షేన్‌వార్న్‌ది సహజ మరణమే.. నిర్ధారించిన అటాప్సీ రిపోర్ట్

ABN , First Publish Date - 2022-03-07T22:05:25+05:30 IST

ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌ది సహజ మరణమేనని పోస్టుమార్టంలో వెల్లడైంది. అటాప్సీ వివరాలను పోలీసులు..

షేన్‌వార్న్‌ది సహజ మరణమే.. నిర్ధారించిన అటాప్సీ రిపోర్ట్

థాయ్‌లాండ్: ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌ది సహజ మరణమేనని పోస్టుమార్టంలో వెల్లడైంది. అటాప్సీ వివరాలను పోలీసులు షేన్‌వార్న్ కుటుంబ సభ్యులతో పంచుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఆ వివరాలతో వారు కూడా అంగీకరించినట్టు చెప్పారు. వార్న్ మరణం తర్వాత పలు కోణాల్లో జరిగిన దర్యాప్తులో ఎలాంటి అనుమానాలు వ్యక్తం కాలేదని, అటాప్సీలోనూ అతడిది సహజ మరణమేనని వెల్లడైందని వివరించారు.


వార్న్ భౌతిక కాయాన్ని ఆస్ట్రేలియాకు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు చెప్పారు. దర్యాప్తు అధికారులకు అటాప్సీ నివేదిక అందిందని, వార్న్‌ది సహజమరణమేనని అందులో పేర్కొన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 


52 సంవత్సరాల షేన్‌వార్న్ శుక్రవారం థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి విల్లాలోని గదిలో అచేతనంగా పడి ఉన్న వార్న్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వార్న్ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.


అయితే, దర్యాప్తు అధికారులు ఆయన గదిని పరీక్షించినప్పుడు నేలపైనా, టవల్స్‌పైనా రక్తం మరకలు కనిపించడంతో వార్న్ మరణంపై అనుమానాలు రేకెత్తాయి. అయితే, అచేతనంగా పడి ఉన్న వార్న్‌కు సీపీఆర్ ప్రారంభించగానే నోటి నుంచి రక్తం వచ్చినట్టు తేలింది. దీంతో వార్న్ మరణంపై అనుమానాలు తొలగిపోయాయి.  ఇప్పుడు అటాప్సీలోనూ వార్న్‌ది సహజ మరణమేనని స్పష్టం కావడంతో అనుమానాలు పటాపంచలయ్యాయి.


వార్న్‌కు ఆస్తమాతోపాటు గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు చెప్పినట్టు కూడా తెలిసింది. గుండెలో కొంచెం నొప్పిగా ఉందని, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని తనతోపాటు థాయ్‌లాండ్ వచ్చిన స్నేహితులకు వార్న్ చెప్పినట్టు ఓ స్పోర్ట్స్‌న్యూస్ వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. ఈ సందర్భంగా వార్న్ ఓ వైద్యుడిని కలిసి పరీక్షలు కూడా చేయించుకున్నట్టు పేర్కొంది.   

Updated Date - 2022-03-07T22:05:25+05:30 IST