సీఎం కేసీఆర్‌కు అధికారం పిచ్చి పట్టింది

ABN , First Publish Date - 2022-10-04T05:11:03+05:30 IST

చిన్నశంకరంపేట, అక్టోబరు, 3: సీఎం కేసీఆర్‌కు అధికార మద పిచ్చి పట్టిందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

సీఎం కేసీఆర్‌కు అధికారం పిచ్చి పట్టింది
గవ్వలపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న వైఎస్‌ షర్మిల

దొంగ దీక్షలు చేసి గాంధీతో పోల్చుకుంటున్నాడు  

రాష్ట్రాన్ని బార్ల తెలంగాణ చేసిండు

ప్రశ్నించే గొంతుకలను నొక్కేశాడు  

వైఎస్సార్‌ సంక్షేమ పాలన మాతోనే సాధ్యం : వైస్‌ షర్మిల 


చిన్నశంకరంపేట, అక్టోబరు 3: సీఎం కేసీఆర్‌కు అధికార మద పిచ్చి పట్టిందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని టి.మాందాపూర్‌, ఎడిప్పల్‌, కొర్విపల్లి, గవ్వలపల్లి, చిన్నశంకరంపేటలో కొనసాగింది. శ్రేణులు, అభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. మండలకేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దొంగ దీక్షలు చేసి మహాత్మా గాంధీతో పోల్చుకుంటున్నాడని మండిపడ్డారు. కేసీఆర్‌కు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణను బార్ల తెలంగాణను చేసిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు. వరి సాగు చేస్తే.. ఉరే దిక్కని రైతులను మోసం చేసిండని మండిపడ్డారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తానని మాటిచ్చి మర్చిపోయాడని, రూ. 5వేలు రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకున్నాడని విమర్శించారు. ప్రజల హక్కుల కోసం మాట్లాడే గొంతుకలను నొక్కేశాడని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న బిడ్డల కుటుంబాలను పరామర్శించడానికి ఆయనకు ఇన్నేళ్లుగా తీరిక దొరకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరుల ఉసురు కేసీఆర్‌కు ముడుతుందని అన్నారు. అవినీతిపరుడైన కేసీఆర్‌ను ప్రజలు నమ్మడం లేదని స్పష్టం చేశారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు భూమి, పోడు భూములకు పట్టాలు, కేజీ టు పీజీ, ఫీజు రీయింబర్స్‌మెంటు తదితర హమీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. వైఎస్సీర్‌ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను ప్రస్తుత ప్రభుత్వం కాలరాస్తున్నదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని, నిరుపేదలు కార్పొరేట్‌ ఆసుపత్రి గడప ఎక్కలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. మాయలఫీకీర్‌ను అధికారం  నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణకు దరిద్రం పట్టించిన కేసీఆర్‌ దేశాన్ని ఉద్దరిస్తానని బయలు దేరుతున్నాడని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో రూ. 4లక్షల కోట్ల అప్పులు ప్రజల నెత్తిమీద రుద్దాడని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో సుపరిపాలన రావాలంటే తమను ఆదరించాలని కోరారు. కేసీఆర్‌ అవినీతి పాలనను అంతమొందించేందుకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం గవ్వలపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో వైఎ్‌సఆర్‌టీపీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-04T05:11:03+05:30 IST