Shashi Tharoor: శశిథరూర్‌కు సోనియా ఆశీస్సులు.. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో అమీతుమీ!

ABN , First Publish Date - 2022-09-20T03:23:05+05:30 IST

కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి రాకకు సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల

Shashi Tharoor: శశిథరూర్‌కు సోనియా ఆశీస్సులు.. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో అమీతుమీ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి రాకకు సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఎన్నికలపై తొలి నుంచీ ఆసక్తి చూపిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) తాజాగా పార్టీ చీఫ్ సోనియాగాంధీ (sonia gandhi)ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి తిరిగి పగ్గాలు అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరోవైపు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) ప్రతిష్ఠ రోజురోజుకు దిగజారిపోతున్న నేపథ్యంలో దిశానిర్దేశం చేసే నాయకుడి కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 17న  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.


శశిథరూర్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగడంపై తాజాగా స్పష్టత వచ్చింది. దీపేందర్ హుడా, జై ప్రకాశ్ అగర్వాల్, విజేందర్ సింగ్‌తో కలిసి థరూర్ సోమవారం సోనియాను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై చర్చించారు. థరూర్ తన మనసులోని మాటను అధినేత్రి వద్ద బయటపెట్టారు. స్పందించిన సోనియా.. ‘‘నిర్ణయం మీదే.. ఎలక్టోరల్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి’’ అని థరూర్‌తో చెప్పారని సమాచారం. దీంతో శశిథరూర్ పోటీ పక్కా అని తేలిపోయిందని ఆయా వర్గాలు తెలిపాయి.


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే విషయంలో త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని థరూర్ ఇది వరకే చెప్పారు. సోనియాకు లేఖ రాసిన జి-23 అసమ్మతి నేతల్లో శశిథరూర్ లేకపోయినప్పటికీ పార్టీలో సంస్కరణలు అవసరమని థరూర్ బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. ఏడాది మార్చిలో ఆయన కూడా జి-23 నేతలను కలుసుకున్నారు. మలయాళం డైలీ ‘మాతృభూమి’కి రాసిన కథనంలో.. పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకోవడమంటే పార్టీకి ఎంతో అవసరమైన పునరుజ్జీవ ప్రక్రియ ఆరంభమైనట్టేనని పేర్కొన్నారు.


అధ్యక్ష పదవికి మరో అభ్యర్థి

 కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ నెల 26-28 మధ్య అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. 


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు

అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ఎట్టకేలకు అధ్యక్ష ఎన్నికలను ప్రకటించింది. అక్టోబరు 17న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోతుంది. 17న ఎన్నికలు జరగనుండగా రెండు రోజుల తర్వాత అంటే 19న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్.. ఇవి బహిరంగ ఎన్నికలని, ఎవరైనా  పోటీ చేయొచ్చని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండోసారి ఓడిన తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తిరిగి ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-09-20T03:23:05+05:30 IST