేశిత రుసుం చెల్లించాలి. సచివాల య వ్యవస్థ వచ్చాక ఆ దరఖాస్తులన్నింటినీ  సంబంధిత రుసుం చెల్లించి వాటి ద్వారా చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించిం ది. దీంతో త్వరితగతిన పౌరసేవలు అందడంతోపాటు సచివాలయాల ద్వారా  ప్రభుత్వానికి ఆర్థికంగా రాబడి చేకూరనుంది. 


సగం కూడా రావడం లేదు

అదేసమయంలో నిర్దేశిత లక్ష్యంతో పోల్చితే చాలాప్రాంతాల్లో సగం కూడా వస్తున్న పరిస్థితి లేదు. ఉదాహరణకు దర్శి మండలంలో 23 సచివాలయాలు ఉండగా వారానికి 2,760 దరఖాస్తులు రావాలన్నది లక్ష్యం కాగా ఈనెల రెండో వారంలో 1,044, మూడో వారంలో 944 మాత్రమే వచ్చాయి. దొనకొండ మండలంలో 14 సచివాలయాలు ఉండగా అక్కడ వారానికి 1,680 దరఖాస్తులు కనీసం వచ్చేలా చూడాలి. అయితే  రెండో వారంలో 757, మూడో వారంలో 564 మాత్రమే అందాయి. కురిచేడు మండలంలో ఉన్న 11 సచివాలయాల ద్వారా 1,320 రావాలన్నది లక్ష్యం కాగా రెండో వారంలో 588, మూడోవారంలో 451 మాత్రమే వచ్చాయి. అదేసమయంలో దర్శిలోని ప్రైవేటు కేంద్రాల ద్వారా పెద్దఎత్తున దరఖాస్తులు అందుతున్నాయని అధికారు లు గుర్తించినట్లు సమాచారం. అర్ధవీడు, బేస్తవారపేట, కంభం, గిద్దలూరు, మార్కాపురం, ముండ్లమూరు, పెద్దారవీడు, పుల్లలచెరువు, తర్లుపాడు, వైపాలెం తదితర ప్రాంతాల్లో రెండో వారం కన్నా మూడో వారం ఇంకా తగ్గాయి. అదేసమయంలో జిల్లాలోని ఏ ఒక్క మండలం లేదా మునిసిపాలిటీల్లో నిర్దేశిత లక్ష్యం మేర దరఖాస్తులు వస్తున్న పరిస్థితి లేదు. మొత్తంగా  ఈనెల 14నుంచి 21 వరకు  వారం రోజుల్లో లక్ష్యంలో 60 శాతం అటుఇటుగా దరఖాస్తులు వచ్చాయి. చాలా సచివాలయాల్లో అది 40శాతం లోపుగానే ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయాలు ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా ప్రజల చెంతకు ఆ వ్యవస్థ చేరకనే ఈ పరిస్థితి నెలకొంది. 


Updated Date - 2022-09-28T06:11:42+05:30 IST