స్వాతి
వేధింపులు భరించ‘లేఖ’
శనగపాడు పంచాయతీ కార్యదర్శి స్వాతి సూసైడ్ నోట్
మాజీ కార్యదర్శి, ఎమ్మెల్యే అనుచరుడి వేధింపుల వల్లే..
ఎమ్మెల్యే ఉదయభానుకు నేరుగా లేఖ
గొట్టుముక్కలలోని ఇంట్లోనే ఉన్న స్వాతి
వేధింపులపై పోలీసుల విచారణ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/పెనుగంచిప్రోలు): రాజకీయ ఒత్తిళ్లు అధికారులను పనిచేయలేని పరిస్థితికి తెస్తున్నాయి. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు పంచాయతీ కార్యదర్శి స్వాతి సూసైడ్ నోట్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆమె స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకే ఈ లేఖ రాయటం కలకలం రేపింది. ఈ ఘటనతో జిల్లాలో పంచాయతీల పాలన ఎంత చెత్తగా నడుస్తుందో, రాజకీయ ఒత్తిళ్లు అధికారులను ఎలా ఇబ్బంది పెడుతున్నాయో తెలుస్తోంది.
పెనుగంచిప్రోలు మండలం శనగపాడు పంచాయతీ కార్యదర్శి పట్టెం స్వాతి తన సూసైడ్ నోట్లో ప్రధానంగా ముగ్గురిపై ఆరోపణలు చేశారు. పెనుగంచిప్రోలు మండల ఎంపీడీవో రాజు, శనగపాడు గ్రామ సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ, పదవీ విరమణ చెందిన కార్యదర్శి ఎంవై దాసులు తాను ఆత్మహత్య చేసుకోవటానికి ప్రధాన కారణమని ఆరోపించారు. ఈ ఆరోపణలను నిశితంగా గమనిస్తే రాజకీయ కోణాలు బయట పడుతున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పదవీ విరమణ చేసిన మాజీ కార్యదర్శి ఎంవై దాసు స్థానిక శాసనసభ్యుడి పంచన చేరారు. ఆయన అనుచరుడిగా ఉన్నారు. గ్రామ సచివాలయాల సిబ్బంది, కార్యదర్శులు, ఆఖరుకు ఎంపీడీవోపై కూడా ఆయన అధికారం చెలాయిస్తున్నట్టుగా చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. కార్యదర్శులు మాట వినకుంటే బదిలీలంటూ బెదిరిస్తుండటంతో సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు ఆయన దారిలోకి వచ్చారని తెలుస్తోంది. ఇలా మండల పరిధిలో మాజీ కార్యదర్శి తన కోటరీని ఏర్పాటు చేసుకోవటం, మాట వినని వారిపై బెదిరింపులకు పాల్పడటం వంటివి నిత్యకృత్యమే. ఈయన బాధితుల్లో స్వాతి కూడా ఒకరని సమాచారం.
ఆమె సంతకం లేకుండానే..
గ్రామ సచివాలయాలకు కార్యదర్శులే అధిపతులు. అయితే, శనగపాడు గ్రామ సచివాలయ సిబ్బంది తమ కార్యదర్శి స్వాతికి తెలియకుండా ఫైళ్లపై సంతకాలు చేసేసుకుంటున్నారు. కాగా, తన కింద పనిచేసే సిబ్బంది తనతో సంబంధం లేకుండా ఎవరో ఆదేశాల మేరకు పనిచేయటం, నడుచుకోవటం స్వాతి ఇష్ట పడలేదు. దీంతో తన మాట వినని సిబ్బందిని బదిలీ చేయాల్సిందిగా ఎంపీడీవో దగ్గర పట్టుబట్టారు. ఆయన ససేమిరా అన్నారు. దీంతో స్వాతి సూసైడ్ లెటర్‌ను అస్త్రంగా ప్రయోగించారు. గతంలో స్వాతి ఒకమారు నేరుగా ఎమ్మెల్యేకే తన మొర వినిపించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడం వల్ల ఆయనకే సూసైడ్ నోట్ రాయటం కలకలాన్ని సృష్టించింది. సూసైడ్ నోట్ రాశాక ఆమె విధులకు హాజరుకాకపోవడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
రంగంలోకి ఎమ్మెల్యే అనుచరుడు
స్వాతి సూసైడ్ అస్త్రంతో ఎమ్మెల్యే అనుచరుడు, మాజీ కార్యదర్శి రంగంలోకి దిగాడు. సూసైడ్ నోట్‌కు తాను ఎక్కడ బాధ్యత వహించాల్సి వస్తుందోనన్న భయంతో ఆమెను వెతుకుతున్నాడు. చివరకు ఆమె తన ఇంటి వద్దే ఉందని తెలుసుకోవటంతో కొంతమందిని తీసుకెళ్లి సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఆమెను బుజ్జగించినట్టు సమాచారం. ఎంపీడీవో తరఫున వకాల్తా తీసుకుని విధులకు హాజరు కావాల్సిందిగా కోరినట్టు తెలిసింది.