హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిలు

Oct 14 2021 @ 01:14AM

  • సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు కేంద్రం ఆమోదం
  • నియామక ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర న్యాయశాఖ 
  • 14 మంది న్యాయమూర్తుల నియామకాన్ని ఆమోదించిన రాష్ట్రపతి


హైదరాబాద్‌, న్యూఢిల్లీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసుల మేరకు.. న్యాయాధికారులు పి.శ్రీసుధ, సి.సుమలత, జి.రాధారాణి, ఎం.లక్ష్మణ్‌, ఎన్‌. తుకారాంజీ, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఇన్‌కంట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ సభ్యురాలు పి.మాధవీదేవి నియామకాన్ని రాష్ట్రపతి బుధవారం ఆమోదించారు. ఈ నియామకాలకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడుగురు న్యాయమూర్తుల్లో ఆరుగురు జిల్లా సీనియర్‌ జడ్జిలు కాగా ఒకరు ఇన్‌కంట్యాక్స్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల స్ర్టెంత్‌ 42 కాగా ప్రస్తుతం చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో కలిపి 10 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కొత్త న్యాయమూర్తుల చేరికతో ఈ సంఖ్య 17కు చేరింది. బాంబే హైకోర్టు నుంచి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తెలంగాణ హైకోర్టులో ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నది. జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ చేరికతో న్యాయమూర్తుల సంఖ్య 18కి చేరనున్నది.


మొత్తం స్ర్టెంత్‌ 42లో రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసెస్‌ కోటా నుంచి 14 మంది, న్యాయవాదుల కోటా నుంచి 28 మంది హైకోర్టు న్యాయమూర్తులు అయ్యే అవకాశం ఉన్నది. నూతన న్యాయమూర్తుల చేరిక తర్వాత కూడా హైకోర్టులో ఇంకా 24 న్యాయమూర్తుల పదవులు ఖాళీలు ఉంటాయి. కాగా.. తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులతోపాటు ఒడిశాకు ముగ్గురు, కేరళ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల నియామకాన్ని కూడా రాష్ట్రపతి ఆమోదించారు. ఇవీ న్యాయమూర్తుల నేపథ్యాలు..

పి.శ్రీసుధ: ఈమె 1967 జూన్‌ 6న జన్మించారు. మొట్టమొదట నిజామాబాద్‌ అదనపు జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా, ఆ తర్వాత  విశాఖపట్నం జిల్లా జడ్జిగా పనిచేశారు. వరంగల్‌ జిల్లా జడ్జిగా, రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, నిజామాబాద్‌ ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు. జిల్లా జడ్జిల క్యాడర్‌లో సీనియర్‌గా ఉన్న శ్రీసుధ ప్రస్తుతం కోఆపరేటివ్‌ సొసైటీ ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

సి.సుమలత: డాక్టర్‌ సి.సుమలత 1972 ఫిబ్రవరి 5న జన్మించారు. 2005లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులైన ఆమె.. వెంటనే జిల్లా జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 2007లో మదనపల్లిలో జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు, గుంటూరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జి.రాధారాణి: డాక్టర్‌ జి.రాధారాణి 1963 జూన్‌ 29న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ పూర్తిచేశారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, అడిషనల్‌ పీపీగా పనిచేశారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఒంగోలు, హైదరాబాద్‌, సంగారెడ్డి, సికింద్రాబాద్‌లలో జిల్లా జడ్జిగా, నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జిగా, వ్యాట్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసున్నారు.

ఎం.లక్ష్మణ్‌: ఈయన 1965 డిసెంబర్‌ 24న జన్మించారు. 1991లో న్యాయవాదిగా నమోదు చేసుకుని రంగారెడ్డి, సిటీ సివిల్‌ కోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) పరీక్షలో ఎంపికై.. 2008లో మహబూబ్‌నగర్‌ ఏడీజేగా నియమితులయ్యారు. నిజామాబాద్‌, హైదరాబాద్‌ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 2016లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో సేవలందించారు. ప్రస్తుతం నాంపల్లి లేబర్‌ కోర్టు ప్రిసైడింగ్‌ అధికారిగా కొనసాగుతున్నారు.

ఎన్‌.తుకారాంజీ: ఎన్‌.తుకారాంజీ 1973 ఫిబ్రవరి 24న జన్మించారు. విశాఖపట్నంలో అదనపు జిల్లా జడ్జిగా నియమితులై.. ఏలూరు, కాకినాడలో అదనపు జిల్లా జడ్జిగా.. అనంతరం ఏలూరు జిల్లా జడ్జిగా పనిచేశారు. ప్రస్తుతం నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి: ఈయన 1961 ఏప్రిల్‌ 15న జన్మించారు. 1994లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులై.. అనంతరకాలంలో రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. హైకోర్టు రిజిస్రార్‌ జనరల్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా పనిచేస్తున్నారు.

పి.మాధవీదేవి: ఈమె 1965 డిసెంబర్‌ 28న జన్మించారు. బీకాం, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేసి.. 1992 నుంచి 2005 వరకూ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2005 మార్చిలో సర్వీసె్‌సలో చేరిన ఆమె.. ప్రస్తుతం ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ జ్యుడీషియల్‌ మెంబర్‌గా కొనసాగుతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.