Shashikala: చేతులు ముడుచుకుని కూర్చోను

ABN , First Publish Date - 2022-09-23T13:20:36+05:30 IST

అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ(Shashikala) రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. డీఎంకే నేతలు అధికార మదంతో అరాచకాలకు

Shashikala: చేతులు ముడుచుకుని కూర్చోను

- అధికారమదంతో అరాచకాలు 

- స్టాలిన్‌ ప్రభుత్వంపై శశికళ ధ్వజం


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 22: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ(Shashikala) రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. డీఎంకే నేతలు అధికార మదంతో అరాచకాలకు పాల్పడుతున్నారని, ఈ అక్రమాలను తాను చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చోబోనని హెచ్చరించారు. పాలక పార్టీ నేతలు చివరకు రోడ్డుపై పూలు విక్రయించుకునే మహిళల దగ్గర కూడా మామూళ్ళు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్ర పర్యటనలో వున్న శశికళ బుధవారం రాత్రి తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్ళలో ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని, డీఎంకే ప్రభుత్వం ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా పన్నులు, కరెంట్‌ చార్జీలను పెంచేసిందన్నారు. ప్రజల కష్టాలను ఏమాత్రం పట్టించుకోని డీఎంకే పాలకులు.. మరో ఐదేళ్ళపాటు మనకు ఢోకాలేదన్న అధికారమదంతో నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వారికి రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం నేర్పాల్సి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులు గెలుపొందిన తర్వాత బలవంతపు వసూళ్ళు ఎక్కువయ్యాయని, చివరకు రోడ్డుపై వ్యాపారాలుచేసే మహిళల నుంచి కూడా మామూళ్ళు గుంజడం దారుణమన్నారు. దివంగత జయలలిత పాలనలో అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా జీవించారన్నారు. ఇపుడు ఆమె లేకపోవడంతో ఒక చెల్లిగా ఆ బాధ్యతలను తాను స్వీకరించి, ప్రజలకు మేలు చేసేందుకు, వారికి అండగా ఉండేందుకు ముందుకు వచ్చినట్టు ప్రకటించారు. అమ్మ పాలనలో పోలీస్‌ స్టేషన్లలోకి రాజకీయ నేతలకు ప్రవేశం లేదన్నారు. కానీ, ఇపుడు స్టేషన్లు డీఎంకే(DMK) నేతలతో నిండిపోతుండడంతో సీఐలు, ఎస్‌ఐలు కూర్చోనేందుకు కుర్చీలు లేక లేచి నిలబడుతున్నారని శశికళ ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే మంచి చేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

Updated Date - 2022-09-23T13:20:36+05:30 IST