ఏడేళ్లు ముగిశాయి

ABN , First Publish Date - 2021-05-26T06:10:22+05:30 IST

అనువుగాని చోట మాత్రమే కాదు, అనువుగాని వేళ కూడా అధికులమనరాదు. బుధవారం నాటికి ఏడేళ్లు నిండుతున్న నరేంద్రమోదీ ప్రధానమంత్రిత్వానికి ఈసారి...

ఏడేళ్లు ముగిశాయి

అనువుగాని చోట మాత్రమే కాదు, అనువుగాని వేళ కూడా అధికులమనరాదు. బుధవారం నాటికి ఏడేళ్లు నిండుతున్న నరేంద్రమోదీ ప్రధానమంత్రిత్వానికి ఈసారి అభినందనలకు, వేడుకలకు ఆస్కారం లేదు. దేశంలో పరిస్థితి బాగాలేదు కాబట్టి, తామే సంబరాలను, సందడిని వద్దని చెప్పినట్టు ప్రభుత్వ పెద్దలు, జాతీయ అధికారపార్టీ పెద్దలు చెబుతున్నారు కానీ, ఉత్సవాలు జరుపుకోవలసినవారిలో ఏమంత ఉత్సాహం లేదన్నది వాస్తవం. రెండునెలలుగా దేశంలో విజృంభించిన రెండో వెల్లువ కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యం అట్టడుగు దాకా ప్రజల అనుభవంలోకి వచ్చింది, జనం ఆ విషయంలో ఏట్లా స్పందిస్తున్నారో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా సూచన అందింది. ఆరున్నరేళ్లకు పైగా, ఏ అవరోధమూ లేకుండా జైత్రయాత్ర సాగించిన నరేంద్రమోదీ జనరంజకత్వం, ఇంత హఠాత్తుగా కుప్పకూలిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మోదీకి కాస్త ఊరట ఏమిటంటే, ఇంతటి సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని, ప్రత్యామ్నాయంగా ముందుకు రావడానికి ఎవరికీ ఓపికలూ లేవు, సమర్థతలూ ఉన్నట్టు లేవు. 


ఈ ఏడేళ్ల కాలంలో భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం అనేక కీలక, తీవ్ర నిర్ణయాలు తీసుకున్నది. వివాదాస్పదంగా ఉన్న అంశాలలో ఎటువంటి బెరుకు లేకుండా వ్యవహరించింది. భావాల రీత్యా తన వెనుక సమీకృతులయ్యే వారి ఉద్వేగాలు సంతృప్తి చెందే నిర్ణయాలు ఎన్నో మోదీ ప్రభుత్వం తీసుకున్నది. ఇక దేశంలో మితవాద రాజకీయాలు, అతి మితవాదంగా, తీవ్ర జాతీయవాదంగా పరిణమిస్తాయని, ఫలితంగా సమకూరే తిరుగులేని అధికారంతో నాయకులు నియంతలుగా మారే ప్రమాదం కూడా ఉన్నదని పరిశీలకులు హెచ్చరికలు జారీచేశారు. ఒక వ్యూహం ప్రకారం పరిపాలనను, భావ వ్యాప్తిని నిర్వహించుకుంటూ వచ్చిన భారతీయ జనతాపార్టీ అగ్రనాయకులు, ఎక్కడా విశ్రమించింది, ఆదమరిచింది కూడా లేదు. పోయిన అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి బెంగాల్ మీద ప్రత్యేకంగా గురిపెట్టారు. ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా వచ్చే ఏడాది ఆరంభంలో జరగవలసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధానమంత్రి, అమిత్ షా, యుపి ముఖ్యమంత్రి యోగి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో సమావేశమై వ్యూహచర్చలు జరిపారు. దూరదృష్టితో ఎక్కడా లక్ష్యశుద్ధి చెడకుండా వ్యవహరిస్తున్న అగ్రనాయక ద్వయం, వారికి మొన్నటి దాకా పూర్తి ఆశీస్సులు అందిస్తూ వచ్చిన సంఘ్ పరివార్ ఎక్కడ దెబ్బతిన్నారు అన్న ప్రశ్న పైనే సకల పక్షాల వారూ ఇప్పుడు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అవరోహణలో ఉన్నవారు, పతన వేగం ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం కాక సతమతమవుతున్నవారు, తమ గత విజయాలకు సంబరాలకు సిద్ధపడే మానసికస్థితిలో ఉంటారా? 


కొన్ని నిర్ణయాలు ప్రజానీకంలోని కొన్ని శ్రేణులను మాత్రమే ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కానీ, అందరినీ కష్టపెట్టిన నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి నిర్ణయాల విషయంలో కూడా ప్రతికూల అభిప్రాయాన్ని బిజెపి ప్రభుత్వం సులువుగానే అధిగమించగలిగింది. నరేంద్ర మోదీ ఏమి చేసినా, ధనికులకు వ్యతిరేకంగా పేదలకు అనుకూలంగా చేస్తారని, ఆయన హయాంలో హిందువులకు గుర్తింపు పెరిగిందని, సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పారని .. ఇటువంటి అభిప్రాయాలు ఏవో అధికసంఖ్యాకుల మనసులో సానుకూలతను నిర్మించాయి. కశ్మీర్, అయోధ్య వంటి పరిణామాలు కూడగట్టిన మద్దతు చెప్పనక్కరలేదు. పౌరసత్వ చట్టం విషయంలో బాధిత శ్రేణులు, వారికి మద్దతుగా ప్రజాస్వామిక వాదులు గట్టిగా నిరసనలు చెప్పినప్పటికీ, మైనారిటీలను అదుపులో పెట్టే చర్యగా దాన్ని భావించి, మెజారిటీవాదులు దాన్ని స్వాగతించారు. గాలి ఎక్కడ తిరిగింది అంటే, ఢిల్లీలో ఇప్పటికీ బైఠాయించి ఉద్యమిస్తూ ఉన్న రైతుల దగ్గర. పౌరసత్వ చట్టం వ్యతిరేక ఉద్యమంతో చేసినట్టు, రైతు ఉద్యమంతో కూడా వ్యహరించాలనే ప్రయత్నం నెగ్గలేదు. రైతుల మనోబలం చెక్కుచెదరకుండా నిలబడి ఉన్నది. ఇక, కరోనా మొదటి వెల్లువలో, యావత్ దేశానికి దిశానిర్దేశం చేసే నాయకుడిగా కనిపించిన నరేంద్రమోదీ అతి తొందరలోనే ఆశాభంగం కలిగించారు. మొదటి దశకు, రెండవ దశకు మధ్య లభించిన సమయాన్ని సమర్థమైన వ్యూహరచనకు, మౌలిక సదుపాయాల వృద్ధికి ఉపయోగించకుండా, రాజకీయ ప్రయోజనాల మీదనే దృష్టి పెట్టారని విమర్శలు వచ్చాయి. నిపుణుల మాటలు, క్షేత్రస్థాయిలో ఉన్నవారి మాటలు, శాస్త్రజ్ఞుల సలహాలు... వినకుండా ఏకపక్షంగా వ్యవహరించారని వ్యాఖ్యలు వినిపించాయి. కరోనా కట్టడి విషయంలో ప్రధానమంత్రితో ముఖ్యమంత్రుల సమావేశం వల్ల ప్రయోజనం ఏమీ లేదని, అదంతా ఏకపాత్రాభినయమేనని బెంగాల్, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులు ఈ మధ్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


రెండవ వెల్లువ కొవిడ్ ఈ దేశ వైద్య ఆరోగ్య వ్యవస్థ పరిమితులను స్పష్టంగా ఆవిష్కరించింది. అంతే కాదు, నాయకుల హ్రస్వదృష్టిని, ఉదాత్తత సంతరించుకోలేని అల్పత్వాన్ని కూడా బట్టబయలు చేసింది. ఎడతెగని చితిమంటలు, ప్రాణవాయువు కోసం హాహాకారాలు, ఆస్పత్రుల ముందు పడిగాపులు.. ఉపద్రవం విశ్వరూపం, మానవ తప్పిదాలను ఆసరా చేసుకుని విజృంభించింది. ఈ సమయంలో ఒక నేత జాతికి అవసరం. ఆ నేత, నూటికి నూరుశాతం భద్రత ఇవ్వనక్కరలేదు, భరోసాగా నిలబడితే చాలు. విపత్తును నివారించడానికి, నిరోధించడానికి కావలసిన వ్యూహరచన మీద తన మనసును కేంద్రీకరిస్తే చాలు. సమస్యను పట్టించుకుంటున్నారన్న నమ్మకం కలిగితే చాలు. తాను స్వయంగా వ్యాధి వ్యాప్తి చేయకుండా ఉంటే చాలు. రాష్ట్రాల మధ్య పక్షపాతం చూపకుండా ఉంటే చాలు. కానీ, ఆ కర్తవ్యాలను నెరవేర్చడంలో నరేంద్రమోదీ ప్రభుత్వం విఫలమయిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఏడేళ్ల ప్రయాణాన్ని సమీక్షిస్తే, అనేక విజయాలను కూడా చెప్పవచ్చునేమో, కానీ, వర్తమానంలోని బీభత్స వైఫల్యం అన్నిటినీ మసకబార్చింది.

Updated Date - 2021-05-26T06:10:22+05:30 IST