విద్యార్థుల పెండింగ్‌ ఫీజులు వెంటనే చెల్లించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2022-01-19T06:44:10+05:30 IST

విద్యార్థుల పెండింగ్‌ ఫీజులు వెంటనే చెల్లించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

విద్యార్థుల పెండింగ్‌ ఫీజులు వెంటనే చెల్లించాలి: ఎస్‌ఎఫ్‌ఐ
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు

గవర్నర్‌పేట, జనవరి 18: గత సంవత్సరం పెండింగ్‌ ఉన్న జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, పీజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. మంగళవారం ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు ఎం.సోమేశ్వరరావు, సీహెచ్‌ వెంకటేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత విద్యాసంవత్సరంలో ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకుని బయటకు వచ్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని, బకాయిలు విడుదల చేసి వారి భవిష్యత్తు కాపాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. వీటితో పాటు అర్హులైన పీజీ విద్యార్థులకు కూడా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనను వర్తింపజేయాలని కోరారు. జీవో నెంబరు 77ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కె.లెనిన్‌, కుమార్‌ నాయక్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T06:44:10+05:30 IST