‘ఆకర్ష్‌’కు పదును

ABN , First Publish Date - 2022-08-10T09:14:03+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ జోరును పెంచింది.

‘ఆకర్ష్‌’కు పదును

21న షా సభలో భారీ చేరికలకు యత్నాలు

మునుగోడు ఉప ఎన్నికకు మరింత జోష్‌కే..

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అసంతృప్తులతో చర్చలు

సినీనటి జయసుధతోనూ నేతల సంప్రదింపులు

ఓ సినీ నిర్మాతనూ పార్టీలోకి రప్పించే యత్నం

రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లతోనూ మంతనాలు

బండి సంజయ్‌తో రాజగోపాల్‌రెడ్డి భేటీ


హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ జోరును పెంచింది. ఆ నియోజకవర్గంలో ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన కేంద్రమంత్రి అమిత్‌షా బహిరంగసభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ నేతలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలకు ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ప్రముఖుల చేరిక ద్వారా మరింత జోష్‌ పెంచాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలకు చెందిన పలువురు సీనియర్‌ నేతలతోపాటు సినీ ప్రముఖులతో, రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోనూ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


ప్రముఖ సినీనటి జయసుధ, ఉత్తర తెలంగాణకు చెందిన ఒక సినీ నిర్మాతతో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు మంతనాలు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వివరించాయి. జయసుధ 2009లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీలో చేరాలన్న ఆ పార్టీ నేతల ప్రతిపాదనపై జయసుధ స్పష్టత ఇవ్వలేదని కమలం వర్గాలు పేర్కొన్నాయి. తనకు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి విస్పష్ట హామీ ఇవ్వాలని ఆమె కోరినట్లు వెల్లడించాయి. మరోవైపు మాజీ ఐఏఎస్‌ అధికారి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రతినిధి తేజావత్‌ రామచంద్రునాయక్‌తోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు సీనియర్‌ నేతలతో, ఉద్యమకారులతో బీజేపీ చేరికల కమిటీ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 


Updated Date - 2022-08-10T09:14:03+05:30 IST