లాలూ ఆర్జేడీలో శరద్ యాదవ్ ఎల్‌జేడీ విలీనం

ABN , First Publish Date - 2022-03-20T20:27:55+05:30 IST

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీలో లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జేడీ) పార్టీ..

లాలూ ఆర్జేడీలో శరద్ యాదవ్ ఎల్‌జేడీ విలీనం

పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీలో లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జేడీ) పార్టీ విలీనమైంది. సీనియర్ సోషలిస్ట్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ తన సొంత పార్టీ అయిన ఎల్‌జేడీని లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీలో ఆదివారంనాడు విలీనం చేశారు. ఈ సందర్భంగా  శరద్ యాదవ్ మాట్లాడుతూ, విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేసినట్టు చెప్పారు. బీజేపీని ఓడిపించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన తరుణం ఇదేనని అన్నారు. ప్రస్తుతం, యూనిఫికేషన్ అనేదే తమ ప్రాధాన్యతాక్రమమని, ఐక్య విపక్షానికి ఎవరు సారథ్యం వహించాలనేది తర్వాత ఆలోచిస్తామని ఆయన చెప్పారు. లాలూ, శరద్ యాదవ్‌లు 25 ఏళ్ల క్రితం ఎవరికి వారు విడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఇరుపార్టీలు ఏకం కావడం విశేషం.


తేజస్వి హర్షం..

శరద్ యాదవ్ తమకు తండ్రి వంటివారని, ప్రముఖ సోషలిస్ట్ నేత అని ఆర్జేడీ నేత, బీహార్ అసెంబ్లీ విపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ అభివర్ణించారు. భారత రాజకీయాల్లో సోషలిస్ట్ నేతగా శరద్ యాదవ్ చెరగని ముద్ర వేసుకున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని, ఆయన తమకు మార్గదర్శకులని కొనియాడారు.

Updated Date - 2022-03-20T20:27:55+05:30 IST