Shiv Sena vs Shiv Sena: ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2022-09-28T00:07:43+05:30 IST

శివసేన చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమదే నిజమైన శివసేన అంటూ..

Shiv Sena vs Shiv Sena: ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

న్యూఢిల్లీ: శివసేన చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)కు సుప్రీంకోర్టు (Supreme court)లో చుక్కెదురైంది. తమదే  నిజమైన శివసేన అంటూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించినందున ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వలేమని తెలిపింది. నిజమైన శివసేన ఏదో, ఎవరికి పార్టీ గుర్తు కేటాయించాలో నిర్ణయించేందుకు ఈసీని అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. షిండే గ్రూపును నిజమైన  శివసేనగా గుర్తించకుండా ఈసీని నిరోధించాలంటూ ఉద్ధవ్ థాకరే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారంనాడు విచారణ జరిపింది.


థాకరే సారథ్యంలోని మహావికాస్ అఘాడి ప్రభుత్వం ఇటీవల కుప్పకూలింది. షిండే, మరో 39 మంది ఎమ్మెల్యేలు థాకరే సర్కార్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. షిండే వర్గం బీజేపీతో కలిసి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జూన్  30న షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఫిరాయింపులు, విలీనం, అనర్హత వంటి పలు రాజ్యాంగపరమైన  ప్రశ్నలను లేవనెత్తుతూ థాకరే, షిండే శివసేన వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గత ఆగస్టు 23న సుప్రీంకోర్టు ఈ కేసును ఐదుగురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనానికి అప్పగించింది. తమదే శివసేన అని, పార్టీ గుర్తు తమకే కేటాయించాలని షిండే వర్గం చేసిన విజ్ఞప్తిపై ఈసీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా నిరోధించాలని అత్యున్నత  న్యాయస్థానాన్ని థాకరే వర్గం కోరుతోంది. ఎమ్మెల్యేల అనర్హతను ముందు తేల్చాలని అంటోంది. కాగా, ఎమ్మెల్యేలు, ఎంపీల బలం ఉన్న తమదే నిజమైన శివసేన అని, పార్టీ గుర్తు తమకే కేటాయించాలని షిండే వర్గం వాదనగా ఉంది.

Updated Date - 2022-09-28T00:07:43+05:30 IST