జగన్‌ పైకి షర్మిల బాణం!

ABN , First Publish Date - 2021-01-24T06:35:57+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, ఆయన సోదరి వైఎస్‌ షర్మిలకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయా? ఇద్దరి మధ్యా మాటలు కూడా కరువయ్యాయా?...

జగన్‌ పైకి షర్మిల బాణం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, ఆయన సోదరి వైఎస్‌ షర్మిలకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయా? ఇద్దరి మధ్యా మాటలు కూడా కరువయ్యాయా? అన్న–చెల్లెలి మధ్య ప్రారంభమైన పోరులో తల్లి, దివంగత రాజశేఖర్‌ రెడ్డి భార్య శ్రీమతి విజయలక్ష్మి కూతురుకే అండగా నిలవాలనుకుంటున్నారా? జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తమను నిర్లక్ష్యం చేస్తున్నారని తల్లీ కూతుళ్లు బాధపడుతున్నారా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీని చేస్తానని లేదా తెలంగాణలో పార్టీ పెట్టించి ముఖ్యమంత్రిని చేస్తానని చెల్లి షర్మిలకు జగన్‌ హామీ ఇచ్చారా? అన్న జైలుకు వెళ్లినప్పుడు దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న తనను షర్మిల ఇప్పుడు నిర్లక్ష్యం చేయడం ఏమిటి? అని ఆవేదన చెందుతున్నారా? కన్నకూతురు నిరాదరణకు గురవడాన్ని శ్రీమతి విజయలక్ష్మి జీర్ణించుకోలేకపోతున్నారా? తాము ఆశించిన రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో కనిపించడంలేదని, తమిళనాడు తరహా రాజకీయాలను తీసుకువచ్చారని జగన్‌ రెడ్డిపై వారిద్దరూ ఆగ్రహంగా ఉన్నారా? ఇటు రాజకీయాలలో ఎదగనీయకుండా, అటు తండ్రి హయాంలో ప్రారంభించిన వ్యాపారాలలో కూడా తన పాత్ర లేకుండా చేసినందుకు అన్నపై షర్మిల మండిపడుతున్నారా? తాను ఏమిటో రుజువు చేసుకోవడానికై తెలం


గాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాలని షర్మిల నిర్ణయించుకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అనే సమాధానమే లభిస్తోంది. అన్నాచెల్లెలు మధ్య విభేదాలు తలెత్తాయన్న ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతున్నప్పటికీ... ఇరువురి మధ్యా మాటామంతీ కూడా లేనటువంటి పరిస్థితి ఉందని చాలామందికి తెలియదు. రాజశేఖర్‌ రెడ్డి జీవించి ఉన్నప్పటి నుంచే కుటుంబ సభ్యులందరూ క్రిస్మస్‌ పండుగ సందర్భంగా పులివెందుల చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీని మొదటిసారిగా బ్రేక్‌ చేస్తూ, గత నెలలో క్రిస్మస్‌ పండుగకు షర్మిల కుటుంబం పులివెందులకు వెళ్లలేదు. దీంతో తల్లీ, చెల్లెలు తనపై ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన జగన్‌ రెడ్డి సంక్రాంతి పండుగకు తాడేపల్లి నివాసానికి రావాల్సిందిగా చెల్లి షర్మిలను ఆహ్వానించారు. అయితే, షర్మిల ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత జగన్‌ ఫోన్‌లో మాట్లాడటానికి ప్రయత్నించినా షర్మిల అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. జగన్‌ ప్రభుత్వం రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేయడంలేదని, తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా రాజశేఖర్‌ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా పక్కనపెడుతూ వచ్చారని తన సన్నిహితుల వద్ద షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తానేమిటో అన్నకు చూపించాలన్న పట్టుదలతో ఉన్న షర్మిల, తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి మొదటి పక్షంలో, బహుశా ఫిబ్రవరి 9వ తేదీన తాను రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టుగా విలేకరుల సమావేశంలో ప్రకటించాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ విలేకరుల సమావేశంలో శ్రీమతి విజయలక్ష్మి కూడా పాల్గొంటారని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. ‘తెలంగాణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌’ అని తాను ప్రారంభించబోతున్న రాజకీయ పార్టీకి నామకరణం కూడా షర్మిల చేసుకున్నారు. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితంగా, నమ్మకంగా ఉన్న తెలంగాణకు చెందిన పలువురు నాయకులు, కుటుంబ శ్రేయోభిలాషులకు షర్మిల గత కొన్ని రోజులుగా ఫోన్లు చేస్తూ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. తండ్రి రాజశేఖర్‌ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని గుర్తుచేస్తూ తాను కూడా చేవెళ్లలోనే రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభిస్తానని, అటునుంచే పాదయాత్ర ప్రారంభించి తెలంగాణ అంతా చుట్టివస్తానని షర్మిల తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల సారథ్యంలో తెలంగాణలో పార్టీ పెట్టించి ముఖ్యమంత్రిని చేస్తానని జగన్‌ రెడ్డి తనకే కాకుండా తమ తల్లి విజయలక్ష్మికి కూడా హామీ ఇచ్చారనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో తన ఆర్థిక ప్రయోజనాలను, ఆస్తులను రక్షించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతూ ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీని విస్మరించారనీ షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాలలో ప్రోత్సహించే విషయం అటుంచి... ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో కూడా తనను పూర్తిగా విస్మరించడమే కాకుండా తొలుత ఆఫర్‌ చేసిన రాజ్యసభ పదవిని కూడా నిరాకరించడాన్ని షర్మిల జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు రాజకీయాల్లో, అటు వ్యాపారాల్లో కూడా తమకు భాగస్వామ్యం లేకుండా చేసిన తీరు తెన్నులను షర్మిల తన సన్నిహితులకు వివరిస్తున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించాలని షర్మిల నిర్ణయించుకున్న విషయం తెలిసి ఆమెతో ఆ ప్రయత్నాన్ని విరమింపజేయడానికి జగన్‌ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమె క్రిస్మస్‌ పండుగకు పులివెందుల వెళ్లకుండా గైర్హాజరయ్యారని చెబుతున్నారు.


అన్నలో ఆందోళన

చెల్లెలు షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకున్న సంబంధాలు దెబ్బతింటాయని జగన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఒకసారి షర్మిల రాజకీయాల్లోకి ప్రవేశిస్తే తెలంగాణకే పరిమితమవుతారన్న గ్యారంటీ లేదనీ, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కూడా ప్రవేశించవచ్చుననీ, ఈ క్రమంలో ఆమె తనను కూడా టార్గెట్‌ చేసుకోవచ్చుననీ జగన్‌ రెడ్డి కలత చెందుతున్నట్టు చెబుతున్నారు. చెల్లిని ఒప్పించడానికి జగన్‌ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని, షర్మిలకు తాను నచ్చచెప్పలేనని తల్లి విజయలక్ష్మి కూడా నిస్సహాయత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.


రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వారందరూ జగన్‌కంటే షర్మిల ఎక్కువ మొండి అని చెబుతున్నారు. ఆమె ఒక నిర్ణయానికి వస్తే మార్చడం ఎవరితరమూ కాదని వారంటున్నారు. రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంలో విభేదాలు ఏర్పడిన వార్తలు బయటకు పొక్కితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయనీ, ఇప్పటికే వైఎస్‌ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్‌ సునీత తన తండ్రి హత్యకు కారకులను గుర్తించడంలో సహకరించవలసిందిగా కేరళకు చెందిన హక్కుల కార్యకర్తలను సంప్రదించడం, ఇప్పుడు షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించడం జరిగితే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి విశ్వసనీయతకు గండిపడుతుందని వైఎస్‌ కుటుంబ సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని వారు షర్మిల వద్ద ప్రస్తావించగా, తన సోదరుడు తనను దారుణంగా మోసం చేశాడని, తాను కష్టాలలో ఉన్నప్పుడు తమను వాడుకొని ఇప్పుడు ఇంతలా నిర్లక్ష్యం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తన రాజకీయ ప్రయాణం వల్ల జగన్‌ రెడ్డికి లాభమా? నష్టమా? అన్నది తనకు అనవసరమని ఆమె స్పష్టం చేస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి జీవించి ఉన్నప్పుడు జగన్‌తో పోల్చితే తననే ఎక్కువ ప్రేమగా చూసుకునేవారని, ఆయనకు నిజమైన వారసురాలిని తానేనని షర్మిల తేల్చి చెబుతున్నారు. జగన్‌ పాలన రాజన్న రాజ్యాన్ని తలపిస్తుందని తాము ఆశించామని, 20 మాసాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడం లేదని, తమిళనాడు తరహా రాజకీయాలను ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నారని, తండ్రి రాజశేఖర్‌ రెడ్డిని కాకుండా తాత రాజారెడ్డిని జగన్‌ ఆదర్శంగా తీసుకున్నారని షర్మిల విమర్శిస్తున్నారు. ఈ కారణంగానే ‘రాజన్న రాజ్యం’ ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తెలియజేయడానికై తెలంగాణలో తాను రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు తమ కుటుంబ శ్రేయోభిలాషులకు ఆమె వివరిస్తున్నారు. ఆంధ్రాతో సమానంగా తెలంగాణలో కూడా రాజశేఖర్‌ రెడ్డికి ఎంతో విశ్వసనీయత ఉందని, ఆ విశ్వసనీయత ఆధారంగానే ఆయన వారసురాలిగా తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు షర్మిల చెబుతున్నారు. తన తండ్రి జీవించి ఉన్నప్పుడు ఆయన ప్రోత్సహించిన పలువురు కాంగ్రెస్‌ నాయకులను, ఇతరులను షర్మిల ఇప్పటికే సంప్రదించారు. వారందరూ షర్మిల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, రాజకీయ పార్టీని ప్రారంభించిన తర్వాత తాము కూడా చేయి కలుపుతామని హామీ ఇచ్చారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆ తండ్రి వారసత్వం ఎవరికి దక్కాలి? విశ్వసనీయతకు ఎవరు ప్రతీక? అన్నది ప్రజలే నిర్ణయించబోతారని షర్మిల అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. సోదరుడి వంచనకు గురైన తాను తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయతను పెంపొందించుకోవడానికై జగన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడానికి సైతం వెనుకాడనని షర్మిల తన సన్నిహితుల వద్ద స్పష్టం చేస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే తన పాలనతో జగన్‌ పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరతానని, రాజన్న రాజ్యం అందించడంలో జగన్‌ రెడ్డి విఫలమైనందున రాజన్న రాజ్యం కోసం తనకూ ఒక అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరడానికి ఆమె కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. షర్మిల రాజకీయ ప్రయత్నాల గురించి తెలుసుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమెను సంప్రదించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరినా, ఆ పార్టీతో చేతులు కలిపినా తాము చేసిన ప్రచారానికి భిన్నంగా వ్యవహరించడమే అవుతుందని, ఫలితంగా తన విశ్వసనీయత దెబ్బతింటుందన్న ఉద్దేశంతో సోనియాగాంధీ ఇచ్చిన ఆఫర్‌ను షర్మిల తిరస్కరించినట్టు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా షర్మిల కదలికలను గమనిస్తున్నది. తెలంగాణలో షర్మిలకు లభించే ఆదరణను బట్టి ఆమెను ప్రోత్సహించే విషయమై బీజేపీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాను రాజకీయ పార్టీని ప్రారంభించిన తర్వాత ప్రత్యర్థుల నుంచి ఎటువంటి విమర్శలు వచ్చే అవకాశం ఉంది? వాటికి దీటుగా సమాధానం చెప్పడం ఎలా? వంటి అంశాలపై షర్మిల ఇప్పటికే కసరత్తు పూర్తిచేశారని తెలిసింది. 


నాన్నకున్న ఆదరణే ఆలంబనగా...

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని దెబ్బతీయడంతోపాటు రాష్ట్రంలో జగన్‌ పాలనా తీరుతెన్నులపై తెలంగాణలోని నాయకులు, ఇతరులలో నెగెటివ్‌ అభిప్రాయం ఉంది. సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్‌ వెళ్లి తిరిగి వచ్చిన హైదరాబాద్‌ వాసులు జగన్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ చేస్తున్న తప్పులను, వ్యవహార శైలిని ఎత్తిచూపడం ద్వారా తెలంగాణ ప్రజల్లో తనపట్ల నమ్మకం ఏర్పడేలా ముందుకు వెళ్లాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నంత భారీ స్థాయిలో కాకపోయినా తెలంగాణలోనూ ఇటీవలి కాలంలో మత మార్పిడులు పెరిగాయి. షర్మిల భర్త అనిల్‌ కుమార్‌ స్వయంగా క్రైస్తవ మత ప్రచారకుడు. ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని క్రైస్తవ మత ప్రచారకుల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. బ్రదర్‌ అనిల్‌ సారథ్యంలో జరిగిన ప్రచారంవల్లనే ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్తవులు అందరూ మూకుమ్మడిగా జగన్‌ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు షర్మిల తన సోదరుడితో విభేదించి సొంత పార్టీ ప్రారంభిస్తే క్రైస్తవులు ఎటువైపు ఉంటారన్నది చర్చనీయాంశమవుతుంది. తెలంగాణలోని క్రైస్తవులు షర్మిలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులలో అత్యధికులు రాజశేఖర్‌ రెడ్డిపై ఉన్న అభిమానంతో తనకే మద్దతిస్తారని షర్మిల అంచనా వేసుకుంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది. రాజశేఖర్‌ రెడ్డిపై ప్రజలలో ఉన్న అభిమానం, విశ్వసనీయతే పెట్టుబడిగా షర్మిల రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్‌ రెడ్డిని అభిమానించేవారు ప్రస్తుతం జగన్‌ పార్టీలో ఉన్నారు. వారిలో పలువురు ఇటీవలి కాలంలో షర్మిలను కలిసి, తాము చూసిన రాజశేఖర్‌ రెడ్డి వేరు, ఆయన వారసుడిగా వచ్చిన జగన్‌ రెడ్డి వేరు అని ఆమె వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ పరిణామాలన్నీ బేరీజు వేసుకున్న మీదటే రాజకీయ పార్టీ ప్రారంభించాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి వచ్చే నెలలో ఏర్పాటు చేయనున్న విలేకరుల సమావేశంలో షర్మిలతోపాటు తల్లి విజయలక్ష్మి కూడా పాల్గొంటే తెలుగు రాష్ర్టాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అది పెద్ద కుదుపే అవుతుంది. జగన్‌ రెడ్డి ప్రచారం చేసుకుంటున్న విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది. భవిష్యత్తులో షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల వైపు కూడా చూస్తే జగన్‌ రెడ్డికి రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఈ పరిస్థితిని ఊహిస్తున్న రాజశేఖర్‌ రెడ్డి కుటుంబ శ్రేయోభిలాషులు షర్మిలకు నచ్చచెప్పడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాజశేఖర్‌ రెడ్డి గారాలపట్టి అయిన షర్మిల వల్ల జగన్‌ రెడ్డికి దెబ్బపడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే షర్మిల మొండితనం గురించి ముందు నుంచి తెలిసిన వారు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. జగన్‌ రెడ్డికైనా నచ్చజెప్పవచ్చుగానీ, షర్మిల ఒక నిర్ణయానికి వస్తే ఆమె మనసు మార్చడం ఎవరివల్లా కాదని రాజశేఖర్‌ రెడ్డి కుటుంబ సన్నిహితుడు ఒకరు చెప్పారు. ఈ విషయంలో శ్రీమతి విజయలక్ష్మి కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారనీ, ఆమె కూడా తన బిడ్డకు అన్యాయం జరిగిందన్న అభిప్రాయంతోనే ఉన్నారనీ ఆయన తెలిపారు. అన్నా చెల్లెలు చెరోవైపు నిలబడితే తల్లి విజయలక్ష్మి కూతురి వైపే మొగ్గు చూపే ఆలోచనలో ఉన్నారనీ, అదేజరిగితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి ప్రభ మసకబారుతుందనీ చెప్పవచ్చు. ఒకవైపు సొంత బాబాయ్‌ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్‌ సునీత, మరోవైపు సొంత చెల్లి షర్మిల తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే జరిగే నష్టం తెలుసుగనుకే జగన్‌ రెడ్డి ఇటీవల కలత చెందుతున్నట్టు చెబుతున్నారు. రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంలో తలెత్తిన ఈ విభేదాలు ఏ పరిణామాలకు దారితీస్తాయి? షర్మిల రాజకీయ రంగప్రవేశం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచిచూడాలి. అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే ఊహించలేం అంటారు.


వ్యవస్థలపైనా వేట...

ఈ విషయం అలా ఉంచితే, ఇంతకాలం రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేధించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఇప్పుడు స్వీయ విధ్వంసానికి పాల్పడుతున్నారా? అన్న అనుమానం కలుగుతున్నది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరిపై ఫిర్యాదు చేయడం ద్వారా ఆయన బదిలీకి కారకుడైన జగన్‌ రెడ్డి, దానివల్ల కలిగిన ప్రయోజనాన్ని అనుభవించకుండానే మళ్లీ రాజ్యాంగ వ్యవస్థలతో అసాధారణ రీతిలో తలపడుతున్నారు. నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ గోస్వామి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు మేరకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సిద్ధపడగా, ఎన్నికలకు సహకరించేది లేదని జగన్‌ ప్రభుత్వం భీష్మించుకొని కూర్చోవడం దేనికి సంకేతం? ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాకుండా సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కట్టడి చేశారు. తన జేబు సంస్థలుగా మారిన ఉద్యోగ సంఘాలతో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల కమిషన్‌కు సహకరించబోమని చెప్పించారు. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వస్తుంది. ఈలోపు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను బాహాటంగానే ధిక్కరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రారంభమయ్యాక రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం సాగదనీ, ఎన్నికల కమిషన్‌కే సర్వాధికారాలూ ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం గతంలో విస్పష్ట తీర్పు ఇచ్చినా జగన్‌ ప్రభుత్వం దాన్ని కూడా ధిక్కరిస్తోంది. ఈ పరిణామంతో హైకోర్టుకే కాదు, సుప్రీంకోర్టుకు కూడా తన నైజం ఏమిటో తెలిసేలా జగన్‌ రెడ్డి చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఎన్నికల కమిషనే సుప్రీం అని తెలిసి కూడా ఐఏఎస్‌ అధికారులు సైతం ముఖ్యమంత్రికి భయపడి ఆయన చెప్పినట్టు నడుచుకోవడం ఇప్పుడే చూస్తున్నాం. సంబంధిత అధికారులు ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. ప్రభుత్వ న్యాయ సలహాదారులు కూడా నిస్సహాయంగా ఉండిపోవడం నిజంగా విషాదం! అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వ్యవహార శైలి న్యాయాధికారుల్లోనే కాదు, న్యాయ నిపుణుల్లో కూడా విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో తన ప్రభుత్వానికి అనుకూలంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేయడంతో, అది ఇష్టంలేని ఆనాటి అడ్వొకేట్‌ జనరల్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే హైకోర్టుగానీ, ఎన్నికల కమిషన్‌గానీ మరేదైనా రాజ్యాంగబద్థమైన సంస్థ అయినా సరే, తన ప్రభుత్వానికి లోబడే వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే, ప్రజాస్వామ్య వ్యవస్థలో అలా కుదరదు. ప్రస్తుత వివాదాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర గవర్నర్‌ ఏం చేస్తారు? సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతున్నది? అన్నది వేచి చూడాలి.

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-01-24T06:35:57+05:30 IST