
నల్గొండ : అందరికీ తలనొప్పిని తగ్గించే విక్స్... ఆ చిన్నారి పాలిట మాత్రం మరణశాసనంగా మారింది. ఈ విషాధ ఘటన వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం తొర్లాయి గ్రామానికి చెందిన కట్టా కిరణ్ దంపతులు ఉద్యోగ నిమిత్తం నల్గొండలో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడు నెలల బాబు ఉన్నాడు. బంధువుల శుభకార్యం ఉండడంతో రెండు రోజుల క్రితం తొర్లాయి గ్రామానికి వచ్చారు.
మంగళవారం ఉదయం వారి ఇంటి ఆవరణలో బాబు ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడే విక్స్ బాక్స్ ఉండడంతో నోట్లో పెట్టుకుని మింగాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాబును ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఊపిరాడక చిన్నారి.. ప్రాణాలను వదిలాడు. దీంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తమ ఒక్కగానొక్క కుమారుడు తమకు దూరమయ్యాడంటూ బోరున విలపించారు. వీరిని చూసిన స్థానికులు.. అయ్యోపాపం.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.