అడుగడుగునా అవమానం

ABN , First Publish Date - 2022-04-07T07:47:23+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై పంచాయితీ ఢిల్లీకి చేరింది. తనకు జరుగుతున్న అవమానాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని మోదీకి గవర్నర్‌ తమిళిసై ఫిర్యాదు చేశారు.

అడుగడుగునా అవమానం

  • గవర్నర్‌ ప్రసంగం చేయనివ్వలేదు
  • ప్రొటోకాల్‌ పాటించడం లేదు 
  • కేసీఆర్‌పై ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్‌ ఫిర్యాదు 
  • నన్ను కాదు... గవర్నర్‌ వ్యవస్థను అవమానిస్తున్నారు
  • మీరు చెప్పింది ఆమోదించకపోతే అవమానిస్తారా..?
  • గవర్నర్‌తో వ్యవహరించే తీరు ఇదేనా..?
  • నేను రాజకీయం చేసిన ఘటన ఒక్కటి చెప్పండి
  • రాజ్‌భవన్‌ కార్యక్రమాలకు అధికారులూ రావడంలేదు
  • నివేదికలు ఇవ్వడంలేదు.. ప్రభుత్వ పనితీరుపై ఏం చెప్పను
  • ప్రజలు అన్నీ గమనిస్తున్నారు... ప్రజాతీర్పుకే వదిలేస్తున్నా
  • ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో తమిళిసై వ్యాఖ్యలు


తెలంగాణలో ఏం జరుగుతోందో మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. స్నేహపూర్వకంగా ఉండే నేను ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తున్నాను. నేను ఏ మాత్రం వివాదాస్పద వ్యక్తిని కాదు. ఇది అలా చేయాలి అని నా అధికారాలను ప్రయోగించడం లేదు. నేను మహిళా గవర్నర్‌ను, నా విధులు పారదర్శకంగా ఉన్నాయి. ఈ విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు. నేను ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వంతో ఎప్పుడూ మంచి సంబంధాలు ఉండాలని కోరుకున్నాను. గవర్నర్‌ పర్యటనకు కలెక్టర్‌, ఎస్పీని రావద్దని చెబుతారా? ఇలా చేయాలని ఏమైనా నిబంధన ఉందా?.

                                                                                            - గవర్నర్‌ తమిళిసై


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై పంచాయితీ ఢిల్లీకి చేరింది. తనకు జరుగుతున్న అవమానాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని మోదీకి గవర్నర్‌ తమిళిసై ఫిర్యాదు చేశారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం ముందు అసెంబ్లీలో తనను ప్రసంగం చేయనివ్వలేదని, రాష్ట్రంలో పర్యటించే సమయంలో ప్రొటోకాల్‌ను పాటించడం లేదని వివరించినట్లు తెలిసింది. ముఖ్యంగా రాజ్‌భవన్‌ నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులే కాకుండా ఉన్నతాధికారులు కూడా హాజరుకావడం లేదని, అధికారులు రాకుండా ప్రభుత్వ పెద్దలే నిరోధిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బుధవారం పార్లమెంట్‌ భవనంలో ప్రధాని మోదీతో గవర్నర్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వ్యవహారంపై నివేదిక అందించారు. ప్రధానితో భేటీ తర్వాత తమిళిసై విలేకరులతో మాట్లాడారు. చట్టప్రకారం, రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటున్న తనను తెలంగాణ ప్రభుత్వం అవమానించడం సరికాదన్నారు. తనకున్న అధికారాలను ప్రయోగించి చర్యలు తీసుకొని సమస్య సృష్టించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌, సీఎం కేసీఆర్‌ మధ్య నడుస్తున్న వివాదాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘‘ప్రధాని దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. తెలంగాణలో ఏం జరుగుతోందో మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. స్నేహపూర్వకంగా ఉండే నేను ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తున్నాను. నేను ఏ మాత్రం వివాదాస్పద వ్యక్తిని కాదు’’ అని తమిళిసై బదులిచ్చారు. 



గవర్నర్‌ కార్యాలయాన్ని గౌరవించండి

ప్రభుత్వం నుంచి ఏ అప్పీలు వచ్చినా యథాతథంగా ఆమోదించాలని కాదని, రాజ్యాంగ అధిపతిగా తనకూ ఓ అభిప్రాయం ఉంటుందని తమిళిసై తేల్చిచెప్పారు. వ్యవస్థ, చట్టప్రకారం నడుచుకుంటానని, దాన్ని అనుసరిస్తూ పనిచేస్తున్నప్పుడు వేరేరకంగా భావించి గవర్నర్‌ను ప్రభుత్వం అవమానించడం సరికాదని సూచించారు. దాని గురించి తాను పెద్దగా పట్టించుకోబోనన్నారు. ‘‘తమిళిసైని కాదు గవర్నర్‌ కార్యాలయాన్ని గౌరవించండి. ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ, దేశ ప్రజలకే వదిలేస్తున్నా. గవర్నర్‌ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అది ఇలా చేయాలి... ఇది అలా చేయాలని నా అధికారాలను ప్రయోగించడం లేదు. నేను మహిళా గవర్నర్‌ను, నా విధులు పారదర్శకంగా ఉన్నాయి. ఈ విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు.’’ అని తమిళిసై వ్యాఖ్యానించారు. 


ఆ నియామకంపై ఒత్తిడి తీసుకురాలేరు

తాను ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, ప్రభుత్వంతో ఎప్పుడూ మంచి సంబంధాలు ఉండాలని కోరుకున్నానని స్పష్టం చేశారు. గవర్నర్‌ పట్ల ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నదని విలేకరులు ప్రశ్నించగా... అది ప్రభుత్వాన్ని అడగాలని, తనను కాదని స్పష్టం చేశారు. గవర్నర్‌ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయని ప్రస్తావించగా... ‘‘నేను రాజకీయం చేసిన ఒక సంఘటన ఒకటి చెప్పండి’’ అని అన్నారు. గవర్నర్‌ కోటాలో కౌశిక్‌ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించడాన్ని అడ్డుకున్న అంశంపై స్పందిస్తూ... గవర్నర్‌ కోటాలో నియామకం మీద తనపై ఒత్తిడి తీసుకురాలేరని, అదేమి ప్రధాన మంత్రి కోటా కాదని, అది గవర్నర్‌ కోటాలో సామాజిక సేవా విభాగంలో కాబట్టి అభ్యర్థిత్వంపై తాను సంతృప్తి చెందకపోతే ఆ విషయాన్ని చెప్పే హక్కు తనకుందని తేల్చిచెప్పారు. శాసన మండలిలో ప్రొటెం చైర్మన్‌కు సంబంధించిన విషయంలోనూ తాను రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావించానని, దానిని ఆమోదించాలి లేదా చర్చించాలని సూచించారు. చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘‘నేను ఏదైనా నిర్ణయాన్ని ఆమోదించకపోతే గవర్నర్‌ కార్యాలయాన్ని అవమానిస్తారా..? గవర్నర్‌ ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తారా? తాను ఎక్కడైనా పర్యటిస్తే కలెక్టర్‌, ఎస్పీని రావద్దని చెబుతారా? ఇలా చేయాలని ఏమైనా నిబంధన ఉందా?’’ అని నిలదీశారు. 


ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘ఇలా చేయాలని నేను ఆదేశించగలను కానీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. గవర్నర్ల పర్యటనలో ప్రొటోకాల్‌ ఎలా పాటించాలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అధికారులకు తెలుసు. కానీ ఈ విషయాలను నేను పట్టించుకోవడం లేదు. నేను గవర్నర్‌ వ్యవస్థ పట్ల ఆందోళన చెందుతున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కావవద్దని భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏ చర్య తీసుకోబోతున్నారని విలేకరులు ప్రశ్నించగా తనకు రాజ్యాంగపరమైన అధికారాలున్నప్పటికీ వాటిని ప్రయోగించాలనుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పనితీరుపై నివేదికలే తనకు ఇవ్వడం లేదని, కనీసం గవర్నర్‌ ప్రసంగం కూడా చేయనివ్వలేదని, అలాంటప్పుడు ప్రభుత్వ పనితీరుపై ఏం చెప్పాలని తమిళిసై అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని తొలి నుంచీ తాను విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. వరంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కొరకడం వల్ల వ్యక్తి మరణించడంపై తాను బాధపడ్డానని చెప్పారు. ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డంపెట్టుకొని కేంద్రం రాజకీయం చేస్తోందన్న విమర్శలున్నాయి కదా.. అని మీడియా ప్రస్తావించగా.. ‘‘తెలంగాణలో అలాంటి ఒక ఘటన చెబితే సమాధానం ఇస్తాను. ఉగాది ఉత్సవాలకు అందరినీ ఆహ్వానించాను. కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నామని కొంత మంది ఫోన్‌ చేసి చెప్పారు. కొందరికి ఆ బాధ్యత కూడా లేదు. ఈ రకంగా అవమానించడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో తన పర్యటన గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు తమిళిసై తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా గవర్నర్‌ తమిళిసై కలిశారు. గురువారం ఆమె హోం మంత్రి అమిత్‌షాను కూడా కలిసే అవకాశముంది.


గవర్నర్‌కు కేకే అభివాదం

గవర్నర్‌ తమిళిసైకి టీఆర్‌ఎస్‌ ఎంపీ కే కేశవ రావు అభివాదం చేశారు. బుధవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలవడానికి పార్లమెంటుకు తమిళిసై వచ్చారు. ఆ సమయంలో అమిత్‌ షా అందుబాటులో లేరు. ఈ సమయంలో పార్లమెంటులో తారసపడిన గవర్నర్‌కు కేకే అభివాదం చేసి కొద్ది సేపు ముచ్చటించారు. అప్పుడే రాజ్యసభ నుంచి బయటికి వచ్చిన తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీలు తిరుచ్చి శివ, టీకేఎస్‌ ఇళంగోవన్‌ తదితరులు గవర్నర్‌ను కలుసుకొని ఫొటోలు తీసుకున్నారు.

Updated Date - 2022-04-07T07:47:23+05:30 IST