సింహగిరిపై నిరాడంబరంగా శమీపూజ

ABN , First Publish Date - 2021-10-17T06:24:21+05:30 IST

చెడుపై మంచి విజయం సాధించడానికి గురుతుగా విజయదశమి పర్వదినాన సింహగిరిపై శమీపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

సింహగిరిపై నిరాడంబరంగా శమీపూజ
శ్రీరాముడిగా అప్పన్న స్వామి

వర్షం కారణంగా అప్పన్న పూదోటలో కాకుండా నృసింహ మండపంలో నిర్వహణ

సింహాచలం, అక్టోబర్‌ 16: చెడుపై మంచి విజయం సాధించడానికి గురుతుగా విజయదశమి పర్వదినాన సింహగిరిపై శమీపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వర్షం కారణంగా కొండదిగువ స్వామివారి పూదోటలో వైభవంగా నిర్వహించాల్సిన ఉత్సవాన్ని పరిమిత సంఖ్యతో కూడిన భక్తుల మధ్య సింహగిరిపై రాజగోపురానికి చేరువలోని నృసింహ మండపంలో నిరాడం బరంగా జరిపారు. సింహాద్రి అప్పన్నస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి శుక్రవారం సాయంత్రం ఒకచేతిలో విల్లంబు, మరో చేతిలో శరం ధరించి దుష్ట సంహారానికి వెళ్లిన శ్రీరాముడిగా దర్శన మిచ్చారు. ఇందులో భాగంగా స్వామిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రభాతసేవలను యథావిధిగా జరిపారు. అనంతరం ఈవో ఎంవీ సూర్యకళ, ఏఈవో కేకే రాఘవకుమార్‌, స్థానాచార్యులు డాక్టర్‌ టీపీ రాజగోపాల్‌ ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఆస్థాన మండపంలోని వేదికపై స్వామి వారిని అధిష్టింపజేశారు. ఇన్‌చార్జి ప్రధానార్చకుడు ఐవీ రమణాచార్యులు, పురోహితుడు కరి సీతారామాచార్యులు శమీపూజకు శ్రీకారం  చుట్టి నృసింహ మండపం ఈశాన్యభాగంలోని శమీ (జమ్మిచెట్టు) వృక్షానికి జలాలతో ప్రోక్షణ గావించారు. అర్చకులు శమీవృక్షానికి పూజలు జరిపి జమ్మివేటను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకులు, ట్రస్టీలు, భక్తులు ముమ్మార్లు శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు జరిపి శమీ పత్రాలను శిరస్సున దాల్చారు. జమ్మివేట దృష్ట్యా అప్పన్న పూదోట పరిసరాలను విద్యుద్దీపాలతో అందంగా శోభాయమానంగా అలంకరించారు. అయితే వర్షం వల్ల ఈ ఉత్సవాన్ని సింహగిరిపై నిర్వహిస్తున్నట్టు తెలియక పలువురు భక్తులు పూదోటకు వచ్చి నిరాశగా వెనుదిరిగారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారి కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ట్రస్టీలు దినేశ్‌రాజ్‌, సూరిశెట్టి సూరిబాబు, కేవీ నాగేశ్వరరావు, వి.పార్వతీదేవి, సిరిపురపు ఆశాకుమారి, ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, మాణిక్యాలరావు, ఎస్‌ఎన్‌ రత్నం, ఈఈలు, తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-17T06:24:21+05:30 IST