దెయ్యాల హోటల్‌

ABN , First Publish Date - 2022-05-15T16:44:12+05:30 IST

షాడోస్‌... అంటే నీడలు. ఆ రెస్టారెంట్‌ను బయటి నుంచి చూస్తే మామూలుగానే ఉంటుంది. కాస్త దగ్గరకు వెళితే నీలం రంగు భవనానికి ఉన్న అద్దాల్లోంచి దెయ్యాల నీడలు కనిపిస్తాయి.

దెయ్యాల హోటల్‌

భయం  కూడా తెలియని థ్రిల్‌ను కలిగిస్తుంది. ఇప్పటిదాకా ఎన్నో హార్రర్‌ సినిమాలు చూసి ఉంటారు. ‘స్కేరీ హౌస్‌’లలోకి వెళ్లి  ఉంటారు. భయంలో నుంచి వినోదాన్ని పొందడం ఒక అనుభూతి. అయితే భయపడుతూనే రుచికరమైన తిండి తినాలంటే మాత్రం సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇటీవల ప్రారంభమైన ‘షాడోస్‌’ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే...

షాడోస్‌... అంటే నీడలు. ఆ రెస్టారెంట్‌ను బయటి నుంచి చూస్తే మామూలుగానే ఉంటుంది. కాస్త దగ్గరకు వెళితే నీలం రంగు భవనానికి ఉన్న అద్దాల్లోంచి దెయ్యాల నీడలు కనిపిస్తాయి. భవనంపైన నిప్పులు చెరుగుతున్న కళ్లతో గబ్బిలాల శిల్పాలు భయపెడతాయి. అంటే... ఒకలాంటి బెదురుతోనే కస్టమర్లు రెస్టారెంట్‌లోకి ఎంట్రీ ఇస్తారన్నమాట. ఇదంతా ఒకెత్తయితే లోపలికి అడుగుపెట్టిన తర్వాత లెక్క మరోలా ఉంటుంది. మసక చీకటిలో మీ ధైర్యానికి ఎన్నో పరీక్షలు పెడుతూనే భయంలో నుంచి తెలియని థ్రిల్‌ను అందిస్తుంది. 


మనిషి రక్తానికి మరిగిన జాంబీస్‌, రక్త పిశాచులు, వింత దెయ్యాలు హోటల్‌లో విచ్చలవిడిగా సంచరిస్తుంటాయి. వాటి మధ్యనే కస్టమర్లు విందు ఆరగించాల్సి ఉంటుంది. ఇక్కడ మెనూ కూడా భయపెడుతుంది. పుర్రెలు, రక్తాన్ని పోలిన ఫుడ్‌ కాసేపు ఇబ్బందిపెట్టినప్పటికీ వాతావరణం అలవాటైతే మాత్రం రుచికరమైన ఫుడ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చంటున్నారు రెస్టారెంట్‌ను సందర్శించినవారు. ‘‘నేనిక్కడికి వినోదం కోసం, నవ్వుకోవడానికి వచ్చాను. కానీ లోపల వాతావరణం మాత్రం భయపెట్టేలా ఉంది. ఎంత ధైర్యం ఉన్నప్పటికీ భయపడటం మాత్రం ఖాయం’’ అంటున్నాడు నోరా అస్సాద్‌ అనే కస్టమర్‌. 


జాంబీ క్యాస్టూమ్స్‌ వేసుకున్న నటీనటులు థీమ్‌కు తగ్గట్టుగా కస్టమర్లను ఒకవైపు భయపెడుతూనే వినోదాన్ని అందిస్తారు. గోడలకు అమర్చిన టీవీల్లో కూడా హార్రర్‌ సినిమాలు వస్తుంటాయి. ఎరుపు, నలుపు కాంబినేషన్‌లో ఉండే అక్కడి వాతావరణంలో ప్రతీ నిముషం ఏదో ఒక థ్రిల్‌ ఎదురవుతూనే ఉంటుంది. వాటిని ఎంజాయ్‌ చేస్తూనే ఆర్డర్‌ ఇచ్చిన ఐటెమ్స్‌ను ఎంచక్కా తినొచ్చు. కొన్నిసార్లు ఊహించని ట్విస్ట్స్‌ కూడా జరుగుతాయి. ఉదాహరణకు అప్పటిదాకా మీ పక్కనే కూర్చున్న కుటుంబసభ్యుల స్థానంలో జాంబీ, వాంపైర్‌ వేషాధారణతో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. దాంతో ఒక్కసారిగా షాక్‌కు గురవుతాం. ఎదురు సీట్లో రక్తచారికలతో పడిపోయి ఉన్న నిర్జీవిని చూస్తూనే ప్లేట్‌లోని ఫుడ్‌ ఆరగించాల్సి వస్తుంది. తెగిపోయిన చేయి ఆకారాల్లో ఉన్న బన్నులు, ఎర్రటి నాలుకల్లా కనిపించే సలాడ్లు, పుర్రె ఆకారంలో కేకులు, రక్తంలాంటి సూపులు... ఎటు తిరిగి రెస్టారెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరు థ్రిల్‌గా ఫీలవుతూనే రుచికరమైన ఫుడ్‌ను ఎంజాయ్‌ చేయాలనేది నిర్వాహకుల ఆలోచన. ఇటీవల ప్రారంభమైన ఈ దెయ్యాల హోటల్‌కు సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. వేసవిలో ప్రపంచం నలుమూలల నుంచి అధికసంఖ్యలో కస్టమర్లు ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నారు. సో... ఈసారి ఎడారి దేశానికి వెళ్తే ‘షాడోస్‌’కు వెళ్లే ధైర్యం చేయండి మరి.

Updated Date - 2022-05-15T16:44:12+05:30 IST