Shankar Jival: చవితి వేడుకలకు భారీ భద్రత

ABN , First Publish Date - 2022-08-27T14:00:21+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్ల తర్వాత వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతుండగా, ఆ మేరకు పటిష్ఠమైన

Shankar Jival: చవితి వేడుకలకు భారీ భద్రత

                           - 20 వేలమంది పోలీసులు సమాయత్తం


చెన్నై, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్ల తర్వాత వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతుండగా, ఆ మేరకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 31వ తేదీన వినాయకచవితి జరుగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రజలు, హిందూ సంస్థల నాయకులు సిద్ధమవుతున్నారు. ఆ సందర్భంగా  చెన్నైలో ఐదువేలకు పైగా భారీ సైజు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకలకుగాను చెన్నైలో 20 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. నగరంలో హిందూ మున్నని, భారత్‌ హిందూ మున్నని తదితర హిందూ సంస్థల ప్రముఖులు ఇప్పటికే భారీ సైజు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి పోలీసుల అనుమతి కోసం దరఖాస్తులు కూడా సమర్పించారు. నగరంలో ఐదువేలకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు హిందూ మున్నని నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో వినాయక చవితికి చేపట్టాల్సిన భద్రతా ఏర్పాటపై శుక్రవారం ఉదయం గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌(Greater Chennai Police Commissioner Shankar Jival) అధికారులతో, చవితి వేడుకల నిర్వాహకులైన హిందూ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూ మున్నని తరఫున మేఘనాథన్‌, తంగరాజ్‌, భారత్‌ హిందూ మున్నని తరఫున ప్రభు, ఢిల్లీబాబు, అరుణ్‌, విశ్వహిందూ పరిషత్‌ తరఫున రవిరాజ్‌, హిందూ మక్కల్‌ కట్చి తరఫున కుమరవేల్‌ తదితరులు పాల్గొన్నారు. వినాయకచవితి ఏర్పాట్లలో పాటించాల్సిన నిబంధనలు గురించి పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ ఆ ప్రతినిధులకు వివరించారు. ఈ నెల 31న నగరంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రతిష్ఠించే వినాయక విగ్రహాలను సెప్టెంబర్‌ 4న నిమజ్జనం చేయాల్సిన సముద్రతీరాల గురించి కూడా ఆయన తెలియజేశారు. నిమజ్జనం సమయంలో వేడుకల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను వివరించారు. ఘర్షణలకు తావులేకుండా వినాయక చవితి వేడుకలు నిర్వహించేందుకు పోలీసులు సహకరిస్తారని ఆయన చెప్పారు.

Updated Date - 2022-08-27T14:00:21+05:30 IST