సిగ్గు సిగ్గు ఈ ‘సెటిల్మెంట్లు’!

ABN , First Publish Date - 2021-11-27T07:57:18+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో చట్టాలను నిష్పాక్షికంగా అమలు చేస్తున్నారా? వీరశేఖర్ ఉదంతాన్నే చూడండి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలంలోని రామోజీపేట వాసి అయిన లంబాడా గిరిజన యువకుడు వీరశేఖర్...

సిగ్గు సిగ్గు ఈ ‘సెటిల్మెంట్లు’!

తెలంగాణ రాష్ట్రంలో చట్టాలను నిష్పాక్షికంగా అమలు చేస్తున్నారా? వీరశేఖర్ ఉదంతాన్నే చూడండి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలంలోని రామోజీపేట వాసి అయిన లంబాడా గిరిజన యువకుడు వీరశేఖర్. కళాశాల విద్యార్థి. చదువుకుంటూ ఇంటి వద్ద వ్యవసాయ పనులు కూడా చేసే ఈ యువకుడు ఇటీవల పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురయ్యాడు. ఈ నెల 10వ తేదీన ఉదయం పది గంటలకు కారణం చెప్పకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆత్మకూర్ పొలీసులు వీరశేఖర్‌ను తీసుకెళ్ళారు. అదేరోజు రాత్రి ఠాణాలోనే ఎనిమిదిన్నరకి మొదలు పెట్టి మూడు గంటల పాటు శేఖర్‌ను చిత్రహింసలకు గురి చేశారు. కర్రలతో, బెల్టులతో అరిచేతులు, పాదాలు, పిరుదులపై వాపులు వచ్చేలాగా కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేక బట్టల్లో మూత్రం పోసుకుంటే మూత్రాన్ని నోటితో నాకించారు. పైకి దెబ్బలు కనిపించకుండా గంటకు పైగా గోడ కుర్చీలో ఉంచారు. కాళ్ళను, చేతులను పట్టుకుని నలుగురు నాలుగు వైపులా లాగారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరశేఖర్‌ని చావు అంచుల వరకూ తీసుకెళ్ళారు. స్పృహ కోల్పోయిన వీరశేఖర్ స్టేషన్‌లో చనిపోతే బాగుండదని భావించారు కాబోలు రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి తీసుకువెళ్లండని అతడి కుటుంబానికి చెప్పారు. పోలీసుల దురాగతంపై గ్రామస్థులు ధర్నా చేశారు. దీంతో వీరశేఖర్ ఉదంతంపై మీడియాలో వచ్చిన వార్తలు పెద్ద సంచలనం సృష్టించాయి. ప్రజాసంఘాలు, మొత్తం సమాజం ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. బాధిత కుటుంబానికి అంతటా సానుభూతీ, మద్దతూ వ్యక్తమయ్యాయి. పోలీసులు ఆరోపించినట్టు దొంగతనంలో వీరశేఖర్ పాత్ర లేదు. ఉన్నా కూడా పోలీసులు ఇలా చిత్రహింసల పాలు చేయటం అనాగరికమనీ, ఈ నేపథ్యంలో ఆ యువకుడికి చట్టం ప్రకారం న్యాయం జరుగుతుందనీ, పోలీసులపై కేసు పెట్టడంతో వాళ్లు అరెస్టయి ఉంటారని ఎవరైనా అనుకోవడం కద్దు. ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో అయితే చాలా వరకు అలాగే జరుగుతుంది గానీ మనదేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి వేరు. కాబట్టి చాలా మామూలుగానే ఈ కేసులో ఈ రోజు వరకూ నిందిత పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కోర్టులూ, విచారణా అంటే పోలీసులకూ, పరిపాలకులకూ చికాకు కాబట్టి బాధిత వీరశేఖర్‌ నుంచి గానీ అతని కుటుంబ సభ్యుల నుంచి గానీ ఒక్క లిఖితపూర్వక ఫిర్యాదయినా పోలీసు శాఖకు చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తద్వారా, ‘ఫలానా పోలీసులు తన పట్ల నేరపూరితంగా వ్యవహరించారని ఏ బాధితుడూ మాకు ఫిర్యాదే చేయనప్పుడు ఇంకా ఏం కేసు ఉంటుందని’ ఎదురు ప్రశ్నించడానికి అవసరమైన ఏర్పాటు చేసుకున్నారు. ‘కాంప్రమైజ్’ పేరుతో పిలిచే ఈ ‘సెటిల్మెంటు’ ఘనకార్యాన్ని అధికారపార్టీ యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులూ, ఒక మంత్రీ స్వయంగా పర్యవేక్షించారు. ఇదీ మన ప్రజాస్వామ్యం! కాబట్టి, ఇంత ఒత్తిడిని తట్టుకుంటూ, ఇన్ని శక్తులతో తలపడలేమనుకున్న వీరశేఖర్ కుటుంబం సహజంగానే, అతనికి చికిత్స చేయించుకుని, ఇంటికి వెళ్ళిపోయింది. 


పోలీసుల ప్రవర్తన ఇలా ఉండడం అరుదా? ఒక్క వీరశేఖర్ విషయంలోనే పోలీసులపై కేసు నమోదు కాకపోయి ఉంటే అరుదుగా ఇలా జరగవచ్చేమోననుకుంటాం. కానీ అంతటా ఇలాగే జరుగుతోంది! సంబు కొమురయ్య ఉదంతమే ఇందుకొక నిదర్శనం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామ నివాసి కొమురయ్య. 45 ఏళ్ల ఈ పశుపాలకుడిని 2020 సెప్టెంబర్ 10న ఇంటి నుంచి పోలీసులు పట్టుకెళ్ళారు. ఏమిటి అతని నేరం? అంతకు ముందురాత్రి రోడ్డు పక్కన ఉన్న చిన్న చికెన్ సెంటర్లో చికెన్ కొట్టే చెక్క మొద్దూ, రెండు ప్లాస్టిక్ కుర్చీలూ దొంగిలించాడట! ఠాణాకి వెళ్ళినంక ఏం జరిగిందో బయటకి తెలియలేదు. కొమురయ్యను అదే రోజు సాయంత్రం నడవలేని స్థితిలో కోర్టు ద్వారా రిమాండ్‌కు పంపారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ప్రవేశించిన కొమురయ్య మూడవ రోజు జైల్లోనే మరణించాడు. నాలుగు రోజుల అనంతరం హక్కుల కార్యకర్తలుగా మేము మృతుడి ఇంటికి వెళ్ళాం. ఆయన భార్యా, బంధువులూ మాకు ఏ సమాచారమూ ఇవ్వలేమన్నారు. శంకరపట్నం పొలీసులు మూడు లక్షల రూపాయలు, ‘విధిరాత’ సహాయంతో రిమాండు ఖైదీ మృతిని కూడా కోర్టు, దర్యాప్తుల దాకా వెళ్లకుండా ఆపగలిగారు.


మరింత సంచలనమైన కేసు మరియమ్మది. అడ్డగూడుర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఏడాది జూన్ 18న ఆమె లాకప్ హత్యకు గురయ్యారు. జూన్ 25నే హైకోర్టు ఈ ఘటనను జుడీషియల్ మెజిస్ట్రేట్‌తో దర్యాఫ్తు చేయించాలని ఆదేశించింది. అదే రోజు మరియమ్మ ఉదంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా, మరో కొన్ని వారాల తర్వాత గానీ ఆ కేసులో ఎఫ్ఐఆరే నమోదు కాలేదు. ‘దళితబంధు’కు దళిత మహిళ హత్య కేసు అడ్డు రాకూడదని కేసీఆర్ అన్నారు. అదే పోలీసుల చిత్రహింసల కారణంగా పక్క బొర్లే స్థితిలో కూడా లేని మృతురాలి కొడుకు ఉదయ్ కుమార్‌కి ఆయన ‘దయగల మారాజు’ లాగా ఒక ఉద్యోగ హామీ, పదిహేను లక్షల రూపాయల చెక్ పంపించారు. ఇప్పుడంటే చేశారు గానీ మరోసారి ఇలా జరుగకుండా చూసుకోండని మాత్రం పోలీసులను ప్రేమగా ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇంతకంటే వేరే ఏం న్యాయం ఉండదు కాబట్టి, ఇక అందరూ ఈ విషయాన్ని మర్చిపోవాలన్నట్లు కేసును ‘సెటిల్’ చేయ చూశారాయన. కొద్దిరోజుల క్రితం మరియమ్మ హంతకులపై ఏం చర్యలు తీసుకున్నారన్న హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నకు ప్రభుత్వ వకీలైన అడ్వకేట్ జనరల్ సమాధానం ఏమిటంటే ‘మరియమ్మ కుటుంబానికి నష్టపరిహారం అందింది’ అని. ఇదీ మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం!


ఈ ఘటనలన్నీ కేవలం ఒక సంవత్సరంన్నర వ్యవధిలో సంభవించాయి. బాగా సంచలనం సృష్టించిన కేసులవి. సంచలనం కాకుండా, బయటకు కూడా రాని లాకప్ హింసలు, హత్యలు లెక్కకు మించి ఉంటాయి. ఇవన్నీ పోలీసుల అనాగరికపు నేర విచారణ పద్ధతుల ఫలితాలు. ఇలా విచారిస్తే తప్ప నేరం ఒప్పుకోరని వారి నమ్మకం. ఈ విషయంలో సమాజంలో కొంతమంది మద్దతు కూడా పోలీసులకు ఉంది. అయితే ఈ మాత్రం తెలివికి ఐపీఎస్‌లు, ఇతర పోలీస్‌ అధికారులు రాజ్యాంగం, చట్టాలు వంటివి చదవడం ఎందుకు? ఏ రౌడీ గ్యాంగులీడర్ దగ్గరో కొంతకాలం శిక్షణ తీసుకుంటే సరిపోతుంది కదా. కొన్నిసార్లు అలా కొట్టడం వల్ల పోలీసులకు శ్రమ లేకుండా ఫలితాలు రావచ్చు. నేర విచారణలో భాగంగా నిందితులపై చేయి చేసుకునే అధికారాన్ని పోలీసులకు ఏ చట్టమూ ఇవ్వలేదు. అయినా తర్కం కోసం ‘కొట్టక తప్పదు’ అనే వాదాన్ని ఒప్పుకున్నా అందుకోసం ఎంతమంది అనుమానితుల్ని కొట్టవచ్చు? ఆ క్రమంలో ఎంతమంది చనిపోయినా పరవాలేదా? దానికేమైనా కొలమానం ఉందా? మరి ఇదే మరియమ్మ, వీరశేఖర్ కేసుల్లో నిందితులైన పోలీసులను ఇలాగే హింసించి నేరం ఒప్పిస్తారా? అన్ని వర్గాలకూ ఏ వివక్ష లేకుండా ఈ విధానం పాటిస్తున్నారా? సిగ్గుపడాలి. చట్టాలు చెబుతున్నదేమిటి, చట్టాలను అమలు చేయాల్సిన వ్యవస్థ చేస్తున్నదేమిటి? 


ఇక, పౌర పరిపాలనలో గల ఉన్నతాధికారులు, శాసన శాఖ (ఎమ్మెల్యేలు, మంత్రులు) అందరూ ఇటువంటి అనేక నేరాలను చూస్తూ కూడా ఈ విషయాలేవీ తమ దృష్టికి రానట్టే ప్రవర్తిస్తున్నారు. కలెక్టర్లూ, ఆర్డీవోలూ, తహశీల్దార్లూ చట్టం ప్రకారం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌లు. వారికి సీఆర్ పీసీ సెక్షన్ 44 విస్తృతమైన అధికారాలను ఇచ్చింది. తమ పరిధిలో ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినట్లు వారికి అనుమానం వచ్చినా, సమాచారం ఉన్నా నేరస్థుడిని వాళ్లే అరెస్టు చేయవచ్చు, లేదా అరెస్టు చేయమని పోలీసులను ఆదేశించవచ్చు.


కానీ, అన్ని అధికారాలూ ఉండి, ఇంత చిన్న నేరాల్లో కూడా కనీసం ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయించలేకపోతున్నారు. పబ్లిక్ సర్వెంట్స్ ఆయిన వారు చట్టం ప్రకారం నడుచుకోకపోతే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 166 ప్రకారం నేరస్థులే అవుతారు. ఈ అధికార, శాసన గణమంతా కూడా తమ సిబ్బంది ఇలా లాకప్ హత్యలూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలూ చేస్తూ ఉంటే చూడటమే కాదు, చాలాసార్లు పరోక్షంగా సహకరిస్తున్నారు. 


ఒక తండ్రిని అతని కుమారుడో, ఒక భర్తను ఆయన భార్యో చంపినట్లు అనుమానం వస్తే ఎవరు ఫిర్యాదు చేయకపోయినా పొలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు నడిపిస్తారు. సీఆర్ పీసీ 154, 157 సెక్షన్లు పోలీసులకు ఆ అధికారం ఇచ్చాయి. ఇక్కడ మరియమ్మ కేసులో అంతా చివాట్లు పెట్టేదాకా, ఆత్మకూరు కేసులో ఈ రోజువరకూ ఎందుకు ఆ అధికారాన్ని వాడలేదు. బాధితులు నిందితులకు భయపడో, పరిస్థితులకు లొంగిపోయో ఫిర్యాదు చేయడానికీ, సాక్ష్యం చెప్పడానికీ ముందుకు రాకపోతే కూడా ఇతర కేసుల్లో అక్కడ నేరం జరగనట్టు వదిలివేయకుండా కొంత ప్రక్రియ అయినా నడిపిస్తారు కదా. 


పోలీసులు మాత్రం ఎన్ని కస్టడీ హింసలూ, హత్యలు చేసినా వాటిని బయట ‘సెటిల్’ చేసుకుంటే ఇక ఏ కేసూ ఉండదా? ఇలా పోలీసులు, డబ్బు, అధికారం, కులంతో బలిసిన వాళ్ళు బలహీనుల పట్ల ఎన్ని ఘోరాలకైనా పాల్పడి సాక్షులను బెదిరించి కేసూ, విచారణా లేకుండా చేసుకుంటుంటే ఇన్నేళ్లలో రాజ్యాంగంలో రాసుకున్న సమానత్వపు హక్కుకు ఏం అర్థం సాధించినట్టు? చట్టబద్ధంగా మసులుకోవటం అనేది ఇతరులకే గానీ తమకు వర్తించదని పోలీసు వ్యవస్థ అనుకుంటున్నది. ‘మాకు ఏజెంట్లుగా పని చేస్తే చాలు మీరేం చేసినా మిమ్మల్ని మేం కాపాడుకుంటామ’ని ముఖ్యమంత్రీ, మంత్రులు పోలీసులకు భరోసా కల్పిస్తున్నారు. అది, ఎప్పుడైనా కోర్టు మాత్రమే కల్పించుకునే అంశం కాదు. నాగరీకులమనుకునే ప్రజలు ఈ సంస్కృతికి అలవాటుపడడం కాకుండా దానిపై తమ వైఖరిని సమీక్షించుకోవాలి. పౌర హక్కుల పరిరక్షణకు పూనుకోవాలి.

డాక్టర్ ఎస్. తిరుపతయ్య

మానవహక్కుల వేదిక

Updated Date - 2021-11-27T07:57:18+05:30 IST