ఊసరవెల్లికి ఆదర్శం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-03-21T08:06:11+05:30 IST

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన సీఎం కేసీఆర్‌.. ఊసరవెల్లికి ఆదర్శంగా నిలిచారని వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

ఊసరవెల్లికి ఆదర్శం కేసీఆర్‌

రైతులను నిండా ముంచుతున్నారు 

ఆత్మహత్యలు, అప్పుల తెలంగాణగా మార్చారు

సెంటిమెంట్‌తో గద్దెనెక్కి మాట తప్పారు: షర్మిల 


భువనగిరి రూరల్‌, మార్చి 20: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన సీఎం కేసీఆర్‌.. ఊసరవెల్లికి ఆదర్శంగా నిలిచారని వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో 31వ రోజుకు చేరింది. మండలంలోని నాగిరెడ్డిపల్లి, నందనం, అనాజీపురం క్రాస్‌రోడ్‌ మీదుగా భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వరకు ఆమె యాత్ర సాగింది. అనంతరం వద్ద బాబు జగ్జీవన్‌రామ్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.


ఎకరాకు కేసీఆర్‌ రూ.5 వేలు ఇస్తూ రూ.25 వేల ఇతర వ్యవసాయ పథకాలను విస్మరించారని అన్నారు. అకాల వర్షాలకు, కరువు కాటకాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించకుండా రైతులను నిండా ముంచుతున్నారని ధ్వజమెత్తారు. దళిత ముఖ్యమంత్రి, రుణమాఫీ, వడ్డీలేని రుణాలు, ఇంటికో ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ఆ హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో గద్దెనెక్కి రాష్ట్రాన్ని ఆత్మహత్యల, అప్పుల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. 


నేటి పాదయాత్ర వివరాలు..

షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రాయగిరి కమాన్‌ వద్ద ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. రాయగిరి కమాన్‌, బాలంపల్లి, కేసారం, కూలూరు మీదుగా ఆమె యాత్ర కొనసాగనుంది. అనంతరం మోటకొండూరు మండలంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. కాగా ఇప్పటి వరకు 366 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగింది.

Updated Date - 2022-03-21T08:06:11+05:30 IST