'ఇండియన్ ఐడల్'‌లో మన 'సూపర్ సింగర్'

ABN , First Publish Date - 2020-12-02T05:42:56+05:30 IST

శాస్త్రీయం, పాశ్చాత్యం, రాక్‌, పాప్‌, జానపదం... ఏ పాటైనా షణ్ముఖప్రియ గొంతులో ఒదిగిపోతుంది. శ్రోతల్ని కట్టిపడేస్తుంది. ఇప్పుడు ఆమె గానం ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12లో సందడి చేస్తోంది...

'ఇండియన్ ఐడల్'‌లో మన 'సూపర్ సింగర్'

శాస్త్రీయం, పాశ్చాత్యం, రాక్‌, పాప్‌, జానపదం... ఏ పాటైనా షణ్ముఖప్రియ గొంతులో ఒదిగిపోతుంది. శ్రోతల్ని కట్టిపడేస్తుంది. ఇప్పుడు ఆమె గానం ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12లో సందడి చేస్తోంది. ఈ పోటీకి ఎంపికైన తొలి తెలుగమ్మాయి మాత్రమే కాదు, ఆ వేదిక మీద యూడిలింగ్‌ పాడిన  మొదటి అమ్మాయి తనే. తన గానంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్న ఆమె సంగీత ప్రస్థానం ఎలా మొదలైందంటే...


మూడేళ్ళ వయసులో అలారం గడియారం నుంచి వచ్చిన ట్యూన్‌ను ఆమె తిరిగి పాడడం విని ఆమె తండ్రి ఆశ్చర్యపోయారు. కర్ణాటక గాత్ర సంగీతంలో ఆమెకు శిక్షణ ఇప్పించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. షణ్ముఖప్రియ సంగీత ప్రయాణం అలా ప్రారంభమైంది. ఇప్పుడు ఇండియన్‌ ఐడల్‌లో పోటీ పడే అవకాశం దక్కించుకున్న తొలి అమ్మాయిగా ఆమె గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఆమె తండ్రి శ్రీనివా్‌సకుమార్‌, తల్లి రత్నమాల సంగీత అధ్యాపకులు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కొన్నాళ్ళు వారు నివాసం ఉన్నారు. అప్పుడే షణ్ముఖప్రియ ప్రతిభను వారు గుర్తించారు. శాస్త్రీయ సంగీతంలో ఉత్తమ శిక్షణ ఆమెకు ఇప్పించడానికి విశాఖపట్నానికి మకాం మార్చారు.




అయిదేళ్ళ వయసులోనే జీ టీవీ ‘సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌’ పోటీలో విజేతగా అయిన షణ్ముఖప్రియ ఆ తరువాత మాటీవీ ‘సూపర్‌ సింగర్‌’లో ఫైనలి్‌స్టగా నిలిచింది. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళ ‘లిటిల్‌ సూపర్‌స్టార్‌’ పోటీలో టైటిల్‌ గెలుచుకుంది. జీ టీవీ హిందీ ‘సరిగమప లిటిల్‌ ఛాంప్‌’లో రన్నర్‌పగా నిలిచింది. తమిళ ‘సూపర్‌ సింగర్‌ జూనియర్‌ -3’లో  ‘స్టార్‌ ఆఫ్‌ ఏపీ’గా, ఈటీవీ ‘పాడుతా తీయగా’లో రన్నర్‌పగా, మా టీవీ ‘సూపర్‌ సింగర్‌-9’  టైటిల్‌ విజేతగా... ఇలా తన ప్రతిభను అనేక వేదికల మీద ఘనంగా ఆమె చాటుకుంది. మరోవైపు హిందీలో చిన్నారుల పాత్రలకు డబ్బింగ్‌ కూడా చెప్పిందామె. ప్రఖ్యాత గాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం లాంటి ఎందరో ప్రముఖులు షణ్ముఖప్రియ గానానికి ముగ్ధులై, అభినందనలు కురిపించారు. ‘భారతదేశపు భవిష్యత్‌ రాక్‌స్టార్‌’ అంటూ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రహమాన్‌ ప్రశంసించారు. ఇప్పుడు ‘ఇండియన్‌ ఐడల్‌’ ద్వారా షణ్ముఖ ప్రియ గానం దేశ వ్యాప్తంగా సంగీతాభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. 



సోనీ టీవీ నిర్వహించే ప్రతిష్టాత్మకమైన ‘ఇండియన్‌ ఐడల్‌’ సీజన్‌-12 సెలక్షన్లకు ఆన్‌లైన్‌ ద్వారా కొన్ని వేలమంది హాజరయ్యారు. వారిలో 350ని ఎంచుకొని, పరీక్షించాక, ఎంపిక చేసిన టాప్‌-12లో షణ్ముఖ ప్రియ చోటు దక్కించుకుంది. న్యాయనిర్ణేతలను మెప్పించి... ‘గోల్డెన్‌ మైక్‌’ను తన సొంతం చేసుకొని, స్పాట్‌ సెలక్షన్‌ సాధించింది. కిందటి నెల 28న ప్రసారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆమె ఇప్పటికే తనదైన ముద్ర వేస్తోంది. ‘ఇండియన్‌ ఐడల్‌’లో యూడిలింగ్‌ పాడిన మొదటి అమ్మాయిగా ప్రేక్షక శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ‘‘పోటీలో ఉన్నాననే ఆలోచన ప్రభావం నా పాట మీద పడకుండా చూసుకుంటాను. నా పాట మీదే దృష్టి పెడతాను’’ అంటున్న పద్ధెనిమిదేళ్ళ షణ్ముఖ ప్రియ ‘ఇండియన్‌ ఐడల్‌’ టైటిల్‌ గెలిచిన తొలి తెలుగమ్మాయిగా నిలవాలనే ధ్యేయంతో పాటల పరుగు కొనసాగిస్తోంది.

- సత్యనారాయణ, పాలకొండ.


Updated Date - 2020-12-02T05:42:56+05:30 IST