వ్యాధి తీవ్రత.. మందుల కొరత

ABN , First Publish Date - 2021-04-18T05:43:19+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాను చుట్టేస్తున్నది. రోజురోజుకు వందలాది మంది కరోనా బారిన పడుతుండగా ప్రైవేట్‌ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి.

వ్యాధి తీవ్రత.. మందుల కొరత

-జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

- ఆసుపత్రుల నిండా రోగులు 

- అందుబాటులో లేని రెమిడిసివర్‌, ఆక్సిజన్‌ 

- కొరత తీర్చేందుకు అధికారుల ప్రయత్నాలు 

- ప్రజల్లో కొరవడుతున్న అప్రమత్తత 

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాను చుట్టేస్తున్నది. రోజురోజుకు వందలాది మంది కరోనా బారిన పడుతుండగా ప్రైవేట్‌ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసే రెమిడిసివర్‌ ఇంజక్షన్లు, టానిక్‌లు, టాబ్లెట్లు ప్రాణాధారమైన ఆక్సీజన్‌కు మార్కెట్‌లో కొరత ఏర్పడింది. నాలుగు రోజులుగా రోజుకు సుమారు 500 మంది వ్యాధిబారినపడుతున్నారు. శనివారం 428 మంది కరోనా బారినపడగా వారిలో 198 మంది కరీంనగర్‌ పట్టణానికే చెందినవారున్నారు. గ్రామీణ ప్రాంతాలలో మరో 232 మంది వ్యాధిబారినపడ్డారు. పట్టణంలో 874 మందికి పరీక్షలు నిర్వహించగా 198 మందికి వ్యాధిసోకినట్లు నిర్ధారణ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,316 మందికి పరీక్షలు నిర్వహించగా 230 మందికి వ్యాధి సోకింది. కరీంనగర్‌ పట్టణంలో పరీక్షలు చేయించుకున్న వారిలో 22.6శాతం, గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు చేయించుకున్న వారిలో 10.8 శాతం మందికి వ్యాధి నిర్ధారణ అయింది.

సిటీ స్కాన్‌ సెంటర్లలో...

జిల్లా వ్యాప్తంగా 428 కేసులు శనివారం నమోదు కాగా శుక్రవారం 482, గురువారం రోజు 503 మంది వ్యాధిబారినపడ్డారు. వీరంతా ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకున్న వారు మాత్రమే. కరీంనగర్‌ పట్టణంలో 13 సీటీ స్కాన్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో స్కానింగ్‌ సెంటర్‌లో సగటున 100 మందికి తగ్గకుండా రోజు స్కానింగ్‌ చేయించుకుంటున్నారని సమాచారం. సగటున రోజుకు వేయి మంది సీటీ స్కాన్‌ చేయించుకుంటుండగా వీరిలో సుమారు 70 నుంచి 75శాతం మందికి కరోనా  నిర్ధారణ అవుతుందని ఆయా స్కానింగ్‌ సెంటర్ల యజమానులు చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు సీటీ స్కాన్‌ల ద్వారా సుమారు 700 నుంచి 750 మంది కరోనా వ్యాధి పీడితులుగా నిర్ధారణ అవుతున్నట్లు వెల్లడవుతున్నది. అంటే జిల్లాలో సగటున రోజుకు 1200 నుంచి 1300 మంది వ్యాధికి గురవుతున్నారని అనధికారికంగా లెక్కలు వేస్తున్నారు. 

నిబంధనలు బేఖాతర్‌

పట్టణ ప్రాంతాల్లో సినిమాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, బార్లు, కూరగాయల మార్కెట్లు వ్యాపార కూడళ్ళలో కరోనా నిబంధనలను పాటించడంలేదు. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ కారణంగానే పట్టణంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మాస్క్‌లు ధరించని వారికి జరిమానా విధించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి కలెక్టర్‌, ఎస్పీలకు అధికారాలను కట్టబెట్టింది. అయితే ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిన జిల్లా యంత్రాంగం సమీక్షలకు, ప్రకటనలకే పరిమితమవుతుంది. జీవో 68,69 అమలులో కఠినంగా వ్యవహరించని కారణంగా ప్రజల్లో కూడా నిర్లక్ష్యం పెరిగిపోయింది. 

రెమిడిసివర్‌, ఫమిబ్ల్యూ కొరత : 

కరోనా వ్యాధిని తగ్గించే రెమిడిసివర్‌ ఇంజక్షన్లు, ఫమిబ్ల్యూ టాబెట్లు, ఆక్సీజన్లకు  కొరత ఏర్పడుతున్నది. కరోనా మొదటి వేవ్‌ అక్టోబర్‌లో తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో మెడికల్‌ ఏజెన్సీలకు చెందిన వారు తమ వద్ద ఉన్న మందులను ఆయా కంపెనీలకు తిప్పి పంపించారు. రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ వివిధ కంపెనీలను అనుసరించి ఆరు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే ఉంటుండంతో ఆ మందులను మెడికల్‌ ఏజెన్సీల వారు వాపసు చేశారు. సెకండ్‌ వేవ్‌ మొదలై నెలరోజులు తిరగక ముందే తీవ్ర రూపం దాల్చడంతో రెమ్‌డిసివర్‌, ఇంజక్షన్లు, టానిక్‌లు, టాబ్లెట్లుగానీ అందుబాటులో లేకుండా పోయాయి. 

ఫ ఆక్సీజన్‌ కొరతతో ఆందోళన: 

కరోనా వ్యాధి పీడితులకు మందుల కంటే అత్యవసరంగా అందాల్సింది ఆక్సీజన్‌. ఆక్సీజన్‌కు కొరత ఏర్పడడంతో ప్రజల్లో, రోగుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. కరీంనగర్‌ జిల్లాలో మూడు ఆక్సీజన్‌ తయారీ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లో రెండింటికి మాత్రమే శనివారం లిక్విడ్‌ ఆక్సీజన్‌ స్టాక్‌ వచ్చింది. ఇది జిల్లా అవసరాలకు నాలుగురోజులకు మాత్రమే సరిపోయే అవకాశమున్నదని తెలుస్తున్నది. ఆక్సీజన్‌ కొరత ఏర్పడడంతో ఆసుపత్రులకు మినహా వేరే ఏ వ్యాపార సంస్థకు కూడా ఆక్సీజన్‌ సరఫరా చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో రెగ్యులర్‌గా గ్రానైట్‌, వర్క్‌షాపులు, వెల్డింగ్‌షాపులు, వివిధ పరిశ్రమలకు సంబంధించిన వారు ఆక్సీజన్‌ను వినియోగిస్తుంటారు. ఇప్పుడు ఆ సంస్థలకు ఆక్సీజన్‌ సరఫరా నిలిపివేశారు. జిల్లాలో గతంలో ఏడు క్యూబిక్‌ మీటర్ల ఆక్సీజన్‌ ఉన్న సిలిండర్లు రోజుకు 300 మేరకు వినియోగం అయ్యేది. ఇప్పుడు వీటి వినియోగం 1500పై చిలుకు పెరిగింది. గతంలో వినియోగించిన దానికంటే ఐదు రెట్లు ఆక్సీజన్‌ వినియోగం పెరిగినట్లు తయారీదారులు చెబుతున్నారు. గతంలో బళ్ళారి, చెన్నయ్‌, ముంబాయ్‌, గుజరాత్‌, వైజాగ్‌ నుంచి లిక్విడ్‌ ఆక్సీజన్‌ను తీసుకువచ్చి ఆక్సీజన్‌గా మార్చి వీరు సిలిండర్ల ద్వారా సరఫరా చేసేవారు. ఇప్పుడు ఆయా కేంద్రాల నుంచి లిక్విడ్‌ ఆక్సీజన్‌ సరఫరా రావడం లేదు. దీనితో ఆక్సీజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సీజన్‌కు ఇబ్బంది లేదు. ఈ ఆసుపత్రిలో 21 కిలో లీటర్ల కెపాసిటీగల గ్యాస్‌ ట్యాంకు ఉండడంతో ప్రతి 10 రోజులకొకసారి లిక్విడ్‌ ఆక్సీజన్‌ను తీసుకొని వచ్చి నింపుతున్నారు. దీనితో 400 మంది రోగులకు 10 రోజులపాటు నిరంతరరాయంగా సరఫరా చేసే అవకాశమున్నది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స కోసం 180 పడకలు ఉండగా దీన్ని మరో 109 బెడ్స్‌కు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 174 మంది పడకలకు ఆక్సీజన్‌ సౌకర్యం ఉండగా మరో 30 పడకలకు ఆక్సీజన్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని కలుపుకొని 294 పడకలకు ఆక్సీజన్‌ సౌకర్యమున్నది. ప్రస్తుతం ఉన్న 21 కిలో లీటర్ల ట్యాంకుతో ఎలాంటి కొరత లేకుండా ఆక్సీజన్‌ సరఫరా చేస్తున్నారు. 

ఫ కొత్తగా మరో ఆక్సీజన్‌ తయారీ యంత్రం : 

జిల్లా ఆసుపత్రిలో 90 లక్షల వ్యయంతో ఆక్సీజన్‌ కాన్సంట్రేటర్‌ ప్లాంట్‌, (పీఎస్‌ఏ)ను కూడా నెలకొల్పుతున్నారు. మరో రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి రానున్నది. ఈ యంత్రం గాలిలో ఉన్న ఆక్సీజన్‌ను వేరు చేసి ట్యాంకు, పైపులైన్‌ ద్వారా రోగులకు ఆక్సీజన్‌ను అందిస్తుంది. ఒక నిమిషానికి 425 లీటర్ల చొప్పున ఇది 24 గంటల్లో 7వేల లీటర్ల ఆక్సీజన్‌ను తయారు చేస్తుంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా నేచురల్‌ ఆక్సీజన్‌ను ఇది రోగులకు అందించేందుకు వీలుగా ఏర్పాటైంది. 

ఫ రెమిడిసివర్‌ను అందించేందుకు అన్ని చర్యలు : 

- కిరణ్‌కుమార్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ 

జిల్లాలో ప్రస్తుతం కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల వారు హెటీరో, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీలకు రెమిడిసివర్‌ ఇంజన్ల కోసం ఆర్డర్‌ పంపిస్తే ఆయా కంపెనీలు స్టాక్‌ అందుబాటును బట్టి పంపిస్తున్నాయి. దీనితో ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నాం. నేరుగా ఆర్డర్‌ ఇవ్వలేని వారు మెడికల్‌ ఏజెన్సీల ద్వారా ఆర్డర్‌ చేసి ఇంజన్లను తెప్పిస్తున్నారు. ఏ ఆసుపత్రిలోనైనా రోగికి అత్యవసరముండి ఇంజక్షన్లు అందుబాటులో లేదన్న సమాచారమిస్తే తాము వారికి మందు అందేలా చూస్తున్నాం. శనివారం జిల్లాకు 120 వాయిల్స్‌ రెమిడిసివర్‌ వచ్చింది. వీలును బట్టి జిల్లాకు ఇంజక్షన్లు కేటాయించేలా ఆయా కెంపెనీలతో మాట్లాడుతున్నాం. ఇంజక్షన్లను బ్లాక్‌ చేయకుండా అన్ని ఆసుపత్రులు, ఏజెన్సీలపై నిఘా ఉంచాం. ఆసుపత్రుల వారు తమకు కంపెనీలు విడుదల చేసి ఇంజక్షన్లు ఏ పేషెంట్‌కు ఇచ్చారు, ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చారన్నది ఆధార్‌కార్డు నెంబర్‌తో సహా నమోదు చేయాల్సి ఉంటుంది. 

ఫ రెండు రోజుల్లోగా ఇంజక్షన్లు, టాబ్లెట్లు అందుబాటులోకి 

- గుండా మునీందర్‌రాజు, ప్రధాన కార్యదర్శి, జిల్లా కెమిస్టు అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌

రెమిడిసివర్‌ ఇంజన్లు, టానిక్‌లు, ట్యాబెలెట్లు రెండు, మూడురోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం వీటికి కొరత ఉన్న మాట వాస్తవమే. అయినా దానిని తీర్చేందుకు ఆర్డర్లు చేశాము. కరోనా మొదటివేవ్‌ తగ్గిపోయిన కారణంగా సమీప ఎక్స్‌పైరీ డేట్‌ ఉన్నందున మందులను వాపసు చేయాల్సి వచ్చింది. మందులు లేవనే ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ప్రతి రోజు స్టాక్‌ వచ్చేలా చూస్తున్నాము. 

ఫ లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా చేయాలి

- లక్ష్మిమనోహర్‌రావు, ఆక్సిజన్‌ సప్లయిదారు 

జిల్లాలో కరోనా కారణంగా ఆక్సిజన్‌ వినియోగం పెరిగింది. ఒకేసారి ఐదు రేట్ల డిమాండ్‌ పెరుగడంతోపాటు ముడిసరుకు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆక్సీజన్‌ సిలిండర్లను అందించలేక పోతున్నాము. గతంలో జిల్లాలో మూడు కంపెనీల ద్వారా రోజుకు 300 సిలిండర్లు కూడా అమ్మేవారం కాదు. ఇప్పుడు ఆ డిమాండ్‌ ఐదు రెట్లు పెరిగింది. ప్రస్తుతం మా వద్ద నాలుగు రోజులకు సరిపోయే ఆక్సీజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు వేయి నుంచి 1500 ఆక్సీజన్‌ సిలిండర్లు అవసరమవుతున్నాయి. ప్రభుత్వం లిక్విడ్‌ ఆక్సీజన్‌ను సరఫరా చేసి ప్రజలకు ఆక్సీజన్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. 


Updated Date - 2021-04-18T05:43:19+05:30 IST