మహిళా ఎంపీలతో సెల్ఫీ... విమర్శలపాలైన శశి థరూర్...

Nov 29 2021 @ 15:47PM

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ట్వీట్‌తో సోమవారం చాలా మంది ఆగ్రహానికి గురయ్యారు. రచయిత, వక్త, మేధావిగా పేరొందిన శశి థరూర్ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అయ్యుండి, తోటి మహిళా ఎంపీల అందచందాలు, ఆకర్షణీయత గురించి సగటు మగవాడిలా కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది. ఆయన చాలా సంతోషంగా చేసిన వ్యాఖ్యలు ఎదురు తిరగడంతో క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇటువంటి తిరోగమన వ్యాఖ్యలను మానుకోవాలని కొందరు ఆయనకు సలహా ఇచ్చారు. 


పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి తీసుకున్న సెల్ఫీని శశి థరూర్ ట్వీట్ చేశారు.  లోక్‌సభ ఆకర్షణీయ పని ప్రదేశం కాదని ఎవరు అంటారని ప్రశ్నించారు. దీంతో చాలా మంది ఆయనపై మండిపడ్డారు. 


‘‘పని చేయడానికి లోక్‌సభ ఆకర్షణీయ ప్రదేశం కాదని ఎవరు చెబుతారు? ఈ ఉదయం నా సహచరుల్లో ఆరుగురితో’’ అని శశి థరూర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు జత చేసిన సెల్ఫీలో ఆయనతోపాటు సుప్రియా సూలే (ఎన్‌సీపీ), ప్రెనీత్ కౌర్ (కాంగ్రెస్), తమిళచి తంగపాండ్యన్ (డీఎంకే), మిమి చక్రబర్తి (టీఎంసీ), నుస్రత్ జహాన్ (టీఎంసీ), జోతిమాన్ సెన్నిమలై (కాంగ్రెస్) ఉన్నారు. 


ఈ ఫొటోకు పెట్టిన క్యాప్షన్‌పై పెద్ద దుమారం రేగింది. ఆయన మహిళలపట్ల వివక్షతో వ్యవహరించారని కొందరు ఆరోపించారు.  దీంతో శశి థరూర్ వివరణ ఇచ్చారు. మహిళా ఎంపీల చొరవతోనే చాలా సరదాగా ఈ సెల్ఫీ తీసుకున్నట్లు తెలిపారు. ఆ మహిళా ఎంపీలే ఈ ఫొటోను ట్వీట్ చేయాలని తనను కోరినట్లు తెలిపారు. అయితే దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందుకు సారీ అన్నారు. ఈ వర్క్‌ప్లేస్ స్నేహ ప్రదర్శనలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. 


ఈ సెల్ఫీని మిమి చక్రవర్తి తీసినట్లు తెలుస్తోంది. శశి థరూర్ ఈ మహిళా ఎంపీల మధ్యలో ఉన్నారు. థరూర్ ఇచ్చిన పోస్ట్‌ను ఈ ఎంపీలు కూడా తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 


సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ నుండీ స్పందిస్తూ, రాజకీయాల్లో ఉన్న లేదా రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలను తక్కువ చేసి చూపుతున్నారని మండిపడ్డారు. ఆకర్షణీయంగా ఉండటమే ప్రధాన సూత్రం, ప్రమాణం అని చెప్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశారనేదానితో సంబంధం లేదన్నారు. 


మరొక ట్విటరాటీ స్పందిస్తూ, ఈ ఫొటో చాలా బాగుందని, అయితే క్యాప్షన్ మాత్రం అంత బాగులేదని అన్నారు. దీనిని కొందరు అభ్యుదయవాదంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఇటువంటి తిరోగమన క్యాప్షన్లను నివారించాలన్నారు. వాటిని మహిళల చొరవతో పెట్టినప్పటికీ నివారించాలని తెలిపారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.