దేశంలో విజృంభిస్తున్న ఒమైక్రాన్.. 21కి పెరిగిన కేసులు

ABN , First Publish Date - 2021-12-06T01:11:49+05:30 IST

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో తాజాగా మరో ఏడు కేసులను గుర్తించారు..

దేశంలో విజృంభిస్తున్న ఒమైక్రాన్.. 21కి పెరిగిన కేసులు

ముంబై: దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో ఒకే రోజు 16 ఒమైక్రాన్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం  కేసుల సంఖ్య 21కి పెరిగింది. 


44 ఏళ్ల మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నైజీరియాలోని లాగోస్ నుంచి గత నెల 24న పూణె చేరుకుంది. అనంతరం పింప్రి-చించ్‌వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న తన సోదరుడి వద్దకు వెళ్లింది. 


ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు నైజీరియా నుంచి వచ్చిన తల్లీ కుమార్తెలతోపాటు ఆమె సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెలు కలిపి మొత్తం ఆరుగురికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి నమూనాలను పూణెలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌లో పరీక్షల కోసం పంపారు. తాజాగా, ఈ సాయంత్రం నివేదికలు రాగా, ఆరుగురికీ ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, ఫిన్లాండ్ నుంచి పూణె వచ్చిన మరో వ్యక్తి (47)లోనూ ఒమైక్రాన్‌ను గుర్తించారు. ఫలితంగా ఒక్క మహారాష్ట్రలోనే ఒమైక్రాన్ కేసుల సంఖ్య 8కి పెరిగింది. 


అలాగే, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఆదర్శనగర్‌కు చెందిన ఒకే కుటుంబంలో 9 మంది ఒమైక్రాన్ బారినపడ్డారు. వీరు కూడా సౌతాఫ్రికా నుంచే వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, ఢిల్లీలో ఒకటి, ముంబైలో ఒకటి చొప్పున ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయి. వీటితో కలుపుకుని దేశంలో నమోదైన మొత్తం ఒమైక్రాన్ కేసుల సంఖ్య 21కి పెరిగింది.

Updated Date - 2021-12-06T01:11:49+05:30 IST