జర్మనీ ఛాన్సలర్ చైనా అనుకూల విధానాలకు ఎదురు దెబ్బ

ABN , First Publish Date - 2021-05-09T21:42:24+05:30 IST

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అనుసరిస్తున్న చైనా అనుకూల

జర్మనీ ఛాన్సలర్ చైనా అనుకూల విధానాలకు ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ : జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అనుసరిస్తున్న చైనా అనుకూల విధానాలకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) గండి కొట్టింది. చైనాతో పెట్టుబడులపై సమగ్ర ఒప్పందం (సీఏఐ) ధ్రువీకరణను నిలిపివేసింది. దీంతో ఈ ఒప్పందానికి మృత్యు ఘంటికలు మోగడంతోపాటు మెర్కెల్ విధానాలకు ఎదురు దెబ్బ తగిలింది.


ఈయూ సీనియర్ డిప్లొమేట్ ఒకరు మాట్లాడుతూ, ఇన్వెస్ట్‌మెంట్ అగ్రిమెంట్‌ను ప్రస్తుతానికి సస్పెండ్ చేసినట్లు ఈయూ అధికారికంగా చెప్తున్నప్పటికీ, ఇది అంతమైనట్లేనని చెప్పారు. కొందరు జర్మనీ దౌత్యవేత్తలతో సహా చాలా మంది ఈయూ దౌత్యవేత్తలు మొదటి నుంచి దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. మొత్తం మానవ హక్కుల కమిటీతోపాటు యూరోపియన్ పార్లమెంటు సభ్యులపై చైనా ఆంక్షలు విధించడం చాలా ఇబ్బందికరమైన విషయమని తెలిపారు. చైనాలో ముస్లింలు అధికంగా ఉండే జింజియాంగ్ ప్రాంతంలో ఎడ్యుకేషన్ క్యాంపుల నిర్వహణపై జింజియాంగ్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోపైనా, నలుగురు చైనా అధికారులపైనా ఈయూ ఆంక్షలు విధించింది. చైనా దీనికి ప్రతీకారంగా ఈయూపై ఆంక్షలు విధించింది. పెట్టుబడులపై సమగ్ర ఒప్పందాన్ని ఈయూ పార్లమెంటు తప్పనిసరిగా ఆమోదించాలి. తన సభ్యులపై చైనా ఆంక్షలు అమల్లో ఉండగా ఈ ఒప్పందాన్ని ఈయూ పార్లమెంటు సమర్థించే అవకాశం లేదు. 


గత ఏడాది డిసెంబరులో రూపొందిన ఈ ఒప్పందం రూపకల్పనలో జర్మనీ పాత్ర అధికంగా ఉంది, కొంత వరకు ఫ్రాన్స్ పాత్ర కూడా ఉంది. అయితే తైవాన్, హాంగ్ కాంగ్‌లపై చైనా దురాక్రమణ శైలి పట్ల ఈ ఒప్పందం శ్రద్ధ చూపించలేదు. జింజియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో యూరోపియన్ పార్లమెంటులోని గ్రీన్స్, లిబరల్స్ నుంచి బలమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈయూ మీడియా, పలుకుబడిగల ఇతర వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వ్యక్తిగత ప్రాజెక్టు కావడం వల్లే ఈ ఒప్పందం ఇప్పటి వరకు సాగుతోందని ఈ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆమె ఈ ఏడాది సెప్టెంబరులో పదవి నుంచి వైదొలగిన తర్వాత ఈ ఒప్పందం మరుగున పడటం ఖాయమని చెప్తున్నారు. 


Updated Date - 2021-05-09T21:42:24+05:30 IST