Congress Chintan Shivir : కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యంపై శశి థరూర్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-15T18:37:45+05:30 IST

నవ సంకల్ప చింతన్ శివిర్‌లో చర్చలు అత్యంత సన్నిహితంగా

Congress Chintan Shivir : కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యంపై శశి థరూర్ వ్యాఖ్యలు

ఉదయ్‌పూర్ (రాజస్థాన్) : కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ శివిర్‌లో చర్చలు అత్యంత సన్నిహితంగా జరుగుతున్నాయని, అనేక అభిప్రాయాలను పంచుకున్న తర్వాత స్నేహపూర్వక పరిష్కారాలు లభించాయని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) చెప్పారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి ఈ చర్చలు గొప్ప నిదర్శనమని తెలిపారు. ఈ మేధోమథనం సమావేశాల చివరి రోజైన ఆదివారం ఆయన కొన్ని గ్రూప్ ఫొటోలను ట్వీట్ చేశారు. 


శశి థరూర్ కేరళలోని తిరువనంతపురం (Tiruvanantha Puram) లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటులో ప్రాతినిధ్యంవహిస్తున్నారు. దాదాపు ఓ సంవత్సరం క్రితం కాంగ్రెస్ (Congress)  అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)కి లేఖ రాసిన 23 మంది నేతల్లో ఆయన కూడా ఉన్నారు. 


‘‘గత రాత్రి మా చర్చలు వాయిదా పడిన తర్వాత రాజకీయ సంఘం కొందరు సభ్యులం గ్రూప్ ఫొటో కోసం కలిశాం. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి గొప్ప ఉదాహరణ ఈ చర్చలు. అభిప్రాయాలపై నిశితంగా చర్చించాం, సామరస్యపూర్వక పరిష్కారాలు లభించాయి’’ అని ఓ ట్వీట్ చేశారు. 


మహిళా కాంగ్రెస్ నేతలతో కలిసి తాను తీయించుకున్న ఫొటోను మరొక ట్వీట్‌లో శశి పోస్ట్ చేశారు. నవ సంకల్ప చింతన్ శివిర్ వద్ద మహిళా కాంగ్రెస్ ప్రతినిధుల గ్రూప్ సెల్ఫీకి తనను ఆహ్వానించారని తెలిపారు. ఈ సమావేశాలకు వైవిద్ధ్యభరితమైన వ్యక్తులు వచ్చారని, ఇది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పార్టీ సహచరులను కలుసుకునేందుకు ఓ అద్భుతమైన అవకాశం లభించిందని చెప్పారు. పళ్లంరాజు, జిగ్నేశ్ మేవానీ, మణిశంకర్ అయ్యర్ వంటి మిత్రులను కలుసుకున్నట్లు తెలిపారు. 


పార్టీని ప్రక్షాళన చేయాలని గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన నేతలు ఈ మేధోమథనం శిబిరంలో తమ గళాన్ని వినిపించగలిగారు. 1991లో పీవీ నరసింహా రావు హయాంలో రద్దయిన పార్టీ పార్లమెంటరీ బోర్డును మళ్ళీ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై తుది నిర్ణయం ఆదివారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో జరుగుతుంది. 


Updated Date - 2022-05-15T18:37:45+05:30 IST