తేల్చేయండి

ABN , First Publish Date - 2020-09-16T05:47:39+05:30 IST

సెప్టెంబర్ నెల వస్తున్నదంటే చాలు తెలంగాణలో ఒక కలకలం మొదలవుతుంది. 17వ తేదీన తెలంగాణ విమోచనోద్యమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న...

తేల్చేయండి

సెప్టెంబర్ నెల వస్తున్నదంటే చాలు తెలంగాణలో ఒక కలకలం మొదలవుతుంది. 17వ తేదీన తెలంగాణ విమోచనోద్యమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ తిరిగి వేదిక మీదకు వస్తుంది. భారతీయ జనతాపార్టీ, దానితో భావసారూప్యం ఉన్న కొన్ని సంస్థలు, సంఘాలు ప్రధానంగా ఈ విషయమై గట్టిగా మాట్లాడతాయి. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ మధ్య ఇదే డిమాండ్ చేస్తున్నాయి. సాయుధపోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. వారి కారణాలేమిటో కారల్ మార్క్స్‌కే తెలియాలి. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ అధికారంలోకి వచ్చిన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్ మాత్రం ఈ డిమాండ్‌ను మౌనంగా తిరస్కరిస్తాయి. తమ పార్టీ కార్యాలయాల్లో మాత్రం అనధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ప్రతి ఏటా ఈ తంతు జరుగుతోంది కానీ, ఏటికేడాది ఈ అంశం చుట్టూ బలసమీకరణ పెరుగుతున్నట్టు గమనించవచ్చు. అటువంటి పరిణామం శ్రేయస్కరం కాదని భావించే పక్షాలు, ఈ సమస్యను ఏకాభిప్రాయంతో పరిష్కరించే ప్రయత్నం చేయడం మంచిది.


ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని తెలంగాణలో కూడా ఘనంగా జరుపుకుంటారు కానీ, 1947లో ఆ తేదీనాడు తమ ప్రాంతం ఇంకా నిజాం ఏలుబడిలోనే ఉన్నదని వారికి తెలుసు. తెలంగాణకు ఒక ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవమో, విముక్తి దినోత్సవమో ఉండాలన్న కోరిక ప్రజలందరిలో ఉన్నది. బ్రిటిష్ పాలిత భారతదేశంలో జరిగినట్టు పరిణామాలు అలనాటి హైదరాబాద్ రాజ్యంలో జరగలేదు. రెంటికీ పోలికలు కూడా కష్టమే. బ్రిటిష్ వారు బయటి పాలకులు కాగా, బ్రిటిష్ పరమాధికారం కింద ఉండిన స్వదేశీ సంస్థానాధీశుడు నిజాం.  భారత్, పాకిస్థాన్‌లలో దేనితో కలవాలో, లేదా స్వతంత్రత కావాలో ఎంచుకునే అవకాశం అతనికి బ్రిటిష్ వారే ఇచ్చారు. ఏ దేశంతోనూ కలవనని, స్వతంత్రంగా ఉంటానని నిజాం వాదించారు. హైదరాబాద్ రాజ్యంలో ముఖ్యభాగమైన తెలంగాణలో అప్పటికే ప్రజా ఉద్యమాలు బలపడ్డాయి. సాంస్కృతిక ఉద్యమంగా మొదలైనది, ప్రజాసమస్యల మీద సమీకృతమై, చివరకు భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటంగా పరిణమించింది. ఆ పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలోకి వెళ్లగా, మితవాదులైన కాంగ్రెస్వారు సత్యాగ్రహాది మార్గాలతో జనసమీకరణ చేసేవారు. ఈ రెండు మార్గాల పోరాటం ఫలించినందువల్ల తెలంగాణలో సంస్థాన ప్రభుత్వం కూలిపోలేదు. భారత ప్రభుత్వం సైనికచర్య జరపడం వల్ల నిజాం అధికారం పడిపోయింది. ఆ చారిత్రక దశలో తెలంగాణలో ఆర్యసమాజ్ వంటి సంస్కార సంస్థలు ఉండేవి కానీ, భారతీయ జనతాపార్టీ పూర్వ రూపాలేవీ లేవు. భారత సైన్యం వచ్చి, నిజాం లొంగిపోయిన తరువాత కూడా కమ్యూనిస్టులు పోరాడారు. కాంగ్రెస్ వారు ఆ సమయంలో రాజ్య సరిహద్దుల్లో సాయుధ శిబిరాలు నడిపి, రజాకార్లతో, నిజాం పోలీసులతో ఘర్షణలో ఉండేవారు. పోలీసు చర్య జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని తమ విజయంగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది ఎంతో కొంత వారికే. కానీ, సాధ్యమైనంత వరకు 1948 సెప్టెంబర్ 13–-17 మధ్య జరిగినదానికి వార్షికోత్సవాలు జరపాలని ఆ పార్టీ ఎప్పుడూ అనుకోలేదు.


ఎందుకంటే, మునుపు చెప్పినట్టు, నిజాం పాలకులు దేశీయులు. బ్రిటిష్ వారిలాగా వారు వెనక్కు వెళ్లే వారు కారు. ప్రతి ముస్లిమూ పాలకుడే- వంటి నినాదాలతో రజాకార్లు హైదరాబాద్ రాజ్యం ముస్లిములది మాత్రమే అన్న భ్రమలను కల్పించారు. దేశవిభజన సమయంలో నెలకొన్న అవాంఛనీయ అభద్ర వాతావరణంతో జోడించి, నిజాంపై సైనికచర్యను చూసినప్పుడు ముస్లిములకు తమ ప్రతిపత్తి ఒక్కసారిగా పతనమైనట్టు అనిపించడం సహజం. తీవ్రతలో, సంఖ్యలో తెలంగాణలో జరిగినవి తక్కువ కానీ, మహారాష్ట్రలోని నిజాం ప్రాంతంలో సైనికచర్యలో అనేక భయానక సంఘటనలు జరిగాయి. రజాకార్ల వేట పేరుతో అమాయకులు అనేకులు బలి అయ్యారని నెహ్రూ సూచనపై నిజనిర్ధారణ చేసిన పండిట్ సుందర్ లాల్ వివరాలతో సహా రాశారు. మొత్తానికి ఆ సమయంలో జరిగిన విషయాలు అప్రియమైనవి కాబట్టి, నవభారత సమాజంలో సమ్మిళితం కావలసిన జనవర్గాలకు పాత గాయాలను పదేపదే గుర్తుచేయడం, వారిని పరాజితులుగా చెప్పడం సబబు కాదన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ తదితర పాలకులు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడాన్ని దాటవేస్తూ వస్తున్నారు. మజ్లిస్‌ను బుజ్జగించడానికే అధికారిక నిర్వహణ చేయడం లేదని బిజెపి అంటున్నది. 


పోలీసు చర్య నాటికి కూడా నిజాంను పదవీ భ్రష్ఠుడిని చేయాలన్న డిమాండ్ తెలంగాణలోని ఉద్యమకారులకు లేదు. బాధ్యతాయుత ప్రభుత్వాన్ని మాత్రమే వారు కోరారు. వారు కోరకున్నా, కేంద్రం జోక్యం వల్ల నిజాం నిష్క్రమించారు. రజాకార్ల కోసం వచ్చామన్న సైన్యం కమ్యూనిస్టుల మీద కూడా అణచివేతకు పాల్పడ్డారు. కొంతకాలం పోరాటం కొనసాగించి, వేలాది మరణాల తరువాత కమ్యూనిస్టులు వెనక్కి వచ్చారు. సైనిక పాలన, పోలీసు- బ్యూరోక్రాట్ పాలన కొంతకాలం సాగి అంతిమంగా మరో నాలుగేళ్లకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఫలితాలన్నీ నిలబడ్డాయో లేదో తెలియదు కానీ, తెలంగాణ ప్రజలకు అర్ధరాచరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్యం రావడం సానుకూల పరిణామమే. దాన్ని వేడుక చేసుకోవలసిందే. నిజాంకు వెన్నుదన్నుగా నిలబడింది హిందూ భూస్వాములూ, ముస్లిం జాగీర్దారులే. రజాకార్లకు గ్రామాల్లో ఆశ్రయం ఇచ్చింది హిందూ భూస్వాములూ వారి మనుషులే. ప్రజలకు ప్రజాస్వామ్యంతో పాటు, నిజాంకు గవర్నర్ పదవిని, భూస్వాములకు రాజకీయ పునరావాసాన్ని కూడా అప్పటి ప్రభుత్వం అందించింది. ప్రతినాయకులు అందరు ఉండగా, కేవలం నిజాం ఓటమిగా తెలంగాణ విమోచనాన్ని జరుపుకోవడం ఎందుకు? పీడించినవాళ్లలో, పోరాడినవాళ్లలో రెండు మతాల వారు ఉండగా, నాటి పరిణామాలను మతదృష్టితో చూడడం ఎందుకు? 


పాత గాయాలను రగిలించే వేడుకలు అక్కరలేదు. హైదరాబాద్ రాజ్యం భారత రిపబ్లిక్‌లో కలిసిన 1950 జనవరి 26ను తెలంగాణ ప్రజలు విమోచన దినోత్సవంగా జరుపుకోవచ్చు. లేదా, 1952లో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణరావు ప్రమాణస్వీకారం చేసిన రోజును ఎంచుకోవచ్చు. జాగీరులు రద్దు చేసి, కౌలుదారీ సంస్కరణలు తీసుకువచ్చిన ప్రభుత్వం ఆయనది. స్వాతంత్ర్య దినోత్సవం వంటి సందర్భాన్ని అందరూ జరుపుకునే విధంగా, జరుపుకోగలిగిన రోజును నిర్ణయించడం మంచిది. ఈ సమస్యను ఇట్లాగే సాగదీయకుండా, ముగింపు పలికేలా ఒక నిర్ణయం తీసుకోగల శక్తి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. u

Updated Date - 2020-09-16T05:47:39+05:30 IST