సొంత ‘సాక్షి’కి పంచు!

Published: Wed, 06 Jul 2022 02:22:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సొంత సాక్షికి పంచు!

మూడేళ్లలో 280 కోట్లు సమర్పయామి

జిల్లాల స్థాయిలో మరో రూ.100 కోట్ల ‘కానుక’

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 30 కోట్లు

2020, 2021లలో రూ.వంద కోట్ల చొప్పున

ఈ ఏడాది ఆరునెలల్లో రూ.50 కోట్లు 

సందర్భమున్నా లేకున్నా ఫుల్‌ పేజీ ప్రకటనలు

నిబంధనలు, సమ న్యాయానికి చెల్లుచీటీ

కరోనాలో అందరికీ కష్టం.. ‘సాక్షి’పై ధన వర్షంసొంత పత్రిక నిర్వహణకు సర్కారు ఇం‘ధనం’

ప్రకటనల ఆదాయం, సర్క్యులేషన్‌! ఏ పత్రికకైనా ఇవే కీలకం. ఈ రెండు విషయాల్లోనూ ముఖ్యమంత్రి జగన్‌ తన సొంత పత్రికకు ‘భరోసా’ అందిస్తున్నారు. సర్క్యులేషన్‌ పెంచుకునేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. 2.66 లక్షల మంది వలంటీర్లకు దిన పత్రికల ఖర్చు కింద నెలకు 200 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. వాళ్లంతా ‘సాక్షి’ కొనుక్కోవాల్సిందే. ఆ డబ్బంతా ‘సాక్షి’కే పోతుంది. సర్క్యులేషనూ పెరుగుతుంది. పెరిగిన సర్క్యులేషన్‌ చూపించి... యాడ్‌ల రేటూ పెంచుకోవచ్చు! ఇదో ‘డబుల్‌ ధమాకా దోపిడీ’ పథకం!పాలకులు ప్రజాధనానికి ధర్మకర్తల్లా వ్యవహరించాలి. పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలైన ప్రతి రూపాయీ తిరిగి ప్రజల బాగు కోసమే ఖర్చు చేయాలి. కానీ... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సొంత లాభమే ముఖ్యం. ఏ మాత్రం భేషజాలు, మొహమాటాలు లేకుండా... ప్రజా ధనంతో సొంత మీడియాకు ‘ప్రకటనల’ పండగ చేసిపెడుతున్నారు. సందర్భం వచ్చినప్పుడు కాదు... సందర్భాన్ని సృష్టించుకుని మరీ యాడ్స్‌ ఇవ్వడం ఆయనకే చెల్లు! ‘సాక్షి’ నిర్వహణకు అవసరమైన సొమ్ములను ప్రభుత్వ ఖజానా నుంచే సమకూర్చాలని కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతమే కాదు... మరికొన్ని సంవత్సరాలపాటు తన మీడియా నడిచేలా కోట్ల రూపాయలు ధారపోస్తున్నారు.


2019 మే నెలలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు... ఇప్పటిదాకా ప్రకటనల రూపంలో ‘సాక్షి’కి చేరిన ప్రజాధనం సుమారు రూ.280 కోట్లు. ఇవి రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ జారీ చేసిన ప్రకటనల విలువ మాత్రమే. ఇంకా... జిల్లాల స్థాయిలో అధికారులు సమర్పించుకున్న మొత్తం మరో రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

చెత్త పన్ను వేసి, ఆస్తి పన్ను పెంచి, విద్యుత్‌ చార్జీల షాకులు ఇచ్చి, ఆర్టీసీ చార్జీలను బాది... రకరకాల రూపాల్లో జనాన్ని ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్ముల్లో కొంత వాటా ఎక్కడికి పోతోందో తెలుసా? నేరుగా ముఖ్యమంత్రి సొంత మీడియా ‘సాక్షి’ ఖాతాలకు చేరుతోంది! అధికారాన్ని అనుభవిస్తూ... ఆ అధికారాన్ని ఉపయోగించుకుని ‘సొంత’లాభం చూసుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిది! ఇందులో అంతా ఏకపక్షమే! నియమాలు, పద్ధతులు, సమ న్యాయం, సహజ న్యాయం ఏమీ లేవు. మనకు అవసరమైనప్పుడు సొంత బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు తీసుకున్నట్లు... ‘సాక్షి’కి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు లేదా అదనపు ఆదాయం సమకూర్చేందుకు ప్రజా ఖజానా నుంచి డబ్బులు తీసి ఇస్తారు! గత మూడేళ్లలో ‘సాక్షి’కి ప్రకటనల రూపంలో రాష్ట్ర ఖజానా నుంచే రూ.280 కోట్లను తరలించారు. జిల్లా స్థాయిలో జారీ చేసిన ప్రకటనల ఆదాయం దీనికి అదనం. వెరసి... పత్రిక నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సొమ్ము సమకూర్చిపెడుతున్నారు. అడ్డగోలు నిబంధనలతో ‘అమ్మఒడి’లో కోతలు పెట్టినా, ఆంక్షల పేరిట ఇతర పథకాల లబ్ధిదారులను తగ్గించినా, పలు పథకాలను పూర్తిగా ఎత్తివేసినా, ఆస్పత్రులకు సరఫరాలు నిలిచిపోయినా, ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోయినా... ‘సాక్షి’కి ధన ప్రవాహం మాత్రం ఆగదు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు, సప్లయర్లకు రూ.లక్ష కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలు, నేతలు చేసిన పనుల బిల్లులూ చెల్లించడంలేదు. కానీ... ‘సాక్షి’కి మాత్రం ఒక్క రూపాయి పెండింగ్‌లో ఉండదు. లక్షల విలువైన ప్రకటనలు ఇవ్వడం... ఆ వెంటనే ఠంచనుగా డబ్బులు చెల్లించడం! ఆలస్యం కావడానికి వీల్లేదు సుమా! ఎందుకంటే... అది స్వయంగా ముఖ్యమంత్రి సొంత మీడియా కదా!


జగనన్న రాజపోషణ....

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పనుల గురించి ప్రజలకు తెలియచెప్పాల్సిందే. ఈ ప్రచారం కోసం సమాచార శాఖను ఉపయోగించుకుంటుంది. ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌ పబ్లిసిటీ, కరపత్రాలు, పోస్టర్లు, వీడియో, ఫొటోల, ప్రెస్‌ నోట్‌లు, డిజిటల్‌ రూపంలో ఈ ప్రచారం సాగుతుంది. దీంతోపాటు పత్రికలు, ఎలకా్ట్రనిక్‌ మీడియాకు యాడ్స్‌ కూడా ఇస్తారు. ఇదేమీ కొత్త కాదు. వరుస ప్రభుత్వాలు చేస్తున్న పనే. కానీ... ప్రకటనల జారీ విషయంలో జగన్‌ సర్కారు అన్ని హద్దులనూ చెరిపివేసింది. ఒక కొత్త పథకం ప్రవేశ పెట్టినప్పుడు ప్రకటనలు జారీ చేయవచ్చు. కానీ... ఆ పథకాన్ని రెండు మూడు ముక్కలు చేసి, దాని ప్రకారం  బటన్‌ నొక్కి నిధులు విడుదల చేసి, అలా విడుదల చేసిన ప్రతిసారీ ‘సాక్షి’కి లక్షల రూపాయలు కట్టబెట్టడమనే కొత్త ‘పథకం’ జగన్‌ పాలనలో అమలవుతోంది. ఉదాహరణకు... ‘జగనన్న విద్యా దీవెన’ కింద మూడు నెలలకోసారి నిధులు విడుదల చేస్తారు. లబ్ధిదారుల ఖాతాలతోపాటు ప్రతిసారీ ‘సాక్షి’ ఖాతాలకూ డబ్బులు పడాల్సిందే. మరీ దారుణమేమిటంటే... సమాచార శాఖ నుంచి పత్రికా ప్రకటన (ప్రెస్‌ నోట్‌)తో పోయే వాటికి కూడా లక్షలు ఖర్చు పెట్టి ‘యాడ్స్‌’ జారీ చేస్తున్నారు. సర్కారు రోజువారీగా చేసే కార్యక్రమాలు, నిధుల విడుదల, పథకాల అమలుకు సంబంధించిన సమాచారాన్ని మీడియా కవర్‌ చేస్తూనే ఉంటుంది. సమాచార శాఖ ప్రెస్‌ నోట్‌ ఇచ్చినా, సంబంధిత మంత్రి ప్రకటన చేసినా, ముఖ్యమంత్రి చెప్పినా వాటికి తగిన ప్రాచుర్యం లభిస్తుంది. అలాంటి సమాచారాన్ని కూడా ‘ప్రకటనల’ రూపంలోకి మలిచి... ‘సాక్షి’కి జనం డబ్బు దోచిపెట్టడం జగన్‌ ప్రత్యేకత! మరీ దారుణమేమిటంటే... ఇతర మీడియాలో వచ్చే కథనాలకు వివరణ/ఖండనలనూ ‘సాక్షి’కి ప్రకటనల రూపంలోనే ఇస్తున్నారు. ఏ సందర్భం లేదనుకోండి... ప్రభుత్వం ఒక సందర్భాన్ని సృష్టించి ‘సాక్షి’కి యాడ్స్‌ ఇచ్చేస్తుంది. ఉదాహరణకు... పెట్రోల్‌ ధరలు తగ్గాయా, పెరిగాయా అంటూ తనకు అనుకూలమైన లెక్కలతో ఒక ఫుల్‌ పేజీ ప్రకటన! ‘ఉద్యోగులారా ఆలోచించండి’ అంటూ పీఆర్సీ ఉద్యమ సమయంలో ఒక ప్రకటన! పల్స్‌ పోలియో.. అంటూ ఒక ప్రకటన! సందర్భం, అసందర్భం ఏదైనా సరే... ‘సాక్షి’కి సొమ్ములు కట్టబెట్టడమే లక్ష్యంగా జగన్‌ సర్కారు సాగుతోంది.


జిల్లాల్లో అదనం...: రాష్ట్రస్థాయిలో జారీ చేస్తున్న ప్రకటనలకు అదనంగా... మద్యపాన నియంత్రణ, ఇసుక ధరలు, పలు సంక్షేమ పథకాలపై జిల్లాల వారీగా ప్రతి శని, ఆదివారాల్లో క్రమం తప్పకుండా ప్రకటనలు ఇస్తున్నారు. వీటి ద్వారా ‘సాక్షి’కి మరో రూ.100 కోట్లు అంది ఉంటాయని అంచనా!


లక్షలతో మొదలు పెట్టి...

జగనన్న సర్కారు 2019 మే నెలలో కొలువు తీరింది. ఆ ఏడాది డిసెంబరు వరకు... అంటే తొలి ఆరునెలలో సాక్షికి ప్రకటనల రూపంలో రూ.30 కోట్లకు పైగా కట్టబెట్టారు. మే నెలలోనే 91 లక్షలు ఇచ్చారు. మరుసటి నెల జూన్‌లో డోస్‌ పెంచి 3.50 కోట్లు చెల్లించారు. డిసెంబరులో అది దాదాపు 7 కోట్లకు చేరింది. 2020లో కరోనా కాలంలో ప్రపంచంలో వ్యాపారాలన్నీ తలకిందులయ్యాయి. మీడియా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కానీ... ‘సాక్షి’కి మాత్రం జగన్‌ సర్కారు అంతులేని భరోసా ఇచ్చింది. ఎలాంటి ఆర్థిక కష్టం రాకుండా చూసుకుంది. కరోనా లాక్‌డౌన్‌ అమలైన జూన్‌లో రూ.5 కోట్లు, జూలైలో రూ.6.50 కోట్లు ‘సాక్షి’కి లభించాయి. 2020 ఆగస్టులో ఏకంగా రూ.14.50 కోట్లు కట్టబెట్టారు. సెప్టెంబరులో ఈ డోసు మరింత పెరిగింది. ఆ నెలలో రూ.18.20 కోట్లు ‘సాక్షి’కి ధారపోశారు. మొత్తంగా  2020లో ‘సాక్షి’కి ప్రభుత్వ ఖజానా నుంచి రూ.వంద  కోట్లు సమర్పించుకున్నారు. 


2021లో 100 కోట్లు.. 

గత ఏడాది కరోనా సెకండ్‌ వేవ్‌ రాష్ట్రాన్ని, దేశాన్ని కుదిపేసింది. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఆర్థికంగా కుదేలయ్యారు. కానీ.. సొంత ‘సాక్షి’కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా జగన్‌ సర్కారు జాగ్రత్తగా చూసుకుంది.  ఆ ఏడాది జనవరిలో రూ.7.45 కోట్లు సమర్పించారు. ఆ తర్వాత రెండు నెలలు రూ.12 కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారు. ఏప్రిల్‌ నాటికి కరోనా కారణంగా లాక్‌డౌన్‌ పరిస్థితులు వచ్చాయి. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు వెలిశాయి. ఆ సమయంలో సర్కారు వారు ‘సాక్షి’కి ఏకంగా 12.29 కోట్లు ప్రకటనల రూపంలో ఇచ్చింది. ఆగస్టు వరకు ఇవే ప్రతికూల పరిస్థితులు కొనసాగాయి. ‘సాక్షి’కి మాత్రం మే నుంచి ఆగస్టు వరకు రూ.38 కోట్లు చెల్లించారు. ఇక, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు నెలకు సగటున 8 కోట్ల చొప్పున ప్రకటనలు ఇచ్చేశారు. నికరంగా 2021లో సాక్షికి 100.09 కోట్లరూపాయలను అందించారు. 


ఈ ఏడాది ఆరు నెలల్లో 51 కోట్లు

ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటం, పథకాల లోగుట్లు అర్థం కావడంతో... జగన్‌ సర్కారు ఈ ఏడాది ప్రకటనల జోరు మరింత పెంచింది. జనవరి నుంచి జూన్‌ వరకు ఆరు నెలల్లో 51.31 కోట్ల రూపాయలను తరలించింది. జనవరిలో ఏడు కోట్లు ఇస్తే ఏప్రిల్‌లో 13.2 కోట్లకు తీసుకెళ్లారు. జూన్‌లో 13.3 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారు. వెరసి... జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సొంత ‘సాక్షి’కి రూ.280 కోట్ల ప్రజా ధనం దోచిపెట్టారు.


పద్ధతి లేని పాలన...

అవి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్న రోజులు! ఆయన ఇంటి క్రమబద్ధీకరణ అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. తన అధ్యక్షతన జరిగే సమావేశంలో... తన సొంత ప్రయోజనాలకు సంబంధించిన విషయంపై నిర్ణయం తీసుకోవడం బాగోదు! అందుకే... ‘దీనిపై మీరే తగిన నిర్ణయం తీసుకోండి’ అని మంత్రివర్గ సహచరులకు సూచించి, ఆయన బయటికి వెళ్లిపోయారు. కేబినెట్‌ అజెండాదాకా వచ్చిందంటే... అది ముఖ్యమంత్రి ఆమోదంతోనే జరుగుతుంది! ఆయన లేకున్నా సరే... కేబినెట్‌ అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. అయినప్పటికీ... ఒక మర్యాదను పాటిస్తూ ఆ సమయంలో వైఎస్‌ బయటికి వెళ్లిపోయారు. గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు ఇదే పద్ధతిని పాటించారు. కానీ.... జగన్‌కు ఈ మొహమాటాలేవీ లేవు. జనం సొమ్మును సొంత మీడియా ‘సాక్షి’కి దోచి పెట్టడమే లక్ష్యం.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.