రెండుసార్లు అధికారం ఇస్తే కేసీఆర్ ఏం చేశారు?: షర్మిల

ABN , First Publish Date - 2022-04-17T19:53:01+05:30 IST

వైఎస్‌ఆర్‌ హయాంలో వ్యవసాయం పండుగలా జరిగిందని షర్మిల అన్నారు.

రెండుసార్లు అధికారం ఇస్తే కేసీఆర్ ఏం చేశారు?: షర్మిల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వైఎస్‌ఆర్‌ హయాంలో వ్యవసాయం పండుగలా జరిగిందని, పెట్టుబడి తగ్గించి రాబడి పెంచిన ఘనత వైఎస్‌ఆర్‌దేనని షర్మిల అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన చేస్తున్న ఆమె మాట్లాడుతూ రెండుసార్లు తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేశానని సీఎం చెబుతున్నారని... మరి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. రూ.25 వేలు ఇచ్చే పథకాలు ఆపేసి రూ. 5 వేలు రైతుబంధు ఇస్తున్నారని విమర్శించారు. కౌలు రైతుకు రుణాలు, రైతుబంధు ఇవ్వడంలేదన్నారు. వరి పంట వేయొద్దని రైతులకు చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. వరి వేయని రైతులకు ముఖ్యమంత్రి ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకున్నారని, మద్దతుధరతో పాటు బోనస్ కలిపి రైతులకు చెల్లించాలన్నారు.


టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ను ఎవరైనా ఏమైనా అంటే వరి కంకులతో కొట్టాలంటూ.. రాజేశ్వరరెడ్డి చెప్పారని, మరి తప్పులు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను దేనితో కొట్టాలని ప్రశ్నించారు. వరి వేయొద్దన్న కేసీఆర్‌ను ఏ చీపురుతో కొట్టాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొడుకు అరాచకాలతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎమ్మెల్యే, ఆయన కొడుకుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - 2022-04-17T19:53:01+05:30 IST