Kuwait: గణనీయంగా తగ్గుతున్న ప్రవాసుల సంఖ్య.. గత 3ఏళ్లలో ఎంతమంది ఆ దేశాన్ని విడిచి వెళ్లారంటే..!

ABN , First Publish Date - 2022-03-16T15:51:01+05:30 IST

గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Kuwait: గణనీయంగా తగ్గుతున్న ప్రవాసుల సంఖ్య.. గత 3ఏళ్లలో ఎంతమంది ఆ దేశాన్ని విడిచి వెళ్లారంటే..!

కువైత్ సిటీ: గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 2017లో సివిల్ సర్వీస్ కమిషన్(సీఎస్‌సీ) తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ వలసదారుల పాలిట శాపంగా మారింది. స్థానికులకు అధికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఏకైక ఉద్దేశంతో ఈ పాలసీని కువైత్ సర్కార్ తీసుకురావడం జరిగింది. అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 2017 నుంచి కువైటైజేషన్ పాలసీని అమలు చేయడం ప్రారంభించాయి. దీంతో గడిచిన ఐదరేళ్లలో ఆ దేశంలో ప్రవాసుల సంఖ్య గణనీయంగా తగ్గడం మొదలైంది. ఇక తాజాగా వెలువడిన సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లలో ఈ సంఖ్య ఏకంగా 3.70లక్షలకు తగ్గడం గమనార్హం. 2018లో 2,891,255గా ఉన్న ప్రవాసుల సంఖ్య 2021 నాటికి 2,520,301కు పడిపోయింది. ఇదే సమయంలో వర్క్ పర్మిట్ల పొందిన వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. కేవలం 11వేల మంది మాత్రమే వర్క్ పర్మిట్లు పొందడం జరిగింది. 2018లో 1,07,657 మంది వలసదారులు వర్క్ పర్మిట్లు పొందితే.. 2021లో 96,800 మందికి మాత్రమే వర్క్ పర్మిట్లు దక్కాయి. 


అటు డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2018లో 7,07,000గా ఉంటే.. 2021 వచ్చే సరికి 5,91,368కు పడిపోయింది. అంటే మూడేళ్లలో 1,15,700 మంది తగ్గిపోయారు. దీంతో ఆ దేశంలో పనిమనుషుల తీవ్ర కొరత ఏర్పడింది. ఇది కరోనా సంక్షోభ సమయంలో తారస్థాయికి చేరింది. ఇక ప్రైవేట్ రంగంలోనైతే వలసదారులు భారీగా తగ్గిపోయారు. 2018లో ప్రైవేట్ సెక్టార్ పనిచేస్తున్న ప్రవాసుల సంఖ్య 1,531,000గా ఉంటే.. 2021 నాటికి 1,249,000కు తగ్గిపోయింది. మరోవైపు ఈ మూడేళ్లలో రెసిడెన్సీ ఉల్లంఘనదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సుమారు 51వేల మేర ఉల్లంఘనదారులు పెరిగినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. 2018లో ఆ దేశంలో 1,00,560 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు ఉంటే.. 2021 నాటికి ఈ సంఖ్య 1,51,690కు పెరిగింది. ఇందులో అధిక భాగం డొమెస్టిక్ వర్కర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 48.5శాతం మంది గృహకార్మికులు ఇలా చట్ట విరుద్ధంగా కువైత్‌లో ఉన్నట్లు డేటా చెబుతోంది.  

Updated Date - 2022-03-16T15:51:01+05:30 IST