డిగ్రీ ప్రవేశాలకు సర్వర్‌ సంకటం

ABN , First Publish Date - 2021-01-10T05:23:47+05:30 IST

డిగ్రీ ప్రథమ సంవత్సరం చేరబోయే విద్యార్థులకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది.

డిగ్రీ ప్రవేశాలకు సర్వర్‌ సంకటం

మదనపల్లె టౌన్‌, జనవరి 9: డిగ్రీ ప్రథమ సంవత్సరం చేరబోయే విద్యార్థులకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది. డిగ్రీలో ప్రవేశానికి ముందులా ఆఫ్‌లైన్‌ కాకుండా ఆన్‌లైన్‌ అడ్మిషన్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఈనెల 6వ తేది ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ జారీ చేయగా 8వ తేది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి వుంది.  9వ తేది నుంచి ఓఏఎండీసీ(ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ మోడ్యూల్‌ ఫర్‌ డిగ్రీ కాలేజెస్‌) వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థులకు వారికి కావాల్సిన కోర్సులు, కళాశాలల వివరాలు తెలుసుకుని ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్‌ చేయించుకోవాల్సి వుంది. అంతా సవ్యంగా జరిగితే పర్వాలేదు కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ప్రథమ సంవత్సరం చేరాలనుకున్న విద్యార్థులందరూ ఒకేసారి ఓఏఎండీసీ సర్వర్‌ వినియోగిస్తుండటంతో సర్వర్‌డౌన్‌ అయిపోయి పనిచేయకుండా మొరాయిస్తోంది. ఒక విద్యార్థి అడ్మిషన్‌ పొందాలంటే కనీసం 10 నుంచి 20 నిమిషాల సమయంలో ముగియాల్సిన పనికి రోజంతా ప్రాయాసపడాల్సి వస్తోంది. కొంత మంది అయితే తమ వివరాలను అన్నింటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి సేవ్‌ చేసేలోగా సర్వర్‌ డౌన్‌ కారణంగా వారి వివరాలు కంప్యూటర్‌ స్ర్కీన్‌పై చెరిగిపోతున్నాయి. దీంతో విద్యార్థులు అర్ధరాత్రి వరకు నెట్‌ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిల్లాలో 110 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ఉండగా ఈసారి ప్రథమ సంవత్సరంలో ఎంతలేదన్నా 38వేల మంది విద్యార్థులు చేరాల్సి ఉంది. కాగా 9వ తేది ప్రారంభమైన వెబ్‌సైట్‌ ఈనెల 17వ తేది వరకు పనిచేస్తుంది. ఈనెల 20వ తేదీన విద్యార్థికి ఆయా కళాశాలల్లో సీట్‌ అలాట్‌మెంట్‌ జరుగుతుంది. ఈనెల 23వ తేది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా కాని, స్వయంగా కాని ఆయా కళాశాలకు వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంది. కాగా తొలిరోజే వెబ్‌సైట్‌ సర్వర్‌ మొరాయిస్తుండటంతో నిర్దేశిత సమయంలో ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు అప్లికేషన్‌ దాఖలు చేయడం సాధ్యమా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు ఓఏఎండీసీ వెబ్‌సైట్‌ సర్వర్‌ పనితీరు వేగం చేయడానికి ప్రయత్నించాల్సిన ఆవశ్యకత ఉంది.

Updated Date - 2021-01-10T05:23:47+05:30 IST