Rajya Sabha poll Results : బీజేపీ గెలుపు నాకు షాక్ ఇవ్వలేదు : శరద్ పవర్

ABN , First Publish Date - 2022-06-11T17:54:47+05:30 IST

మహారాష్ట్ర నుంచి రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ

Rajya Sabha poll Results : బీజేపీ గెలుపు నాకు షాక్ ఇవ్వలేదు : శరద్ పవర్

ముంబై : మహారాష్ట్ర నుంచి రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం తనకు దిగ్భ్రాంతి కలిగించలేదని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (NCP Chief Sharad Pawar) చెప్పారు. అధికార కూటమికి తన ఓట్లు అన్నీ తనకు లభించాయని, కొందరు స్వతంత్రులు మాత్రమే బీజేపీకి ఓటు వేశారని చెప్పారు. ఈ ఫలితాల ప్రభావం తమ కూటమి ప్రభుత్వ స్థిరత్వంపై ఉండబోదని చెప్పారు. 


మహారాష్ట్రలో ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 3, మహా వికాస్ అగాడీ కూటమి 3 స్థానాలను దక్కించుకున్నాయి. బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మాజీ రాష్ట్ర మంత్రి అనిల్ బొండే, ధనంజయ్ మహడిక్, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్‌గఢి, శివసేన నేత సంజయ్ రౌత్ గెలిచారు. శివసేన నేత సంజయ్ పవార్, బీజేపీ నేత ధనంజయ్ మహడిక్ మధ్య భీకర పోరు జరిగింది. చివరికి శివసేన నేత ఓటమిపాలయ్యారు. 


ఈ నేపథ్యంలో శరద్ పవార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికల ఫలితాలు తనకు దిగ్భ్రాంతి కలిగించలేదన్నారు. మహా వికాస్ అగాడీ కూటమికి తన ఓట్లు అన్నీ తనకు లభించాయన్నారు. కొందరు స్వతంత్రులు బీజేపీకి ఓటు వేశారన్నారు. బీజేపీకి మద్దతిచ్చే ఓ ఇండిపెండెంట్ తమ వైపు వచ్చారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకోవడంలో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విజయం సాధించారని అంగీకరించాలన్నారు. నాలుగో అభ్యర్థి విజయం కోసం అవసరమైన ఓట్ల సంఖ్యలో ఇరు పక్షాల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ నాలుగో అభ్యర్థిని నిలిపే రిస్క్‌ను తమ కూటమి తీసుకుందన్నారు. అయితే కొందరు స్వతంత్రులను తమవైపునకు తిప్పుకోలేకపోయామని చెప్పారు. 


Updated Date - 2022-06-11T17:54:47+05:30 IST