ధనలక్ష్మీ నమోస్తుతే

ABN , First Publish Date - 2022-10-01T05:09:15+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి.

ధనలక్ష్మీ నమోస్తుతే
జమ్మిచేడు జములమ్మ ఆలయంలో ధనలక్ష్మీ దేవి అలంకరణలో అమ్మవారు

- భక్తిశద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు

- ధనలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవార్ల దర్శనం

గద్వాల, సెప్టెంబరు 30 : శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం జమ్మిచేడు జములమ్మ ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. మొదటి పూజను ఆలయ చైర్మన్‌ కుర్వ సతీష్‌కుమార్‌, ఈవో కవిత నిర్వహించారు. వారాంతం కావడంతో అమ్మవారిని దర్శిం చుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు కుంకుమార్చన చేసి మొక్కులు తీర్చుకు న్నారు. అనంతరం పరశురాముడిని దర్శించుకొని పూజలు చేశారు. 


రూ.5 కోట్లతో అమ్మవారి అలంకరణ 

గద్వాల టౌన్‌ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గద్వాల పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో రూ.5,11,11,111ల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. అన్నపూర్ణాదేవి, తాయమ్మ, భక్తమార్కండేయ స్వామి ఆలయాలతో పాటు, కుమ్మరి శాలివాహన సంఘం ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారు ధనలక్ష్మీ దేవి అలంకరణలో భక్తుల పూజలు అందుకున్నారు. వీరభద్ర ఆలయంలో సౌగంధినీ దేవిగా కొలువైన అమ్మవారికి మహిళలు సామూహిక కుంకుమార్చన చేవారు. 


మల్దకల్‌ : మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారు శుక్రవారం ధనలక్ష్మీ దేవి అలంకరణలో  భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామపెద్దలు ఎల్కూరు సాయికుమార్‌, మల్దకల్‌ సురేష్‌, అమరనాథ్‌, పావని, శేషయ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 


ఇటిక్యాల : బీచుపల్లి క్షేత్రంలోని సరస్వతీ మాత ధనలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మేనేజర్‌ సురేంద్రరాజు, ప్రధాన అర్చకులు భువనచంద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాత ధనలక్ష్మీదేవిగా భక్తుల పూజలందుకున్నారు. అలాగే మునగాలలో కొలు వైన దుర్గమాత ధనలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.


లలితా త్రిపుర సుందరీదేవిగా...

వడ్డేపల్లి : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మునిసి పాలిటీ పరిధిలోని పైపాడు గ్రామంలో వాల్మీకీ గుడి వద్ద  ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో కొలువుదీరారు.  భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 


రాజోలి : మండల కేంద్రంలోని అంబాభవానీ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చన చేశారు. అమ్మవారిని పూజించి, ఒడిబియ్యం సమర్పించారు.


గట్టు : మండల కేంద్రంలోని అంబాభవానీ మాత ఆలయంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 


మహాలక్ష్మీదేవిగా అంబాభవానీ

అయిజ : పట్టణంలోని అంబాభవానీ ఆలయంలో మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో అమ్మవారు, పులికల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన మండపంలో దుర్గామాత లలితా త్రిపుర సందరీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. 

Updated Date - 2022-10-01T05:09:15+05:30 IST