వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2022-05-22T05:51:33+05:30 IST

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతిచెందారు.

వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. 


సైకిల్‌, బైకు ఢీకొని.. ఇద్దరు

డెంకాడ: మండలంలోని పినతాడివాడ జంక్షన్‌ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డెంకాడ మండలం పినతాడివాడ గ్రామాని కి చెందిన సీహెచ్‌ అప్పలస్వామి(50) విజయనగరంలో కళాసీగా పనిచేస్తు న్నాడు. శనివారం పని ముగించుకొని విజయనగరం నుంచి పినతాడివాడకు సైకిల్‌పై వెళ్తున్నాడు. పినతాడివాడ జంక్షన్‌ మలుపు వద్దకు వచ్చేసరికి,  పూస పాటిరేగ నుంచి బైకుపై విజయనగరం వెళ్తున్న జె.సంతోష్‌(23) ఢీకొన్నాడు. దీంతో వీరిద్దరూ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎన్‌.పద్మావతి తెలిపారు. సంతోష్‌ స్వగ్రామం పూసపాటిరేగ మండలం పూసపాటిపాలెం గ్రామంగా గుర్తించారు.


 స్టాపర్‌ బోర్డును ఢీకొని యువకుడు..

 వేపాడ (ఎస్‌.కోట రూరల్‌): ద్విచక్ర వాహనంతో అతివేగంగా వస్తూ విశాఖ - అరకు రహదారిలో పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్‌ బోర్డును ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతిచెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.  ఎస్‌.కోట పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌.కోట పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన వేమలి మాధవరావు(23) తన స్నేహితుడి వివాహానికి కాపుసోంపురం వెళ్లాడు. అనంతరం ద్విచక్ర వాహనాలతో నలుగురు స్నేహితులు బొడ్డవర వెళ్లి అర్ధరాత్రి తిరిగి ఎస్‌.కోట వస్తున్నారు. గౌరీపురం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్‌ బోర్డును మాధవరావు బైకుతో అతివేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో మాధవరావు అక్కడికక్కడే మృతి చెందగా, అదే వాహనంపై ఉన్న మరో వ్యక్తి నాగేంద్ర రహదారిపై ఎగిరిపడి తీవ్ర గాయాలపాలయ్యాడు.  వెంటనే మిగతా స్నేహితులు ద్విచక్ర వాహనాలపై మాధవరావును ఎస్‌.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మాధవరావు మృతిచెందాడని నిర్ధారించారు. గాయపడిన నాగేంద్రను ఎస్‌.కోట ఆసుపత్రిలో చేర్చారు. అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తారకేశ్వరరావు తెలిపారు.  


గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి..

భోగాపురం:  రాజాపులోవ సమీప జాతీయ రహదారిపై శనివారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సొంపేటకు చెందిన దున్న వాసుదేవరావు(41) అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, రాణిగాం గ్రామానికి చెందిన దున్న వాసుదేవరావు విశాఖలో కర్రల పని చేస్తున్నాడు. అన్నయ్య కుమారుడి వివాహం నిమిత్తం సోంపేట వెళ్లేందుకు శనివారం వేకువజామున విశాఖ నుంచి బయలుదేరాడు. వేకువజాము సమయంలో బస్సులు లేకపోవడంతో వాహనాలు మారుతూ సోంపేట వెళ్లేందుకు రాజాపులోవ జంక్షన్‌లో దిగాడు. అక్కడ రహదారి పక్కన నిల్చోవడంతో గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొంది. దీంతో వాసుదేవరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య కళావతి ఉన్నారు. వాసుదేవరావు కుమారుడు వసంతకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపారు.


పరిశ్రమలో ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు..

పూసపాటిరేగ: చోడమ్మఅగ్రహారం పంచాయతీ పరిధిలోగల ఓ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో గుంపాం పంచాయతీ తొత్తడాం గ్రామానికి చెందిన గొరుసు రమణ(21) మృతిచెందాడు. స్థానికులు తెలియజేసిన సమాచారం ప్రకారం.. డిగ్రీ పూర్తి చేసిన రమణ కుటుంబ పోషణ నిమిత్తం గత వారం రోజుల కిందటే పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. తల్లిదండ్రులు రాములమ్మ, అసిరినాయుడులు వ్యవసాయకూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి రమణతో పాటు ఒక కుమార్తె ఉంది. శనివారం పరిశ్రమకు వెళ్లిన రమణ, విధుల్లో భాగంగా ఎత్తుగా ఉన్న పైపులైన్‌ నిర్మిస్తుండగా, ప్రమాదవశాత్తు జారి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.  జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ప్రమాదంపై స్థానిక ఎస్‌ఐ జయంతిని వివరణ కోరగా, ప్రమాదం జరిగినట్టు తమకు సమాచారం అందిందని, అయితే ఇంతవరకూ మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు అందజేయలేదని చెప్పారు. 


వడదెబ్బతో వ్యక్తి ..

గుర్ల: గుజ్జంగివలస గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం వడదెబ్బ తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిం చారు. మృతుడి వివరాల కోసం వివిధ మాధ్యమాల్లో సమాచారం అందజే శారు. మృతుడు తెట్టంగి గ్రామానికి చెందిన బొప్పరపు లచ్చుముగా గుర్తించా రు. వయసు సుమారు 58 ఏళ్లు ఉంటాయని అంచనా వేశారు. లచ్చుముకు తమ్ముడు, భార్య, కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లి చేశాడు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మనసు చలించడంతో గ్రామాల్లో పిచ్చివాడిలా తిరుగుతూ ఉన్నాడు. శనివారం ఎండ ధాటికి తట్టుకోలేక వడదెబ్బ తగిలి మృతిచెందాడని స్థానికులు చెబుతున్నా రు. ఎస్‌ఐ శిరీషా కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మృతదేహం తీసుకువెళ్లడానికి ఎవరూ సహకరించలేదు.  


బాత్‌రూమ్‌లో జారిపడి మహిళ..  

భామిని: మండలంలోని సతివాడ పెళ్లికోసం వచ్చిన ఓ మహిళ బాత్‌ రూమ్‌లో జారిపడి  శనివారం మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలానికి చెందిన మిల్ల రాజు (30) సతివాడ గ్రామానికి  వివాహ నిమిత్తం వచ్చింది. రాజు శనివారం ఉదయం స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో జారిపడింది. దీంతో ఆమెను హుటా హుటిన కొత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిఫర్‌చేశారు. ఓ ప్రైవేటు   ఆసుపత్రిలో చేర్పించగా  అక్కడ  మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సతివాడ వెళ్లి దర్యాప్తుచేశారు. రాజు మూడు రోజుల కిందట సతివాడ వచ్చిందని స్థానికులు వివరించారు. ఈ మేరకు బత్తిలి ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Updated Date - 2022-05-22T05:51:33+05:30 IST