పగ్గాల కోసం చిన్నమ్మ కమలాస్త్రం?

ABN , First Publish Date - 2022-03-15T14:37:24+05:30 IST

అన్నాడీఎంకేను హస్తగతం చేసుకునేందుకు శశికళ ‘కమలాస్త్రాన్ని’ శరణుజొచ్చారా?.. అన్నాడీఎంకే దరి చేరేందుకు ఈపీఎస్‌ వర్గం అన్ని విధాలా అడ్డుకుంటుండడంతో గత్యంతరం లేక బీజేపీ పెద్దల్ని శరణుజొచ్చారా?..

పగ్గాల కోసం చిన్నమ్మ కమలాస్త్రం?

             - అన్నాడీఎంకేలో చేరేందుకు బీజేపీతో శశికళ రాయబేరాలు


చెన్నై: అన్నాడీఎంకేను హస్తగతం చేసుకునేందుకు శశికళ ‘కమలాస్త్రాన్ని’ శరణుజొచ్చారా?.. అన్నాడీఎంకే దరి చేరేందుకు ఈపీఎస్‌ వర్గం అన్ని విధాలా అడ్డుకుంటుండడంతో గత్యంతరం లేక బీజేపీ పెద్దల్ని శరణుజొచ్చారా?.. అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు! ఆ మేరకు బీజేపీ అగ్ర నేతలతో రాయబేరాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆధ్యాత్మిక పర్యటన పేరుతో శశికళ మూడు రోజులపాటు జరిపిన దక్షిణాది జిల్లాల పర్యటనలో అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘనస్వాగతం పలకటం ఆమెలో ఉత్సాహాన్ని నింపింది. అన్నాడీఎంకే శ్రేణులంతా తన వెంటే ఉన్నారంటూ ఆ పర్యటనలో పలుచోట్ల పదే పదే ప్రకటించారు. ఆ పర్యటనలో అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం సోదరుడు రాజా కూడా ఆమెను రెండుసార్లు కలుసుకుని పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. రాజా ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళనే తాను గుర్తిస్తానని, తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ఈపీఎస్‌, ఓపీఎస్‌లకు లేదని ప్రకటించి తిరుగుబాటు చేశారు. పన్నీర్‌సెల్వం గతంలో శశికళను పార్టీలో చేర్చుకునే విషయాన్ని పార్టీ నాయకుల సమావేశంలో ప్రస్తావించి అభాసుపాలయ్యారు. ఎడప్పాడి వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన తన మనస్సు మార్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళ ఎలాగైనా అన్నాడీఎంకేలో చేరాలని తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ మేరకు బీజేపీ జాతీయ నాయకులు కొందరితో ఆమె రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తనను అన్నాడీఎంకేలో చేర్చుకునేలా ఆ పార్టీ నేతలు ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంకు నచ్చచెప్పాలంటూ విన్నవించినట్లు తెలిసింది. ‘‘జైలు నుంచి రాగానే మీరు చెప్పినట్లే నేను పక్కకు తప్పుకున్నాను. ఓట్లు చీలే అవకాశమున్నందున పార్టీకి దూరంగా ఉండాలంటూ మీరు చెప్పడం వల్లే నేను దూరంగా ఉండిపోయాను. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తున్నా.. నేను పార్టీలోకి చేరే మార్గం కనిపించడం లేదు. ఇక నా బాధ్యత మీదే’’ అంటూ శశికళ బీజేపీ అగ్రనేతలకు సందేశం పంపినట్లు విశ్వసనీయ సమాచారం. శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని కోల్పోవటానికి, ఇటీవల జరిగిన మున్సిప్‌ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవటానికి ఆ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడమే ప్రధాన కారణమని బీజేపీ నాయకులకు ఆమె వివరించారు. భవిష్యత్‌లో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య బలమైన కూటమి ఏర్పడానికి తాను సహాయ సహకారాలు అందిస్తానని, ఈ అంశాన్ని గుర్తుంచుకుని తనను ఎలాగైనా అన్నాడీఎంకే పార్టీలో చేర్చుకునేలా చూడాలని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.


శశికళకు ఈపీఎస్‌, ఓపీఎస్‌ బ్రేక్‌...!

బీజేపీ జాతీయ నాయకులతో శశికళ రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలియడంతో ఆమెను పార్టీలో చేరకుండా ఉండేందుకు అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ మేరకు వీలైనంత త్వరగా పార్టీ సంస్థాగత ఎన్నికలను ముగించి సర్వసభ్యమండలి సమావేశం జరపాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈ నెల 20న శశికళ జరుపనున్న తంజావూరు, సేలం జిల్లాల పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు పాల్గొనకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. శశికళ పర్యటనలో పాల్గొనే పార్టీ నాయకులు, కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు. ఈ నెల 20న శశికళ భర్త నటరాజన్‌ వర్థంతి కార్యక్రమాలు తంజావూరు జిల్లా విలార్‌కుళంలో జరుగనున్నాయి. ఆ కార్యక్రమంలో పాల్గొనేలా శశికళ తంజావూరు, సేలం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పరిస్థితుల్లోనే అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి. పన్నీర్‌సెల్వం పార్టీలో అడుగుపెట్టనీయకుండా సర్వసభ్య మండలిలో ప్రత్యేక తీర్మానం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా శాఖ నాయకులకు అన్నాడీఎంకే నేతలిరువురూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఏపిల్ర్‌ నెలాఖరులోగా పార్టీ కార్యనిర్వాహక మండలి, సర్వసభ్య మండలి సమావేశాలను జరిపి శశికళకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని ఎడప్పాడి పన్నీర్‌సెల్వం నిర్ణయించారు.

Updated Date - 2022-03-15T14:37:24+05:30 IST