BJP Vs Regional Parties: ప్రాంతీయ మిత్ర పక్షాలను బీజేపీ అంతం చేస్తోంది : శరద్ పవార్

ABN , First Publish Date - 2022-08-10T23:28:43+05:30 IST

భారతీయ జనతా పార్టీ (BJP)తో సంబంధాలను తెంచుకున్న జేడీయూ చీఫ్

BJP Vs Regional Parties: ప్రాంతీయ మిత్ర పక్షాలను బీజేపీ అంతం చేస్తోంది : శరద్ పవార్

పుణే : భారతీయ జనతా పార్టీ (BJP)తో సంబంధాలను తెంచుకున్న జేడీయూ చీఫ్ నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar)ను ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) సమర్థించారు. బీజేపీ ప్రాంతీయ మిత్ర పక్షాలను అంతం చేస్తోందని ఆరోపించారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల శివసేనలో జరిగిన తిరుగుబాటును ప్రస్తావించారు.  ఆయన మహారాష్ట్రలోని పుణేలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. 


శివసేన (Shiv Sena)ను ఏ విధంగా బలహీనపరచాలో బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో మహా వికాస్ అగాడీగా ఏర్పడి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శివసేనలో తిరుగుబాటు రావడంతో ఈ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 


బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఇటీవల మాట్లాడుతూ, రానున్న రోజుల్లో బీజేపీ వంటి సైద్ధాంతిక బలం ఉన్న పార్టీలు మాత్రమే మనుగడ సాగిస్తాయని, కుటుంబాలు నడిపే పార్టీలు అంతమవుతాయని చెప్పారు. 


ఈ నేపథ్యంలో శరద్ పవార్ బుధవారం మాట్లాడుతూ, ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదని బీజేపీ అధ్యక్షుడు నడ్డా అంటున్నారన్నారు. తమ పార్టీ మాత్రమే దేశంలో మనుగడ సాగిస్తుందని చెప్తున్నారన్నారు. బీజేపీ తన మిత్ర పక్షాలను క్రమంగా అంతం చేస్తుందనే విషయం ఈ వ్యాఖ్యల వల్ల స్పష్టమవుతోందన్నారు. ఇది నితీశ్ కుమార్ ఫిర్యాదు కూడానని తెలిపారు. 


దీనికి ఉదాహరణ అకాలీదళ్ అని తెలిపారు. అకాలీదళ్ (Akalidal) గతంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉండేదన్నారు. అయితే నేడు ఆ పార్టీ పంజాబ్‌ (Punjab)లో దాదాపు అంతమైందన్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో శివసేన, బీజేపీ చాలా సంవత్సరాలపాటు కలిసి ఉన్నాయన్నారు. నేడు విభజనను సృష్టించి, శివసేనను ఏ విధంగా బలహీనపరచగలమా? అని ఆలోచిస్తోందని చెప్పారు. అందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde), ఇతరులు సహాయపడ్డారన్నారు. 


ఇలాంటి సన్నివేశం బిహార్‌లో కనిపిస్తోందన్నారు. జేడీయూ, బీజేపీ గత శాసన సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయన్నారు. ‘‘బీజేపీకి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఎన్నికలకు ముందు ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. ఆ ప్రాంతీయ పార్టీకి తక్కువ సీట్లు వచ్చేలా చేస్తుంది. అది మహారాష్ట్ర (Maharashtra)లో కూడా జరిగింది’’ అని చెప్పారు. ఇలాంటి పరిస్థితులను బిహార్‌లో గుర్తించిన నితీశ్ కుమార్ ముందుగానే అప్రమత్తమై, బీజేపీతో సంబంధాలను తెంచుకున్నారన్నారు. నితీశ్‌ను ఎందరు బీజేపీ నేతలు విమర్శించినప్పటికీ, ఆయన తెలివైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బీజేపీ తీసుకురాబోతున్న సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి, సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆయన తన పార్టీ, బిహార్ (Bihar) కోసం మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. 


Updated Date - 2022-08-10T23:28:43+05:30 IST