నిర్లక్ష్యం వల్లే తీవ్రత!

ABN , First Publish Date - 2021-05-09T05:42:36+05:30 IST

కరోనా లక్షణాలు ఉండి కూడా కొంత మంది నిర్లక్ష్యం చేస్తున్నారని, దీంతో వారి కుటుంబసభ్యులకు, గ్రామ ప్రజలకు వ్యాధిని వ్యాపింపజేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం మెదక్‌ కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, కలెక్టర్‌ హరీ్‌షతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

నిర్లక్ష్యం వల్లే తీవ్రత!
మెదక్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

కట్టడి కోసమే ఇంటింటి సర్వే

మెదక్‌ జిల్లాలో 581 సర్వే బృందాలు 

3,491 మందికి కిట్ల అందజేత

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


మెదక్‌/మెదక్‌ రూరల్‌ మే 8: కరోనా లక్షణాలు ఉండి కూడా కొంత మంది నిర్లక్ష్యం చేస్తున్నారని, దీంతో వారి కుటుంబసభ్యులకు, గ్రామ ప్రజలకు వ్యాధిని వ్యాపింపజేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం మెదక్‌  కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, కలెక్టర్‌ హరీ్‌షతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటింటికీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. అందులో భాగంగా మెదక్‌ జిల్లాలో 581 బృందాలను ఏర్పాటు చేసి, ఇప్పటివరకు లక్షా 40 వేల ఇళ్లను సర్వే చేశామన్నారు. 6,126 మంది (4.5 శాతం) కొవిడ్‌ బాధితులను గుర్తించామన్నారు. అందులో 3,491 మందికి కొవిడ్‌ కిట్లు, ప్రిస్ర్కిప్షన్‌ అందించటంతో పాటు స్వల్ప లక్షణాలున్న మరికొందరికి మందులు అందించారన్నారు. బృందాలు రోజూ కనీసం 25 కొవిడ్‌ కిట్లకు తగ్గకుండా వెంట తీసుకెళ్లాలని లేకుంటే ఇంటింటి సర్వే ఫలితముండదని మంత్రి సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా మనుషుల ప్రాణాలను కాపాడిన వారమవుతామన్నారు. 

మెదక్‌ జిల్లాలో 260 ఆక్సిజన్‌ పడకలు

మెదక్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్‌తో కూడిన 260 పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో ప్రస్తుతం 42 మంది కొవిడ్‌ రోగులు ఉన్నారని, ఇంకా 218 పడకలు అందుబాటులో ఉన్నాయని, ఖాళీల వివరాలు ప్రతిరోజూ ప్రజలకు తెలిసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒక వేళ అన్ని పడకలు నిండితే వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ అవసరం అవుతుందని, 45 లీటర్ల సామర్థ్యం గల 90 సిలిండర్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఇంకా 90 సిలిండర్లు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలో చేపడుతున్న వెయ్యి లీటర్ల సామర్ధ్యం గల ఆక్సిజన్‌ ప్లాంట్‌ మరో ఐదు రోజుల్లో అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు గ్రానైట్‌, ఫార్మా, స్టీల్‌ తదితర కర్మాగారాల నుంచి సేకరించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, ఇతర మందుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీటిని మానిటరింగ్‌ చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం జిల్లాకు రోజుకు 15 రెమ్‌డెసివిర్‌లు వస్తున్నాయని వాటిని పెంచాలని రాష్ట్ర ఆరోగ్య శాఖాధికారులతో ఫోన్‌లో కోరారు. అలాగే జిల్లాలో రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకునే వారు లక్ష మంది ఉంటారని, కానీ 3 వేల టీకాలు మాత్రమే సరఫరా అవుతున్నాయని వాటి సంఖ్య ఇంకా పెంచాలని సూచించారు. రెండోడోసు తీసుకునే వారు మొదటిడోసు తీసుకున్న కేంద్రానికి ఆధార్‌కార్డుతో వెళ్లాలని, వారం రోజుల్లోగా అందరికీ టీకా ఇస్తామని మంత్రి చెప్పారు. 

అనంతరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో కొనసాగుతున్న వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, సమీకృత మార్కెట్‌ నిర్మాణాల పనులకు సంబంధించిన వివరాలు, తూప్రాన్‌లో రోడు ్డవెడల్పుకు స్థలాల అప్పగింత తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డెరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, అదనపు కలెక్టర్‌ రమేష్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:42:36+05:30 IST