షేమ్‌!షేమ్‌!!

ABN , First Publish Date - 2021-05-09T06:51:59+05:30 IST

ఈ దృశ్యాలు చూస్తే కడుపు భగ్గున రగిలిపోతుంది. కరోనా మృత్యు దాడికి ప్రజలెంత భీతావహం చెందారో ఈ చిత్రాలు చెబుతున్నాయి. వైద్యానికి హామీ ఇవ్వలేని పాలకుల వైఫల్యాలకు సాక్ష్యం ఇవి. వాక్సిన్‌ వేసుకుని అయినా బతికిపోదామన్న జనం తాపత్రయం ఇది.

షేమ్‌!షేమ్‌!!
స్విమ్స్‌ వద్ద బారులు తీరిన ప్రజలు

ఈ దృశ్యాలు చూస్తే కడుపు భగ్గున రగిలిపోతుంది. కరోనా మృత్యు దాడికి ప్రజలెంత భీతావహం చెందారో ఈ చిత్రాలు చెబుతున్నాయి. వైద్యానికి హామీ ఇవ్వలేని పాలకుల వైఫల్యాలకు సాక్ష్యం ఇవి. వాక్సిన్‌ వేసుకుని అయినా బతికిపోదామన్న జనం తాపత్రయం ఇది. ఆసుపత్రుల్లో బెడ్‌ దొరకదు, ఆక్సిజన్‌ అందదు, ఆరోగ్యశ్రీ అన్నిచోట్లా వర్తించదు. మందుల కోసం నల్లబజారులో వెతుకులాడాలి. ఏమి దుస్థితి ఇది? ఎవరు చేసిన నేరానికి ఎవరు బలవుతున్నారు? తొలి డోస్‌ వాక్సిన్‌కి దిక్కులేదు. రెండో డోస్‌ వేసుకోవాల్సిన సమయం మించిపోతోంది. తక్షణం రెండులక్షల మందికి వాక్సిన్‌ రెండో డోస్‌ అవసరం అయితే, 26వేలు మాత్రమే ఇచ్చి సరిపెట్టిన తీరును జనం ఛీ కొడుతున్నారు. నాయకులు మాత్రం సమీక్షలపేరుతో ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. 


చిత్తూరు, మే 8 (ఆంధ్రజ్యోతి):  శనివారం జిల్లా వ్యాప్తంగా 127 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో రెండో డోసు లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ వేశారు. అవసరమున్న మేరకు జిల్లాకు వ్యాక్సిన్‌లు రాకపోవడంతో ప్రతి కేంద్రం వద్ద నుంచీ వందల మంది నిరాశతో వెనుతిరిగారు. రాష్ట్రవ్యాప్తంగా 15వ తేదీ వరకు తొలి డోసు వేసే పరిస్థితి లేదని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ తేల్చి చెప్పేసింది. జిల్లాలో సుమారు 4 లక్షల మంది రెండో డోసు వ్యాక్సిన్‌ వేసుకోవాల్సి ఉంది. కొవిషీల్డ్‌ రెండో డోసును 3.33 లక్షల మంది వేసుకోవాల్సి ఉండగా.. వీరిలో సగం మందికి గడువు పూర్తయింది. అంటే 1.65 లక్షల మందికి వెంటనే రెండో డోసు కొవిషీల్డ్‌ వేయాలి. అలాగే 63 వేల మంది రెండో డోసు కొవాగ్జిన్‌ వేసుకోవాల్సి ఉండగా.. వీరందరి గడువు పూర్తయి చాలా కాలం అయింది. ఈ కారణంగా రెండో డోసు వేసుకోవాల్సిన లబ్ధిదారులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జిల్లాకు 20 వేల కొవిషీల్డ్‌, 6 వేల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయి. వీటిని జిల్లాలోని 127 వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు పంపిణీ చేశారు. మారుమూల మండలాలకు వంద, పట్టణాలకు అవసరాన్ని బట్టి 200 నుంచి 500 వరకు పంపిణీ చేశారు. శనివారం జిల్లాలోని ఆయా కేంద్రాల్లో రెండో డోసు వేసుకోవాల్సిన వారికే వ్యాక్సిన్‌ ఇచ్చారు. కొవాగ్జిన్‌ తక్కువ డోసులు రావడంతో ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో మాత్రమే అందించారు. చాలా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే డోసులు స్టాక్‌ అయిపోవడంతో వేల మంది లబ్ధిదారులు వెనుతిరిగారు. కొవాగ్జిన్‌ అయితే గంటలోగా పూర్తయిపోయింది. సుమారు 2.30 లక్షల మంది వెంటనే రెండో డోసు వేసుకోవాల్సి ఉండగా.. శనివారం 26 వేల మందికే వ్యాక్సిన్‌ వేయడంతో ఇంకా 2 లక్షలకుపైగా లబ్ధిదారులు నిరాశలో ఉన్నారు.








Updated Date - 2021-05-09T06:51:59+05:30 IST