ఆ ఏడుగురి విడుదలకు గవర్నర్‌ అనుమతివ్వాలి

ABN , First Publish Date - 2021-12-30T14:22:39+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిలు నళిని, మురుగన్‌, పేరరివాలన్‌ సహా ఏడుగురిని విడుదల చేసేందుకు రాష్ట్ర గవర్నర్‌ అనుమతిని జారీ చేయాలని పీఎంకే

ఆ ఏడుగురి విడుదలకు గవర్నర్‌ అనుమతివ్వాలి

                 - పీఎంకే సర్వసభ్యమండలి డిమాండ్‌


చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిలు నళిని, మురుగన్‌, పేరరివాలన్‌ సహా ఏడుగురిని విడుదల చేసేందుకు రాష్ట్ర గవర్నర్‌ అనుమతిని జారీ చేయాలని పీఎంకే సర్వసభ్య మండలి సమావేశం డిమాండ్‌ చేసింది. స్థానిక చేపాక్‌ స్వామి శివానందశాలైలోని అన్నా అరంగంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రత్యేక సర్వసభ్యమండలి సమావేశానికి పీఎంకే అధ్యక్షుడు జీకే మణి అధ్యక్షత వహించారు. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌, యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ తదితర పార్టీ నేతలు, సర్వసభ్య మండలి సభ్యులు పాల్గొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో నీట్‌ పరీక్షలను రద్దు చేయించి ప్లస్‌-2 మార్కుల ఆధారంగా వైద్యకోర్సులలో అడ్మిషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. 2026లో అధికారం చేపట్టే దిశగా పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలపరిచేందుకు జిల్లా శాఖ నేతలు, పార్టీ నాయకులు కలిసికట్టుగా పాటుపడాలని పిలుపునిస్తూ మరొక తీర్మానం చేశారు. వన్నియార్లకు 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్లు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించాలని మరో తీర్మానంలో డిమాండ్‌ చేశారు. ఇక తమిళులకే 100 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు సంస్థలు, కంపెనీలలో 80 శాతం ఉద్యోగాలు కేటాయించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ సర్వసభ్య మండలి సభ్యులు మరో తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్‌ నాయకులు ఏకే మూర్తి, వడివేల్‌ రావణన్‌, న్యాయవాది బాలు, కేఎన్‌ శేఖర్‌, జిల్లా శాఖ నాయకులు రాసు వెంకటేశన్‌, వెంకటేశపెరుమాళ్‌, సుబ్రమణ్యం, సత్యా, శ్రీరామ్‌ అయ్యర్‌ వీజే పాండ్యన్‌, ఏళుమలై తదితరులు పాల్లొన్నారు. 

Updated Date - 2021-12-30T14:22:39+05:30 IST