క్లబ్‌హౌజ్‌లోనూ టార్గెట్ అవుతున్న ముస్లిం మహిళలు

ABN , First Publish Date - 2022-01-18T22:54:16+05:30 IST

క్లబ్‌హౌజ్‌లో జరిగిన ఆడియో డిస్కషన్‌లో ఓ వ్యక్తి మాట్లాడుతూ హిందూ యువతుల కంటే ముస్లిం యువతులు చాలా అందంగా ఉంటారని చెప్తూనే వారిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు..

క్లబ్‌హౌజ్‌లోనూ టార్గెట్ అవుతున్న ముస్లిం మహిళలు

న్యూఢిల్లీ: బుల్లిబాయ్ యాప్ గురించి అందరికి గుర్తుండే ఉంటుంది. మత విద్వేషంతో రగిలిపోతున్న కొంతమంది విద్యార్థులు ఆ యాప్‌ను రూపొందించి ముస్లిం మహిళలను అందులో వేలానికి పెట్టారు. దేశంలో పెను సంచలనం సృష్టించిన ఈ బుల్లి యాప్ వ్యవహారంలోని నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ వారు మిగిల్చిపోయిన విద్వేషం మాత్రం మిగిలిన సోషల్ మీడియా వేదికలను తాకింది. తాజాగా ఓ వ్యక్తి క్లబ్‌హౌజ్ (వాయిస్ చాట్ యాప్) వేదికగా ముస్లిం మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది స్వయంగా ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యురాలే వినడం గమనార్హం.


క్లబ్‌హౌజ్‌లో జరిగిన ఆడియో డిస్కషన్‌లో ఓ వ్యక్తి మాట్లాడుతూ హిందూ యువతుల కంటే ముస్లిం యువతులు చాలా అందంగా ఉంటారని చెప్తూనే వారిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాగా, దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులకు లేఖ రాశారు. క్లబ్‌హౌజ్‌లో రికార్డులను పరిశీలించి నిందులపై కేసు నమోదు చేసి తమకు ఐదు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని పేర్కొన్నారు.


ఈ విషయమై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ ‘‘ఎవరో నన్ను ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి ‘క్లబ్‌హౌజ్ రూం’ లింక్ పంపారు. ఓపెన్ చూస్తూ.. అందులో ముస్లిం మహిళలు, బాలికల గురించి చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. వినడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. దేశంలో ఏం జరుగుతోంది. మహిళ పరిస్థితి ఏంటనే ఆవేదన కలిగింది. అందుకే వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాను’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-01-18T22:54:16+05:30 IST